weird: ఇలాంటి చేప కనిపిస్తే ముచ్చటేసి పట్టుకోకండి... ప్రాణాలు పోతాయ్
అక్వేరియంలో అందమైన చేపలు పెంచడం చాలా మందికి ఇష్టం. అయితే అందంగా కనిపించే చేపల్లో కొన్ని డేంజరస్ చేపలు కూడా ఉన్నాయి.
సముద్రంలో నివసించే అన్ని చేపలు తినదగినవి కాదు, అలాగే అందంగా, చిన్నగా కనిపించే ప్రతి చేపని అక్వేరియాలలో పెంచలేం. వాటిలో కొన్ని విషపూరితమైనవి కూడా ఉన్నాయి. అవి చిన్నగా కరిచినా కూడా మనుషుల్లో వివిధ రకాల ఆరోగ్య సమస్యలు మొదలవ్వచ్చు. ఆ విషం ఎక్కువ మోతాదులో ఒంట్లో చేరితే ప్రాణాలు కూడా పోవచ్చు. అలాంటి వాటిల్లో ఒకటి లయన్ ఫిష్. ఈ చేపలు ఎంత అందంగా ఉంటాయంటే... విచ్చుకున్నా మందారాల్లా, రంగురంగుల గాలిపటాల్లా చూడగానే ఎవరికైనా ఇట్టే నచ్చేస్తాయి. ఊదా, ఎరుపు, పసుపు, నలుపు, నీలం... ఇలా అనేక రంగుల్లో చారల డిజైన్లలో ఆకట్టుకునేలా ఉంటాయి. ఇవి కేవలం అట్లాంటిక్ సముద్రం, మెక్సికో తీర ప్రాంతాలు, కరీబియన్ సముద్రాలలోనే ఉన్నట్టు గుర్తించారు శాస్త్రవేత్తలు. కానీ ఒక్కోసారి మిగతా సముద్రాలలోకి ఇవి చేరుకుంటున్నాయి. వీటి గురించి తెలియని ప్రజలు వాటిని పట్టుకోవడానికి ప్రయత్నించి ప్రాణం మీదకు తెచ్చుకున్న సందర్భాలూ కూడా ఉన్నాయి.
ఎందుకింత స్పెషల్
ఈ చేప చిన్నగానే ఉంటుంది. కానీ త్రాచుపాములో ఉండేంత విషం దీని శరీరంలో ఉంటుంది. ఆపద అనిపిస్తే తన స్టింగ్ తో ఎదుటి జీవి శరీరంపై కాటేస్తుంది. ఆ స్టింగ్ ద్వారా విషం ఎదుటి జీవి ఒంట్లో చేరి ప్రాణాలు తీస్తుంది. చేపల్లాంటివి అక్కడే చనిపోతాయి. అదే మనుషులకు కాటేస్తే శ్వాసకోశ సమస్యలు ఏర్పడతాయి. ఆ ప్రాంతంలో విష ప్రభావంతో చర్మమంతా ఉబ్బిపోతుంది. అక్కడ స్పర్శ కూడా కోల్పోతారు. ఒక్కసారే కాటేస్తే కేవలం ఈ సమస్యలు వస్తాయి. కానీ రెండుకు మించి ఎక్కువ సార్లు కాటేస్తే మాత్రం ప్రాణాలకు గ్యారంటీ లేదు. అందుకే లయన్ ఫిష్ ను ప్రమాదరకమైన జీవుల జాబితాలో కలిపేశారు శాస్త్రవేత్తలు. చాలా మందికి చేపలు పట్టడం ఆసక్తి ఉంటుంది. బ్రిటన్ లాంటి దేశాల్లో వారాంతంలో ఇలా చేపలు పట్టడానికి వెళ్లి లయన్ ఫిష్ బారిన పడిన వారూ ఉన్నారు. అందుకే లయన్ ఫిష్ కనిపించే తీర ప్రాంతాల్లో హెచ్చరిక బోర్డులు కూడా ఏర్పాటు చేశారు ఆయా దేశ ప్రభుత్వాలు.
Also read: కరోనా వల్ల కొత్త సమస్య... సంతానోత్పత్తిపై కూడా ప్రభావం
Also read: ఆపిల్ కన్నా గుడ్డులోనే అవెక్కువట.. అందుకే తినమంటున్నారు