Harish Rao: 'కేసీఆర్ ప్రజల్లోకి వెళ్తే వారికి నిద్ర పట్టడం లేదు' - మంత్రుల వ్యాఖ్యలపై హరీష్ రావు కౌంటర్
Telangana News: బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ పై మంత్రుల వ్యాఖ్యలను మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎమ్మెల్యే హరీష్ రావు ఖండించారు. ఐదేళ్ల తర్వాత కాంగ్రెస్ మళ్లీ అధికారంలోకి రాదని జోస్యం చెప్పారు.
![Harish Rao: 'కేసీఆర్ ప్రజల్లోకి వెళ్తే వారికి నిద్ర పట్టడం లేదు' - మంత్రుల వ్యాఖ్యలపై హరీష్ రావు కౌంటర్ brs mla harish rao counter to ministers who commented on kcr Harish Rao: 'కేసీఆర్ ప్రజల్లోకి వెళ్తే వారికి నిద్ర పట్టడం లేదు' - మంత్రుల వ్యాఖ్యలపై హరీష్ రావు కౌంటర్](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2024/04/06/51114d65bd1b39edd60f364e0cc2eb861712398852962876_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
Brs Mla Harish Rao Counter To Ministers: కేసీఆర్ ప్రజల్లోకి వెళ్తే మంత్రులకు నిద్ర పట్టడం లేదని బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి హరీష్ రావు (Harish Rao) అన్నారు. జహీరాబాద్ లో పార్లమెంట్ ఎన్నికల సన్నాహక సమావేశంలో శనివారం ఆయన మాట్లాడారు. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ (KCR)పై మంత్రులు చేసిన వ్యాఖ్యలపై ఆయన స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చారు. మంత్రులు తమకు ఇష్టం వచ్చినట్లు మాట్లాడుతున్నారని.. రైతుల సమస్యల గురించి కేసీఆర్ మాట్లాడితే అమాత్యులు ఆయన్ను తిడుతున్నారని మండిపడ్డారు. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి 25 మంది బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ పార్టీలోకి వస్తున్నారని అంటున్నారని.. ఆయనకు సిగ్గు ఉందా.? అంటూ నిలదీశారు. రాహుల్ గాంధీ తన మేనిఫెస్టోలో ఇతర పార్టీ వాళ్లను పార్టీలోకి తీసుకోవద్దని పెడతారని విమర్శించారు. రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ మంత్రులు మాత్రం ఇతర పార్టీల నుంచి తమ పార్టీలోకి తీసుకుంటామని అంటున్నారంటూ సెటైర్లు వేశారు.
అటు సూర్యుడు ఇటు పొడిచినా
కాంగ్రెస్ పార్టీ ఐదేళ్ల తర్వాత అటు సూర్యుడు ఇటు పొడిచినా మళ్లీ అధికారంలోకి రాదని హరీష్ రావు జోస్యం చెప్పారు. 'మీరు ఎన్ని చేస్తారో చేయండి. కానీ గుర్తు పెట్టుకోండి. మేము వడ్డీతో సహా మీకు తిరిగి ఇస్తాం.' అని హెచ్చరించారు. మీరు ఎన్ని చేసినా ఇచ్చిన హామీలన్నీ అమలు చేసే వరకూ మిమ్మల్ని వదిలిపెట్టమని.. వెంట పడతామని అన్నారు. లక్షల ఎకరాల్లో పంటలు ఎండిపోయినా ఈ ప్రభుత్వానికి చీమ కుట్టినట్లు కూడా లేదన్నారు. '200 మంది ఆత్మహత్య చేసుకుంటే కాంగ్రెస్ నేతలకు పరామర్శించడానికి సమయం లేదు. కేసీఆర్ హయాంలో పుట్ల కొద్దీ ధాన్యం పండితే.. కాంగ్రెస్ హయాంలో పుట్టెడు కష్టాలు ఎదురవుతున్నాయన్నారు. రైతులకు రుణమాఫీ చేయలేదు. ఎకరానికి రూ.15 వేల ఆర్థిక సాయం చేయలేదు. పంటకు మద్దతు ధర ఇవ్వలేదు. కాంగ్రెస్ వంద రోజుల పాలనలో ఒక్క హామీ నెరవేర్చలేదు. కేంద్రంలో ఉన్న బీజేపీకి చిత్తశుద్ధి ఉంటే రైతులకు సహాయం చేయాలి. కేసీఆర్ కాలు పెట్టగానే బీజేపీ కళ్లు తెరిచి దీక్షలు చేస్తున్నారు. పంట ఎండిపోయిన రైతులకు వెంటనే ఎకరానికి రూ.25 వేల నష్ట పరిహారం ఇవ్వాలి. కాంగ్రెస్ నేతలు చిల్లర, బోగస్ మాటలు పక్కన పెట్టి రైతుల్ని ఆదుకోవాలి.' అని డిమాండ్ చేశారు.
'ప్రశ్నించే గొంతును గెలిపించాలి'
'అసెంబ్లీ ఎన్నికల తర్వాత కాంగ్రెస్ ఊపు తగ్గింది. వంద రోజుల్లో హామీలు అమలు చేస్తామని చెప్పి.. ఇప్పుడు ఎన్నికల కోడ్ అడ్డం పెట్టుకుంటున్నారు. రూ.2 లక్షల రుణమాఫీ, వడ్లకు, మక్కలకు రూ.500 బోనస్, రూ.4 వేల పింఛన్, రైతుబంధు రూ.15 వేలు, మహిళలకు రూ.2,500, కల్యాణ లక్ష్మి కింద తులం బంగారం, రూ.4 వేల నిరుద్యోగ భృతి, ఆడపిల్లలకు ఉచిత స్కూటీ అందిన వాళ్లే కాంగ్రెస్ కు ఓటెయ్యండి. అందని వాళ్లు బీఆర్ఎస్ కు ఓటెయ్యండి. ప్రశ్నించే గొంతుకను గెలిపించాలి.' అంటూ హరీష్ రావు పిలుపునిచ్చారు.
Also Read: Mulugu Encounter: తెలంగాణ- ఛత్తీస్‌గఢ్ సరిహద్దుల్లో ఎన్‌కౌంటర్- ముగ్గురు మావోయిస్టులు మృతి
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)