Telugu News: నాడు షాడో సీఎం అన్నారు నేడు జిల్లాకే పరిమితం చేశారు! పెద్దిరెడ్డి పెద్దరికం పోయినట్టేనా?
Peddireddy Ramachandra Reddy: షాడో చీఫ్ మినిస్టర్ స్థాయి నుంచి జిల్లా అధ్యక్షుడిగా మారిన పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి. ఎలక్షన్ తరువాత ఆయన పరపతి ఎందుకు ఒక్కసారిగా పడిపోయింది
Punganoor News: ఒకనాడు ఆయన ఏమి చెబితే అదే సాగేది... పార్టీ కోసం నిరంతరం కష్టపడ్డారు. 2019 ఎన్నికల్లో ఆయన అండతో సీట్లు సాధించారు. అధికారంలోకి రావడానికి చాలా కృషి చేశారు. అధికారంలోకి వచ్చాక షాడో ముఖ్యమంత్రి అనేలా సాగింది. అధికారం కోల్పోయినా వారి ఇంట్లోనే రెండు ఎమ్మెల్యే, ఒక ఎంపీ స్థానం దక్కింది. చివరికి రాష్ట్రస్థాయి నుంచి జిల్లా స్థాయికి పరిమితం కావడం పట్ల సర్వాత్ర విమర్శలు వ్యక్తం అవుతున్నాయి.
చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గంలోని సదుం మండలం యర్రాతివారిపల్లికి చెందిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి స్వగ్రామం. తిరుపతిలోని ఎస్వీయూలో పీహెచ్డీ పూర్తి చేశారు. 1974లో ఎస్వీయూలో విద్యార్థి సంఘం అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు. ఆనాటి కాలంలోనే ఆయనకు చంద్రబాబు రాజకీయ ప్రత్యార్థిగా ఉండేవారు. 1978లో జనతా పార్టీ, కాంగ్రెస్ పార్టీ నుంచి 1985, 1994లో పీలేరు నియోజకవర్గం నుంచి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తరువాత వరుసగా మూడుసార్లు 2004 వరకు ఎమ్మెల్యేగా గెలుపొందారు. 2009లో పుంగనూరు ఎమ్మెల్యేగా గెలిచి రాజశేఖరరెడ్డి హయాంలో మంత్రిగా పని చేశారు. ఆ తరువాత జరిగిన పరిణామాలతో కాంగ్రెస్ నుంచి బయటకు వచ్చి జగన్ మోహన్ రెడ్డి వెంటనే ఉంటూ వచ్చారు. 2014 నుంచి వైసీపీ నుంచి పుంగనూరులో గెలుపొందారు. పార్టీ అధికారంలోకి రాకపోవడంతో జగన్ చేపట్టిన పాదయాత్రకు అడుగడుగునా ఆర్థిక, ప్రజాసహకారం అందించారు.
రాష్ట్రవ్యాప్తంగా జరిగిన పాదయాత్రలో అన్ని తానై నడిపించారని చెప్పక తప్పదు. ఆ తరువాత వైసీపీ సునామీలో పుంగనూరు నుంచి 2019లో మరోసారి గెలిచారు. పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి రాష్ట్ర ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఉన్నా షాడో సీఎం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అనేలా మారింది పరిస్థితి. ఇక రాయలసీమవో అయితే పెద్దిరెడ్డి చెప్పిందే వేదం అనేలా పరిస్థితి మారిపోయింది. ఆయన ఎవరికి చెబితే వారికి పదవులు... ఏది చెబితే అదే జరిగింది. ప్రతిపక్షాలపై మాటలు లేని యుద్దం చేసేవారు. అధికార బలంతో ఎవరిని రాయలసీమలో నామినేషన్ కూడా వేయనీవ్వకుండా స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించేందుకు అన్ని తానే చేశారనే ప్రచారం జరిగింది.
