Bapatla TDP MP Candidate : తెలంగాణ బీజేపీ నేతకు ఏపీలో ఎంపీ టిక్కెట్ - టీడీపీ నేతలకు షాకిచ్చిన చంద్రబాబు నిర్ణయం !
Tenneti Krishna Prasad : చంద్రబాబు ఉదయం ప్రకటించిన ఎంపీ అభ్యర్థుల జాబితాలో బాపట్ల అభ్యర్థి పేరు అందర్నీ ఆకర్షించింది. ఎందుకంటే ఆయన తెలంగాణ బీజేపీ నేత.
Bapatla MP ticket : తెలుగుదేశం పార్టీ ప్రకటించిన ఎంపీల జాబితాలో బాపట్ల నుంచి అభ్యర్థిగా తెన్నేటి కృష్ణ ప్రసాద్ ఉన్నారు. మామూలుగా బాపట్ల నుంచి ఉండవల్లి శ్రీదేవి పేరు ఎక్కువగా వినిపించింది. తర్వాత టీడీపీ ఎస్సీ సెల్ చైర్మన్ ఎంఎస్ రాజు పేరు వినిపించింది. కానీ హఠాత్తుగా కృష్ణప్రసాద్ పేరు ఖరారు అయింది.
బీజేపీ వరంగల్ టిక్కెట్ కోసం ప్రయత్నించిన కృష్ణప్రసాద్
పోలీస్ అధికారిగా రిటైర్ అయిన తర్వాత బీజేపీలో చేరారు కృష్ణ ప్రసాద్. బీజేపీ తరపున వరంగల్ టిక్కెట్ ఆశించారు. కొంత కాలంగా వరంగల్‌లో సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్న తెన్నేటి కృష్ణప్రసాద్ వరంగల్ టిక్కెట్ కోసం తీవ్రంగా ప్రయత్నించారు. ప్రధాని మోదీ పర్యటనల్లో కూడా ఆయనకు స్వాగతం పలికారు. కానీ వరంగల్ బీజేపీ టిక్కెట్ బీఆర్ఎస్ నుంచి వచ్చిన మాజీ ఎమ్మెల్యే ఆరూరి రమేష్‌కు కేటాయించనున్నారు. దీంతో కృష్ణప్రసాద్ కు ఎక్కడా అవకాశం దక్కదనుకున్నారు. కానీ ఆయనకు చంద్రబాబు చాన్స్ ఇచ్చారు.
చంద్రబాబుకు ఎవరు సిఫారసు చేశారు ?
విజయవాడ పోలీస్ కమిషనర్‌గా, వరంగల్, విశాఖ రేంజ్‌లలో డిఐజిగా పనిచేశారు. నెల్లూరు, విశాఖపట్నం, మెదక్, గుంటూరు ఎస్పీలుగా గతంలో పనిచేశారు. ఉమ్మడి గుంటూరులో భాగమైన బాపట్లలో లోక్‌సభ్ ఎన్నికల్లో పోటీ చేయడానికి గతంలో ఎస్పీగా పనిచేసిన అనుభవం పనికొస్తుందనే ఉద్దేశంతో కృష్ణ ప్రసాద్ అభ్యర్ధిత్వానికి టీడీపీ మొగ్గు చూపినట్లుగా చెబుతున్నారు. తెలంగాణలో టిక్కెట్ ఇవ్వనందున.. ఏపీలో టీడీపీ తరపున చాన్స్ ఇవ్వాలని బీజేపీ పెద్దలు అడిగారన్న ప్రచారం జరుగుతోంది. ఎంతో ఒత్తిడి వస్తే తప్ప చంద్రబాబు ఇలా టిక్కెట్ ఇవ్వరని.. ఎవరు ఒత్తిడి చేసి ఉంటారన్న చర్చ టీడీపీ వర్గాల్లో సాగుతోంది.
సిన్సియర్ ఆఫీసర్‌గా పేరున్న కృష్ణ ప్రసాద్
1960లో హైదరాబాద్ జన్మించిన తెన్నేటి కృష్ణప్రసాద్ తల్లిదండ్రులు ఉపాధ్యాయులుగా పనిచేశారు. తండ్రి సుబ్బయ్య ఐటీఐ ప్రిన్సిపల్‌గా తల్లి విజయలక్ష్మీ స్కూల్ టీచర్‌గా పనిచేశారు. 1986 బ్యాచ్ ఐపీఎస్ అధికారైన కృష్ణ ప్రసాద్ పోలీస్ శాఖలో 34ఏళ్లు పనిచేశారు. ఎన్‌ఐటి వరంగల్ నుంచి బిటెక్ పూర్తి చేసిన కృష్ణప్రసాద్ ఐఐఎం అహ్మదాబాద్ నుంచి ఎంబిఏ పూర్తి చేశారు. మావోయిస్టుల్ని జనజీవన స్రవంతిలో కలకపడంలో కీలక పాత్ర పోషించారు. సంజీవని ఆపరేషన్‌తో మావోయిస్టులను ప్రజా జీవితంలో తీసుకురావడానికి ప్రయత్నించారు. సరెండర్ స్పెషలిస్ట్‌గా గుర్తింపు పొందారు. ఎన్‌కౌంటర్లకు వ్యతిరేకంగా మావోయిస్టులను ప్రజాజీవితంలో కలిసేలా ప్రోత్సహించే వారు. 450మందికి పైగా మావోయిస్టుల్ని తిరిగి జనజీవితంలోకి తీసుకొచ్చిన రికార్డు ఉంది.డిసెంబర్ 2009లో ఐజీ పోలీస్ సర్వీసెస్ హోదాలో ఉమ్మడి ఏపీలో 1865 పోలీస్ స్టేషన్లను కంప్యూటర్లతో అనుసంధానించారు. నాలుగు జిల్లాల్లో ఎస్పీగా పనిచేశారు. రెండు రేంజ్లలో డిఐజిగా విధులు నిర్వర్తించారు.
మరోవైపు బాపట్ల నియోజక వర్గంలో వైఎస్సార్సీపీ తరపున సిట్టింగ్ ఎంపీ నందిగం సురేష్ పేరునును ఖరారు చేశారు. ఎస్సీ రిజర్వుడు నియోజక వర్గమైన బాపట్లలో 2014లో టీడీపీ అభ్యర్ధి మాల్యాద్రి శ్రీరామ్ గెలిచారు. 2019లో వైసీపీ అభ్యర్ధి సురేష్ చేతిలో ఓటమి పాలయ్యారు. టీడీపీకి బలమైన క్యాడర్ ఉన్న బాపట్లలో 2014లో వైసీపీ అభ్యర్ధి అమృతపాణిని మాల్యాద్రి శ్రీరామ్ 32వేల ఓట్లతో ఓడించారు. 2019 ఎన్నికల్లో వైసీపీ అభ్యర్ధి 16వేల ఓట్ల మెజార్టీతో గెలిచారు.