Pithapuram Politics: జనసేనలో చేరిన వైసీపీ నేతల పెత్తనం వల్లే సమస్యలు - కూటమిలో అక్కడే గొడవలు జరుగుతున్నాయా?
TDP and janasena: వైసీపీ నేతలు జనసేనలో చేరి పెత్తనం చేస్తూండమే టీడీపీ నేతలకు నచ్చడం లేదు. పిఠాపురంలో దాని వల్లే వివాదాలొస్తున్నాయి.

AP Alliance Politics: పిఠాపురం నియోజకవర్గంలో కూటమి రాజకీయాలు ప్రస్తుతం ఒక రకమైన అంతర్యుద్ధం వైపు మళ్లుతున్నాయి. ఎన్నికల సమయంలో పవన్ కల్యాణ్ గెలుపు కోసం శ్రమించిన శ్రేణులకు, ఇప్పుడు పెత్తనం చెలాయిస్తున్న నేతలకు మధ్య గ్యాప్ పెరగడం నియోజకవర్గంలో చర్చనీయాంశంగా మారింది. పిఠాపురంలో గత ఎన్నికల్లో వైసీపీ తరపున ఉండి, పవన్ కల్యాణ్‌ను ఓడించేందుకు సర్వశక్తులు ఒడ్డిన పెండెం దొరబాబు వంటి నేతలు ఇప్పుడు జనసేన కండువా కప్పుకుని అనధికార ఎమ్మెల్యే గా చక్రం తిప్పడం పాత కార్యకర్తలకు మింగుడుపడటం లేదు. వంగా గీత విజయానికి ఆర్థికంగా, రాజకీయంగా అన్నీ తానై వ్యవహరించిన దొరబాబు, ఇప్పుడు పవన్ ప్రతినిధిగా అధికారులకు ఆదేశాలు జారీ చేయడం స్థానిక టీడీపీ నేతలను విస్మయానికి గురిచేస్తోంది.
వర్మ వర్సెస్ వైసీపీ మాజీలు
పిఠాపురంలో కూటమి ఐక్యతకు పగుళ్లు రావడానికి ప్రధాన కారణం ఎస్వీఎస్ఎన్ వర్మ వర్సెస్ పెండెం దొరబాబు పాత వైరం. తన రాజకీయ భవిష్యత్తును పణంగా పెట్టి పవన్ విజయం కోసం అహర్నిశలు కష్టపడిన వర్మకు, ఇప్పుడు ప్రభుత్వ కార్యక్రమాల్లో సరైన ప్రాధాన్యత దక్కడం లేదనే అభిప్రాయం ఆయన వర్గీయుల్లో ఉంది. ముఖ్యంగా PADA సమావేశాల్లోనూ, ఇతర అభివృద్ధి పనుల్లోనూ వైసీపీ నుంచి వచ్చిన వారికే ప్రాధాన్యత దక్కుతుండటంతో వర్మ వర్గం తీవ్ర అసహనంతో ఉంది. పవన్ ప్రమేయం లేకుండానే దొరబాబు అంతా తానై వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
పవన్ మౌనం.. పెండెం దూకుడు!
ముఖ్యమంత్రికి సన్నిహితంగా ఉంటూ, రాష్ట్ర రాజకీయాల్లో బిజీగా ఉన్న పవన్ కల్యాణ్, పిఠాపురం అంతర్గత గొడవలపై నేరుగా దృష్టి పెట్టకపోవడం సమస్యలను మరింత సంక్లిష్టంగా మారుస్తోంది. పవన్ నమ్మకాన్ని ఆసరాగా చేసుకుని, పాత వైసీపీ శ్రేణులు జనసేన ముసుగులో అధికారులపై పెత్తనం చెలాయిస్తున్నాయన్న ఆరోపణలు వస్తున్నాయి. ముఖ్యంగా భూములు, ఇసుక , స్థానిక కాంట్రాక్టుల విషయంలో ఈ కొత్త జనసైనికుల ప్రమేయం పెరగడంపై టీడీపీ క్యాడర్‌లో వ్యతిరేకత మొదలైంది. పవన్ బిజీగా ఉండటం, అధికారులతో భేటీల బాధ్యతను దొరబాబు వంటి వారికి అప్పగించడం క్షేత్రస్థాయిలో కూటమికి డ్యామేజ్ కలిగిస్తోంది.
ప్రోటోకాల్ రచ్చతో సమస్యలు
పిఠాపురం పీఏడీఏ కార్యాలయంలో జరిగిన రచ్చ టీడీపీకి తలపోటుగా మారింది. ఒకవైపు ఎన్నికల ముందు వరకు తమను వేధించిన వైసీపీ నేతలు ఇప్పుడు జనసేనలో ఉండి ఆదేశిస్తుంటే, మరోవైపు కూటమి ధర్మాన్ని కాపాడాలని పార్టీ హైకమాండ్ ఆదేశిస్తోంది. ప్రభుత్వ కార్యాలయాల్లో ముఖ్యమంత్రి ఫోటో కంటే తమ నాయకుడి ఫోటోలకే ప్రాధాన్యత ఉండటం.. ప్రోటోకాల్ వివాదాలకు కేంద్రబిందువుగా మారుతోంది. ఇది పరిపాలనాపరంగా కూడా అడ్డంకులు సృష్టిస్తోంది.
వైసీపీ నుంచి వచ్చిన వారు కోవర్టులంటున్న టీడీపీ నేతలు
వైసీపీ నుంచి వచ్చిన వారు కావాలనే టీడీపీ-జనసేన మధ్య విభేదాలు సృష్టించి, పవన్ కల్యాణ్ గ్రాఫ్‌ను తగ్గించేందుకు ప్రయత్నిస్తున్నారని టీడీపీ నేతలంటున్నారు. వర్మను టార్గెట్ చేయడం ద్వారా టీడీపీని దూరం చేయడం, తద్వారా పవన్‌ను ఒంటరిని చేయడం వెనుక పెద్ద కుట్ర ఉందని అంటున్నారు. పవన్ కల్యాణ్ వెంటనే జోక్యం చేసుకుని, పిఠాపురంలో ఒక బలమైన యంత్రాంగాన్ని ఏర్పాటు చేయకపోతే, రాబోయే రోజుల్లో కూటమిలో చిచ్చు పెరగడం ఖాయమన్న అభిప్రాయం వ్యక్తమవుతోంది.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు






