జగన్ వై నాట్ 175 అంటే... వై నాట్ కుప్పం అంటూ కొత్త నినాదానికి తెర తీసింది పెద్దిరెడ్డి. రెండు సార్లు మంత్రిగా కూడా పని చేసారు. ఇక 2024 ఎన్నికలు ప్రజలు ఇచ్చిన తీర్పుతో వైసీపీని పాతాళానికి వెళ్ళి పోయే పరిస్థితి వచ్చింది. 11 సీట్లకు పరిమితం చేశారు ప్రజలు. ఇది ఎవరు ఊహించని అపజయం అనక తప్పదు. ఇలాంటి పరిస్థితుల్లో పార్టీ బలోపేతానికి చర్యలు తీసుకున్న జగన్ పెద్దిరెడ్డిని రాష్ట్ర స్థాయి నుంచి జిల్లాకి పరిమితం చేశారనేది వైసీపీ నాయకుల వాదన. ఇదే నిజం అంటున్నారు రాజకీయ విశ్లేషకులు.
పెద్దిరెడ్డి ఇంటి నుంచి ముగ్గురు విజయం
ఉమ్మడి చిత్తూరు జిల్లా సహా రాయలసీమలో సీట్ల కేటాయింపు నుంచి ప్రచారం, డబ్బు పంపిణీ ఇలా అన్ని విషయాలు పెద్దిరెడ్డి చెప్పినట్టే సాగింది. అయితే ప్రజలు ఇచ్చిన తీర్పు వైసీపీని కనీసం ప్రతిపక్ష హోదా కూడా లేకుండా చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో కూటమి ప్రభుత్వం వైసీపీ ఐదేళ్లలో చేసిన అక్రమాలు, అనాయ్యాలు, భూ దోపిడిపై దృష్టి పెట్టి చర్యలకు ఉపక్రమిస్తోంది. ఇలాంటి పరిస్థితుల్లో కొత్త ప్రభుత్వానికి సమయం కూడా ఇవ్వకుండా వైసీపీ ఎదురుదాడి చేయడం ప్రారంభించింది. ఇలాంటి పరిస్థితుల్లో నలుగురికి రాష్ట్ర అధికార ప్రతినిధులుగా మైకు ఇవ్వగా... పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డికి మాత్రం పీఏసీ సభ్యుడు, చిత్తూరు జిల్లా అధ్యక్షుడు, తిరుపతి జిల్లాలో నాలుగు నియోజకవర్గాల అధ్యక్షుడిగా కొనసాగేలా ప్రకటించారు.
ప్రాభల్యం తగ్గిందా..?
పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి చేసిన కొన్ని పనుల కారణంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో ఎదురులేని విజయంతో సాగిపోయే వైసీపీకి ఈసారి రెండు సీట్లు దక్కిందని పలువురు ఫిర్యాదులు చేసినట్లు తెలుస్తోంది. ముఖ్యంగా గతంలో నగరి ఎమ్మెల్యే గా ఉన్న ఆర్ కె రోజాకు వ్యతిరేకంగా పనిచేసిన కొందరు పెద్దిరెడ్డి అనుచరులుగా గుర్తింపు పొందారు. ఇటీవల జగన్ సమావేశం అనంతరం పెద్దిరెడ్డి అనుకూలంగా ఉన్న శాంతి, ఆమె భర్తను సస్పెండ్ చేశారు.
తిరుపతి రాజకీయంలో టీటీడీ సహా తిరుపతి ఎమ్మెల్యే అభ్యర్థి భూమన కరుణాకర్ రెడ్డి కుమారుడు భూమన అభివయ్ రెడ్డి ఓటమిలో కీలక పాత్ర పోషించారని విమర్శలు ఉన్నాయి. ఇలా కుప్పం, జీడీ నెల్లూరు, చిత్తూరు, మదనపల్లి , చంద్రగిరి మొత్తం మూడు పార్లమెంటు, 14 అసెంబ్లీ స్థానాల్లో కేవలం వారి కుటుంబ సభ్యులు తప్ప మిగిలిన వారి విజయానికి సహకరించకపోగా ఓటమికి కారణం అయ్యారనేది ఫిర్యాదు. అందుకే ఆయనను పార్టీ పీసీసీ సభ్యుల్లో ఒకరు... జిల్లా అధ్యక్షుడిగా సరిపెట్టారని అంటున్నారు. ఇది కొందరు సమర్థిస్తుండగా.. కొందరు వ్యతిరేకిస్తున్నారు.
Also Read: చిత్తూరు వైఎస్సార్ సీపీలో వారికే కీలక పదవులు! మొదటి నుంచి జగన్‌ను ఆకట్టుకున్న లీడర్లు వీరే!