Pawan Kalyan: యువకుడు కూడా చంద్రబాబులా పని చేయలేడు, మేం అండగా ఉంటాం - పవన్ కల్యాణ్
AP Latest News: మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ కల్యాణ్ మాట్లాడారు. ఈ సందర్భంగా చంద్రబాబును, ఆయన పని తీరును ప్రశంసించారు.
Pawan Kalyan Comments in Mangalagiri: ముఖ్యమంత్రి చంద్రబాబు గత ఐదేళ్ల కాలంలో ఎన్ని అవమానాలకు గురిచేసినా అధైర్య పడలేదని డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ అన్నారు. సీఎం చంద్రబాబుకు ధైర్యం చాలా ఉందని.. ఆయనకు భయం లేదని పవన్ కొనియాడారు. చంద్రబాబు ఓపిక తనను ఆశ్చర్యపరుస్తుందని.. పాతికేళ్ల యువకుడు కూడా చంద్రబాబులా కష్టపడలేరని పవన్ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. సీఎం బురదలో దిగి నడుస్తుంటే.. వైసీపీ విమర్శలు చేస్తుందని.. ఆయన చేసే మంచి పనులను గుర్తించి తాము అండగా ఉంటామని పవన్ కల్యాణ్ చెప్పారు.
మంగళగిరిలో ఏర్పాటు చేసిన ఎన్డీయే కూటమి శాసనసభాపక్ష సమావేశంలో పవన్ మాట్లాడారు. ఇది మంచి ప్రభుత్వం పేరుతో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కూటమి పార్టీల అధినేతలతో పాటు ఎమ్మెల్యేలు కూడా హాజరయ్యారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ మాట్లాడుతూ.. తాము అధికారంలోకి వచ్చేందుకు ఎదురైన సవాళ్లు, గత ప్రభుత్వం తమను వేధించిన తీరును గుర్తు చేశారు. ప్రస్తుతం తమకు ఎదురవుతున్న సవాళ్లను కూడా వివరించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటు చీలకూడదనే లక్ష్యంతో తాము టీడీపీతో కలిసి పనిచేశామని పవన్ కల్యాణ్ అన్నారు. మీరు గెలవలేరు అని కొంత మంది చెప్పే వాళ్ళని.. కానీ చంద్రబాబు మాత్రం, 160 సీట్లు గెలుస్తున్నాం.. ఈసారి కొడుతున్నాం అని మొదటి రోజు నుంచి చెప్పే వారని గుర్తు చేశారు.
చంద్రబాబుకి భయం లేదు.. ఎన్ని అవమానాలకు గురిచేసినా అధైర్య పడలేదు.. రాజకీయాల్లో అవమానాలు ఉంటాయి.. భరిస్తూ ముందుకెళ్లాలని చెప్పేవారని అన్నారు. చంద్రబాబుని జైలులో ఉంచినప్పుడు తాను షూటింగ్స్ లో పాల్గొనలేకపోయానని చెప్పారు. ఇప్పుడు చంద్రబాబు హాయాంలో పని చేయడం సంతోషంగా ఉందని పవన్ అన్నారు.
పింఛన్లు పెంచేందుకు చాలా కష్టపడ్డాం
ఏపీలో పింఛన్లు పెంచేందుకు కూడా ఎంతో తర్జన భర్జన పడ్డామని.. గత ప్రభుత్వం కారణంగా రాష్ట్ర ఖజానాలో డబ్బులు లేకపోయినప్పటికీ.. ఆర్ధిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పింఛన్లు పెంచామని పవన్ అన్నారు. సీఎం చంద్రబాబు దార్శనికతతోనే ఇదంతా సాధ్యం అయ్యిందని చెప్పారు. చంద్రబాబు తనను అనునిత్యం తనను ఆశ్చర్యపరుస్తూనే ఉంటారని చెప్పారు.
తాము అధికారంలోకి వచ్చిన ఈ 100 రోజుల్లో చాలా హామీలు నెరవేర్చామని.. సంక్షేమంలో తిరుగులేని చరిత్ర సృష్టించామని చెప్పారు. గతంలో ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు సరైన సమయానికి రాకపోతే.. ఇప్పుడు దాన్ని చక్కదిద్దామని అన్నారు. అంతేకాక, పంచాయతీలకు రూ.1,452 కోట్లు ఇచ్చామని చెప్పారు. పార్టీలతో సంబంధం లేకుండా వైఎస్ఆర్ సీపీ సర్పంచ్‌లు ఉన్న పంచాయతీలకు కూడా నిధులు ఇస్తామని చెప్పారు.
మరోవైపు, పేదలు, కార్మికులకు లాభం జరుగుతున్న అన్న క్యాంటీన్లను మూసేయాలని గత ప్రభుత్వానికి ఎందుకు అనిపించిందని ప్రశ్నించారు. ల్యాండ్ టైట్లింగ్ చట్టాన్ని రద్దు చేసి పేదల భూములను రక్షించిన సీఎంకు ధన్యవాదాలు తెలిపారు.
Also Read: తిరుమల లడ్డూలో జంతువుల కొవ్వు, జగన్ హయాంలో అన్నీ అరాచకాలే - చంద్రబాబు సంచలన వ్యాఖ్యలు