Ram temple: అయోధ్య రాముడి విగ్రహ ప్రతిష్ఠకు ముహూర్తం ఖరారు, వచ్చే ఏడాది మకర సంక్రాంతి వరకూ వేడుకలు
Ram temple: అయోధ్య రాముడి విగ్రహాన్ని వచ్చే ఏడాది మకర సంక్రాంతి రోజున ప్రతిష్ఠిస్తామని ట్రస్ట్ వెల్లడించింది.
Ayodhya Ram Mandir:
ట్రస్ట్ సెక్రటరీ ఏమన్నారంటే..
వచ్చే ఏడాది జనవరి 1 వ తేదీ నాటికి అయోధ్య రామ మందిరం రెడీ అయిపోతుందని కేంద్ర హోం మంత్రి అమిత్‌షా ఇప్పటికే ప్రకటించారు. ఇప్పుడు మరో ఆసక్తికర అప్‌డేట్ వెలుగులోకి వచ్చింది. "ఈ ఏడాది డిసెంబర్ నాటికి ఆలయ నిర్మాణం పూర్తవుతుంది. వచ్చే ఏడాది జనవరికి ప్రారంభమవుతుంది. డిసెంబర్ నుంచి వచ్చే ఏడాది సంక్రాంతి వరకూ వేడుకలు కొనసాగుతాయి" అని వెల్లడించారు
శ్రీరామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ సెక్రటరీ చంపత్ రాయ్. నిర్మాణ పనులు శరవేగంగా సాగుతున్నట్టు చెప్పారు. త్వరలోనే భక్తులు అయోధ్య రాముడిని దర్శించుకోవచ్చని ఆనందం వ్యక్తం చేశారు. "రామ్‌లాలా విగ్రహాన్ని గర్భగుడిలో ప్రతిష్ఠిస్తాం. వచ్చే ఏడాది మకర సంక్రాంతి రోజున ఈ వేడుక జరుగుతుంది" అని చెప్పారు. గర్భ గుడి నిర్మాణం వేగంగా కొనసాగుతోందని తెలిపారు. 9 అడుగులు రాముడి
విగ్రహాన్ని ప్రతిష్ఠించనున్నారు. 35 అడుగుల దూరం నుంచి చూసినా...రాముడు స్పష్టంగా కనిపిస్తాడని ట్రస్ట్ వెల్లడించింది. దేశవ్యాప్తంగా ప్రముఖ శిల్పులు రాముడి విగ్రహాన్ని చెక్కుతున్నారు. "సాధువులతో చర్చించి రాముడి విగ్రహం ఎలా ఉండాలో నిర్ణయిస్తాం. కర్ణాటక, మహారాష్ట్ర, ఒడిశా నుంచి ప్రత్యేకంగా తెప్పించిన శిలలతో విగ్రహం తయారు చేయిస్తాం" అని చంపత్ రాయ్ చెప్పారు.
అమిత్‌షా ప్రకటన..
2024 జనవరి 1వ తేదీ నాటికి అయోధ్య రామ మందిర నిర్మాణం పూర్తవుతుందని కేంద్ర మంత్రి అమిత్‌షా ప్రకటించారు. ఆ రోజే ఆలయ ప్రారంభోత్సవం జరుపుకుంటామని స్పష్టం చేశారు. త్రిపురలోని ఓ సభలో పాల్గొన్న అమిత్‌షా ఈ వ్యాఖ్యలు చేశారు. "రాహుల్ గాంధీ పదేపదే అయోధ్య రామ మందిరం గురించి అపహాస్యం చేసే వారు. నిర్మాణం అక్కడే జరుగుతుంది కానీ..తేదీ మాత్రం చెప్పరు అని వెటకారం చేసేవారు. ఇప్పుడు చెబుతున్నా. రాహుల్ బాబా శ్రద్ధగా వినండి. చెవులు రిక్కించి వినండి. 2024 జనవరి 1వ తేదీ నాటికి రామ మందిరం తయారవుతుంది" అని వెల్లడించారు. త్రిపురలో ఈ ఏడాది ఎన్నికలు జరగనున్నాయి. అందుకే...ఈ రాష్ట్రంపై ప్రత్యేక దృష్టి సారించింది బీజేపీ. ఇందులో భాగంగానే...అమిత్‌షా అక్కడ పర్యటించారు. ప్రస్తుతం అధికారంలో ఉన్న CPIM ప్రభుత్వంపై విమర్శలు చేశారు. ఈ ఆలయంతో పాటు మసీదు నిర్మాణ కూడా అదే గడువులోగా పూర్తవుతుందని ట్రస్ట్ తెలిపింది. సుప్రీం కోర్టు ఆదేశాల మేరకు మసీదు నిర్మాణానికి కేటాయించిన స్థలంలో ఈ పనులు వేగంగా కొనసాగుతున్నాయి. Indo Islamic Cultural Foundation Trustకు చెందిన ఓ సీనియర్ అధికారులు ఈ విషయాన్ని ధ్రువీకరించారు. అంటే...రాముడి ఆలయంతో పాటు మసీదు కూడా ఒకేసారి పూర్తవుతుందన్నమాట. ఇదే జరిగితే...అది చరిత్రాత్మకం అవుతుందని అంటున్నారు. రామ్ జన్మభూమి, బాబ్రీ మసీదు కేసులో సుప్రీం కోర్టు తీర్పు ఇచ్చిన సమయంలో ముస్లింలకు చెందిన స్థలంలో కచ్చితంగా మసీదు నిర్మించాలని ఆదేశించింది. ముస్లింలు వేసిన పిటిషన్‌పై స్పందిస్తూ ఈ తీర్పునిచ్చింది.