![ABP Premium](https://cdn.abplive.com/imagebank/Premium-ad-Icon.png)
Pawan Kalyan: పిఠాపురం నుంచే పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - జనసైనికులకు కీలక సూచనలు
Andhra Politics: ఏపీలో ఎన్నికల ప్రచారానికి పార్టీలు సిద్ధమవుతున్నాయి. జనసేనాని పవన్ కల్యాణ్ తాను పోటీ చేస్తోన్న పిఠాపురం నుంచే ప్రచార శంఖారావం పూరించనున్నారు.
![Pawan Kalyan: పిఠాపురం నుంచే పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - జనసైనికులకు కీలక సూచనలు janasena chief pawan kalyan started his election campaign from pithapuram Pawan Kalyan: పిఠాపురం నుంచే పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారం - జనసైనికులకు కీలక సూచనలు](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/03/22/512cfa91631c05896a78f4d96991875b1711119506300876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Pawan Kalyan Election Campaign From Pithapuram: ఏపీలో ఎన్నికల వేడి మొదలైంది. ఇప్పటికే అధికార వైసీపీ సహా టీడీపీ కూటమి తమ ప్రచార వ్యూహాలకు కార్యాచరణ సిద్ధం చేస్తున్నారు. ఈ క్రమంలో జనసేనాని పవన్ కల్యాణ్ ఎన్నికల ప్రచారంపై జనసేన శుక్రవారం కీలక ప్రకటన చేసింది. ఆయన పిఠాపురం నుంచే ఎన్నికల ప్రచారానికి శ్రీకారం చుడతారని వెల్లడించింది. వారాహి వాహనం నుంచి పవన్ ప్రచారం చేస్తారని.. పిఠాపురం కేంద్రంగానే రాష్ట్రవ్యాప్తంగా ప్రచారం చేయనున్నట్లు తెలిపింది. శక్తిపీఠం కొలువైన స్థలం.. శ్రీపాద వల్లభుడు జన్మించిన ప్రాంతం నుంచే ఎన్నికల శంఖారావానికి ప్రచారం ప్రారంభించాలని పవన్ నిర్ణయించినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఆయన పార్టీ నేతలతో కీలక సమావేశం నిర్వహించి వారికి దిశా నిర్దేశం చేశారు.
3 రోజులు పిఠాపురంలోనే
పవన్ కల్యాణ్ 3 రోజులు పిఠాపురంలోనే ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. పురుహూతికా దేవికి ప్రత్యేక పూజలు నిర్వహించి వారాహి వాహనం నుంచి ఎలక్షన్ క్యాంపెయిన్ ప్రారంభించనున్నారు. ఈ క్రమంలో నియోజకవర్గ నాయకులు, పార్టీ శ్రేణులతో ఆయన భేటీ కానున్నారు. కాగా, పవన్ కల్యాణ్ తాను పిఠాపురం నుంచే ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తానని ఇటీవల ప్రకటించారు. ప్రస్తుతానికి ఎంపీగా పోటీ చేసే ఆలోచన తనకు లేదని స్పష్టం చేశారు.
'విజయం మాదే'
వచ్చే ఎన్నికల సమరంలో టీడీపీ - బీజేపీ - జనసేన కూటమిదే కచ్చితంగా విజయమని పవన్ కల్యాణ్ పునరుద్ఘాటించారు. 'నేను పిఠాపురంలో పోటీ చేస్తుండడంతో వైసీపీ ఎన్నో పన్నాగాలు పన్నుతోంది. జనసేన శ్రేణులు ప్రతీ దశలోనూ అప్రమత్తంగా ఉండాలి. ఈ ఎన్నికలు రాష్ట్ర భవిష్యత్తును నిర్ణయించబోతున్నాయి. పిఠాపురం నుంచే ఎన్నికల శంఖారావం పూరిస్తున్నాం. ఎన్నికల కోడ్, ఈసీ నిబంధనలు పాటించడంపైనా జనసైనికులు పూర్తి అవగాహనతో ఉండాలి.' అని జనసేనాని స్పష్టం చేశారు.
మరోవైపు, టీడీపీ సైతం ప్రచార వ్యూహాలకు పదును పెడుతోంది. ఇప్పటికే ఆ పార్టీ అధినేత చంద్రబాబు 'రా..కదలిరా' సభలతో ప్రజల్లోకి వెళ్లారు. నారా లోకేశ్ యువగళం, చంద్రబాబు ప్రజాగళం సభలతో ప్రచారం నిర్వహించారు. ఇటీవల టీడీపీ - బీజేపీ - జనసేన కూటమి నిర్వహించిన చిలకలూరిపేట ప్రజాగళం సభలో ప్రధాని మోదీ పాల్గొన్నారు. మరోవైపు, చంద్రబాబు సతీమణి నారా భువనేశ్వరి సైతం ప్రచారం నిర్వహిస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు.
ప్రత్యేక వర్క్ షాప్
మరోవైపు, టీడీపీ లోక్‌సభ, శాసనసభ అభ్యర్థులకు ఈ నెల 23న (శనివారం) విజయవాడలో ప్రత్యేక వర్క్‌షాప్ నిర్వహిస్తోంది. ఏ1 కన్వెన్షన్ సెంటర్‌లో జరిగే ఈ కార్యక్రమానికి పార్టీ అధినేత చంద్రబాబు హాజరవుతారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఈ కార్యక్రమం జరుగుతుంది. అభ్యర్థులతో పాటు ప్రతి నియోజకవర్గానికి సంబంధించి వారు ఇప్పటికే నియమించుకున్న అడ్మినిస్ట్రేటివ్ మేనేజర్, పొలిటికల్ మేనేజర్, మీడియా మేనేజర్, సోషల్ మీడియా మేనేజర్లను వర్క్ షాప్‌నకు పిలిచారు. రాబోయే 2 నెలల ఎన్నికల కార్యాచరణ, పోల్ మేనేజ్‌మెంట్‌లో అనుసరించాల్సిన వ్యూహాలపై ఈ వర్క్ షాప్‌లో వారికి అవగాహన కల్పిస్తారని తెలుస్తోంది. ఇందులో పాల్గొనేందుకు ఇప్పటికే టీడీపీ అభ్యర్థులు విజయవాడ చేరుకున్నారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)