Pak PM Shahbaz Sharif: భారత్ చర్యలతో వెనక్కి తగ్గిన పాకిస్తాన్! పహల్గాం దాడిపై దర్యాప్తునకు సిద్ధం: షెహబాజ్ షరీఫ్
Pahalgam terror attack | పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై పాకిస్తాన్ నిష్పక్షపాత విచారణకు సిద్ధమని ఆ దేశ ప్రధాని షెహబాజ్ షరీఫ్ తెలిపారు.

Kashmir Pahalgam Terror Attack: భారత ప్రభుత్వం తీసుకుంటున్న వరుస నిర్ణయాలతో పాకిస్తాన్‌లో కదలిక వచ్చింది. ఎంతలా అంటే.. పహల్గాంలో జరిగిన ఉగ్రదాడిపై పారదర్శకంగా విచారణ జరగాలని అని పాక్ ప్రధాని వ్యాఖ్యానించారు. కాశ్మీర్‌లోని పహల్గాంలో 26 మంది ఉగ్రవాదుల దాడిలో ప్రాణాలు కోల్పోవడంపై న్యాయపరమైన విచారణకు తాము సిద్ధమని పాకిస్తాన్ ప్రధానమంత్రి షెహబాజ్ షరీఫ్ శనివారం (ఏప్రిల్ 26) అన్నారు. పారదర్శకంగా జరగనున్న విచారణలో పాల్గొనేందుకు పాక్ సిద్ధంగా ఉందన్నారు. పాకిస్తాన్ అన్ని రకాల ఉగ్రవాదాలను వ్యతిరేకిస్తోందని, పాకిస్తాన్ కూడా ఉగ్రవాద బాధిత దేశం అంటూ సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఏప్రిల్ 22న లష్కరే తోయిబా వర్గానికి చెందిన ద రెసిస్టెంట్ ఫ్రంట్ అనే గ్రూప్ ఉగ్రవాదులు జమ్మూకశ్మీర్‌లోని పహల్గాంలోని పర్యాటక ప్రాంతం బైసరన్ లోయలో కాల్పులు జరిపారు. ఈ ఉగ్రదాడిలో 26 మంది మరణించగా, పలువురు పర్యాటకులు గాయపడ్డారని తెలిసిందే. దీనిపై కేంద్ర ప్రభుత్వం సీరియస్ అయి చర్యలు తీసుకుంటుంది. ఆ సమయంలో సౌదీ అరేబియా పర్యటనలో ఉన్న ప్రధాని నరేంద్ర మోదీ రెండు రోజుల పర్యటన మధ్యలోనే భారత్‌కు తిరిగి వచ్చారంటే పరిస్థితి తీవ్రతను అర్థం చేసుకోవచ్చు.
సరైన న్యాయ విచారణలో పాల్గొనడానికి సిద్ధంగా ఉన్నాం..
కాకుల్‌లోని పాకిస్తాన్ మిలిటరీ అకాడమీలోని పాసింగ్ అవుట్ పెరేడ్‌ను ఉద్దేశించి షెహబాజ్ షరీఫ్ మాట్లాడారు. భారతదేశం నిరాధారమైన, అసంబద్ధమైన ఆరోపణలు మాపై చేస్తోంది. పాకిస్తాన్ చేసింది అనడానికి సాక్ష్యాలు ఉన్నాయా అని ప్రశ్నించారు. పాకిస్తాన్ ప్రధానమంత్రిగా బాధ్యతాయుతంగా నా వంతు పాత్రను కొనసాగిస్తాను. పాక్ బాధ్యతగా వ్యవహరిస్తుందని, పహల్గాం ఉగ్రదాడిపై జరిగే ఏదైనా నిష్పక్షపాతమైన, పారదర్శకమైన విచారణలో పాల్గొనడానికి తాము సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు.
కశ్మీర్ పాకిస్తాన్ స్వరం..
ఈ సందర్భంగా షెహబాజ్ షరీఫ్ మరోసారి జమ్మూ కశ్మీర్ అంశాన్ని ప్రస్తావించారు. పాకిస్తాన్ జాతిపిత మొహమ్మద్ అలీ జిన్నా చెప్పినట్లుగా, మనం కాశ్మీర్ ప్రాముఖ్యతను తెలుసుకోవాలి. కశ్మీర్ పాకిస్తాన్ గొంతు, స్వరం అన్నారు. పాకిస్తాన్ ప్రధానమంత్రి ఎల్లప్పుడూ ఉగ్రవాదం అన్ని రూపాలను వ్యతిరేకిస్తున్నారు. ఏ విధంగానూ ఉగ్రవాదం ఉండకూడదు. మనం దీన్ని ఖండించాలి అన్నారు. పాకిస్తాన్ ఉగ్రవాదం కారణంగా భారీ నష్టాలను ఎదుర్కొంది. 90,000 మంది ప్రాణాలు కోల్పోయారు, 600 బిలియన్ డాలర్లకు పైగా ఆర్థిక నష్టం వాటిల్లిందని షెహబాజ్ షరీఫ్ అన్నారు.
భారత్, పాకిస్తాన్ మధ్య పెరిగిన ఉద్రిక్తతలు
పహల్గాం దాడి తరువాత పాకిస్తాన్, భారత్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి. ఇస్లామాబాద్‌కు వ్యతిరేకంగా భారత్ దౌత్యపరమైన, వ్యూహాత్మక చర్యలు తీసుకుంది. ఢిల్లీలోని పాక్ హైకమిషన్ లో ప్రతినిధులను తగ్గించింది. ముఖ్యంగా పాక్ కు తీవ్ర నష్టం కలిగించే 1960 సింధు జల ఒప్పందాన్ని నిషేధించడం, అటారి ఇంటిగ్రేటెడ్ చెక్ పోస్ట్‌ను మూసివేయాలన్న నిర్ణయాలు తీసుకుంది. దాంతో పాకిస్తాన్ పౌరులకు వీసా సేవలను రద్దు చేసింది. ప్రతిచర్యగా, పాకిస్తాన్ సిమ్లా ఒప్పందాన్ని నిషేధిస్తున్నట్లు పేర్కొంది. భారత విమానాలు పాక్ గగనతలంలో ప్రయాణించకూడదని కీలక నిర్ణయం తీసుకుంది.






















