Potpourri: కొబ్బరి డొక్క, దానిమ్మ తొక్క.. ఇవే రూమ్ ఫ్రెషనర్లు... ఇప్పుడిదే సరికొత్త ట్రెండ్
పాట్ పూరీ... పేరు కొత్తగా అనిపిస్తుంది కానీ, వీటిని చాలా మంది చూసే ఉంటారు.
ఎండిపోయిన కొబ్బరి పీచు, దానిమ్మ తొక్కలు, గులాబీ రెక్కలు, బాదం కాయల తొక్కలు.. ఇవన్నీ ఇంట్లో పెట్టుకుంటారా? అబ్బే... వాటితో ఏం చేసుకుంటాం అని ఆశ్చర్యపోతూనే, ప్రశ్నార్థకంగా ముఖం పెట్టకండి. చాలా మంది వాటిని ఇంట్లోనే రూమ్ ఫ్రెషనర్లుగా వాడుతున్నారు. మరికొందరు అందమైన గాజు గ్లాసులో వేసి వాటిని సోఫా టేబుల్ ముందు షో పీస్ లాగా ఉంచుతున్నారు. ఇలా వాడే ఈ ఎండిన తొక్కలకి ఓ అందమైన పేరుంది.. ‘పాట్ పూరీ’. సరుకుల కోసం సూపర్ మార్కెట్లకు వెళ్లే వాళ్లందరూ కవర్లలో పెట్టి అమ్ముతున్న వీటిని చూసే ఉంటారు. కాకపోతే అవేంటో తెలియక, ఓసారి ఎగాదిగా చూసి అక్కడే పడేసి వచ్చుంటారు. ఇప్పుడు అవి లేటెస్ట్ ట్రెండ్.
ఇవి కొత్తేం కాదు
ఈ పాట్ పూరీలు మనకి కొత్త. కానీ చరిత్రకు కాదు. ప్రాచీన కాలం నుంచి ఫ్రాన్స్ లో వీటిని గదిలో సువాసనలు వెదజల్లేందుకు ఉపయోగించేవారు. ఇందుకోసం ఔషధ మొక్కల ఆకులు, పూలను ఎండబెట్టేవారు. సముద్రపు ఉప్పును చేర్చి, కొన్ని రకాల రసాయనాలతో వాటిని సువాసనలు వెదజల్లేలా నిల్వ ఉంచేవారు. వాటిని కుండీలలో వేసి గదిలో ప్రతిమూల పెట్టేవారు. అప్పట్లో అవే రూమ్ ఫ్రెషనర్లు. అప్పట్లో నారింజ తొక్కలు, పుదీనా ఆకులు, నిమ్మ తొక్కలు, మల్లెపూలు, లావెండర్ ఆకులు, పూలు, రోజ్ మేరీ ఆకులు,పూలు, గులాబీ పూలు వాడేవారు. ఇవన్నీ సహజంగానే సువాసన వెదజల్లే లక్షణాలు కలవి.
Also read: కరివేపాకును తీసిపడేయకండి... షుగర్ కు చెక్ పెట్టే దమ్మున్న ఆకు ఇది
ఆధునిక కాలంలో...
ఇప్పుడు ఎలాంటి సువాసనలు లేని ఆకులు, పూలను కూడా పాట్ పూరీ తయారీకి ఉపయోగిస్తున్నారు. కొబ్బరి పీచు, దానిమ్మ తొక్కలు, బాదం కాయల తొక్కలు ఇలా చాలా రకాల ఆకులు, తొక్కలను పాట్ పూరీ తయారీలో వాడుతున్నారు. గులాబీలు, నిమ్మ, పుదీనా, మల్లె ఇలాంటి పూలతో పాటూ తొక్కల్ని కూడా కలిపి పాట్ పూరీగా మారుస్తున్నారు. కాస్త లైట్ గా రంగు.లు పూసి, ఆర్టిఫిషియల్ వాసనలను జోడిస్తున్నారు. ఇవి ఎండినవే కాబట్టి కొన్ని నెలల పాటూ వీటి నుంచి సువాసన వీస్తుంది. తయారీలో పెద్దగా హానికర రసాయనాల వాడకం ఉండదు. కనుక పిల్లలున్న ఇంట్లో వాడినా సురక్షితమే. వీటి నుంచి వచ్చే సువాసన మనసును, శరీరాన్ని ఉత్తేజంగా ఉంచుతుంది.
Also read: కరోనా వల్ల కొత్త సమస్య... సంతానోత్పత్తిపై కూడా ప్రభావం
Also read: ఇలాంటి చేప కనిపిస్తే ముచ్చటేసి పట్టుకోకండి... ప్రాణాలు పోతాయ్