Pahalgam Terror Attack: బోర్డర్‌లో ఉద్రిక్తత- మీడియాకు కేంద్రం కీలక సూచనలు
Pahalgam Terror Attack: ఉగ్రవాదుల దాడితో భారత్, పాక్ మధ్య సంబంధాలు పూర్తిగా దెబ్బతిన్నాయి. ఏ క్షణం ఏం జరుగుతుందో తెలియని పరిస్థితి. ఇలాంటి టైంలో మీడియా జాగ్రత్తగా ఉండాలని కేంద్రం సూచించింది.

Pahalgam Terror Attack: భారత పాకిస్థాన్ మధ్య పరిస్థితులు మరింత ఉద్రిక్తంగా మారుతున్నాయి. సరిహద్దు ప్రాంతాల్లో పాకిస్థాన్ కవ్వింపు చర్యలకు దిగుతోంది. భారత్ సైన్యం అందుకు తగ్గట్టుగానే దీటుగా బదులిస్తోంది. ఈ క్రమంలో దేశంలో మీడియాకు, సోషల్ మీడియా యూజర్లకు కేంద్ర ప్రభుత్వం కీలక సూచనలు చేసింది.
సరిహద్దుల్లో పరిస్థితులు ఉద్రిక్తంగా ఉన్నందున మీడియా కవరేజ్ విషయంలో మోదీ ప్రభుత్వం పలు సూచనలు చేసింది. అదే టైంలో సోషల్ మిడియా యూజర్లు, ఇన్‌ఫ్లూయెన్సర్లకు కూడా ఇవి వర్తిస్తాయని తెలిపింది. పాకిస్థాన్ కవ్వింపు చర్యలు దిగుతున్న వేళ రక్షణపరంగా ప్రభుత్వం కీలకమైన చర్యలు తీసుకుంటుంది. వాటిని కవరేజ్ విషయంలో అత్యుత్సాహం చూపించొద్దని హితవు పలికింది. రక్షణ చర్యలను లైవ్ కవరేజ్ చేయొద్దని తెలిపింది.
మీడియాకు పలు సూచనలు చేస్తూ కేంద్ర సమాచార ప్రసార శాఖ ఓ ప్రత్యేక ప్రకటన విడుదల చేసింది. "“జాతీయ భద్రత దృష్ట్యా, అన్ని మీడియా ప్లాట్‌ఫామ్‌లు, వార్తా సంస్థలు, సోషల్ మీడియా వినియోగదారులు రక్షణ కార్యకలాపాల ప్రత్యక్ష ప్రసారం (Live Coverage) చేయకూడదు.' అని పేర్కొంది. ఇలా చేయడం వల్ల దేశానికి సంబంధించిన కీలకమైన వ్యూహాత్మక నిర్ణయాలు శత్రువులు పసిగట్టే ప్రమాదం ఉంది. ఇక్కడ అధికారులకు, ప్రభుత్వానికి చిక్కులు వచ్చే ఆస్కారం ఉంది. అందుకే అలాంటి ప్రయత్నం చేయొద్దని కేంద్రం సూచించింది.
Ministry of Information and Broadcasting issues advisory to all Media channels to refrain from showing live coverage of defence operations and movement of security forces in the interest of national security. pic.twitter.com/MQjPvlexdr
— Ministry of Information and Broadcasting (@MIB_India) April 26, 2025
జాతీయ భద్రత దృష్ట్యా రక్షణ కార్యకలాపాలు, భద్రతా దళాల చర్యలను ప్రత్యక్ష ప్రసారం చేయకుండా ఉండాలని మీడియా ఛానెళ్లకు సూచనలు చేస్తూ ప్రకటన విడుదల చేసింది. "జాతీయ భద్రత దృష్ట్యా, అన్ని మీడియా ప్లాట్‌ఫారమ్‌లు, వార్తా సంస్థలు మరియు సోషల్ మీడియా వినియోగదారులు రక్షణ మరియు ఇతర భద్రతా సంబంధిత కార్యకలాపాలకు సంబంధించిన విషయాలను నివేదించేటప్పుడు అత్యంత బాధ్యత వహించాలని, ప్రస్తుత చట్టాలు ,నిబంధనలను కచ్చితంగా పాటించాలని సూచించారు" అని పేర్కొన్నారు.
ప్రత్యేకంగా రియల్-టైమ్ కవరేజ్, దృశ్యాల ప్రసారం, రక్షణ కార్యకలాపాలు , సైన్యం కదలికలకు సంబంధించిన సమాచారం బహిర్గతం చేయొద్దని చెప్పింది. సున్నితమైన సమాచారాన్ని ముందస్తుగా బహిర్గతం చేయడం వల్ల అనుకోకుండా శత్రువులకు సహాయం చేసినట్టే అవుతుందని అన్నారు. దేశం ప్లాన్‌ను అమలు చేయడంలో ఇబ్బంది కలగడమే కాకుండా సైన్యం భద్రతకు ప్రమాదం కలిగించవచ్చు అని తెలిపారు.
కార్గిల్ యుద్ధం, ముంబై ఉగ్రవాద దాడుల సమయంలో ఇలాంటి ఘటనలు ముప్పు తెచ్చినట్టు మంత్రిత్వ శాఖ చెప్పుకొచ్చింది. 'అపరిమిత కవరేజ్ జాతీయ ప్రయోజనాలపై ఊహించని ప్రతికూల పరిణామాలను కలిగించిందని' ఆందోళన వ్యక్తం చేసింది.
"గత ఘటనలు బాధ్యతాయుతమైన రిపోర్టింగ్ ప్రాముఖ్యత గుర్తు చేస్తున్నాయి. కార్గిల్ యుద్ధం, ముంబై ఉగ్రవాద దాడులు (26/11), కాందహార్ హైజాక్ ఘటనల సమయంలో అపరిమిత కవరేజ్ ప్రతికూల పరిణామాలకు కారణమైంది " అని మంత్రిత్వ శాఖ పేర్కొంది.
కేబుల్ టెలివిజన్ నెట్‌వర్క్స్ (సవరణ) నియమాలు, 2021లోని రూల్ 6(1)(p)ని పాటించాలని మంత్రిత్వ శాఖ అన్ని టీవీ ఛానెల్‌లకు సూచించింది. "భద్రతా దళాలు చేసే ఏదైనా ఉగ్రవాద వ్యతిరేక ఆపరేషన్ ఏ కేబుల్ సర్వీస్‌లో ప్రసారం చేయకూడదు. దీనిలో మీడియా కవరేజ్ సంబంధిత ప్రభుత్వం నియమించిన అధికారి ఇచ్చిన బ్రీఫింగ్‌కు మాత్రమే పరిమితం కావాలి. అటువంటి ఆపరేషన్ ముగిసే వరకు ఇది పాటించాలి." అని వెల్లడించింది.
పాకిస్థాన్ సరిహద్దుల్లో కవ్వింపుల చర్యలు పాల్పడుతోంది. ఓవైపు చర్చలు ప్రస్తావన తీసుకొస్తూనే మరోవైపు భారత్ సైన్యాన్ని రెచ్చిగొడుతోంది. భారత్ సైన్యం కూడా వాళ్లుకు దీటుగానే జవాబు ఇస్తోంది. ఇంకోవైపు ఏప్రిల్ 22న జరిగిన దాడిలో ఉగ్రవాదులకు ఆశ్రయం ఇచ్చిన వారి ఇళ్లను సైన్యం కూల్చి వేస్తోంది. వివిధ మార్గాల్లో సేకరించిన సమాచారం మేరకు ఈ చర్యలు చేపడుతోంది.





















