(Source: ECI/ABP News/ABP Majha)
New Study: కరోనా వల్ల కొత్త సమస్య... సంతానోత్పత్తిపై కూడా ప్రభావం
కరోనా వచ్చాక మానవాళి జీవితమే మారిపోయింది. ఎన్నో మార్పులు సంభవించాయి.
కరోనాకు మహమ్మారి అనే పదం చాలా చిన్నదేమో... అంతకన్నా ఘోరమైన పదాన్ని ఈ మాయదారి రోగానికి వాడాల్సిందే. ఇంతవరకు కరోనా వల్ల కళ్ల ముందు జరిగిన నష్టాన్ని చూశాం. ఎన్నో ఆరోగ్య సమస్యలతో ఆసుపత్రుల్లో రోజుల పాటూ గడిపిన వాళ్లు ఉన్నారు. ఎంతో మంది ప్రాణాలు కోల్పోయారు. కరోనా ఇక్కడితోనే ఆగలేదు. దాని వల్ల కలిగే ఒత్తిడి సంతానోత్పత్తిపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్టు ఓ కొత్త పరిశోధనలో తేలింది. దీని వల్ల గర్భం ధరించలేకపోవడం, పుట్టే పిల్లల్లో ఏవైనా ఆరోగ్య పరమైన ఇబ్బందులు తలెత్తవచ్చని తాజా పరిశోధనలో తెలిసింది. అంటే కరోనా వల్ల కలిగే ఒత్తిడి భవిష్యత్తు తరాలపై కూడా ప్రభావం చూపిస్తోంది. కరోనా వచ్చి తగ్గిన మహిళల్లో లేదా కరోనా వచ్చాక ఏర్పడిన పరిస్థితుల వల్ల వారిపై కనిపించకుండా విపరీతమైన ఒత్తిడి పడినట్టు గుర్తించారు పరిశోధకులు. దీని వల్ల వారిలో రుతుక్రమం గాడి తప్పుతుంది. సరిగా రుతు క్రమం సరిగా కాని వారిలో గర్భధారణ కూడా కష్టమవుతుంది. కొందరిలో రెండునెలలకోసారి, మూడు నెలలకోసారి రుతుస్రావం జరగడం సంభవిస్తోంది. మరికొందరిలో విపరీతమైన రుతుస్రావం కూడా జరుగుతోంది. ఇవన్నీ గర్భధారణ వ్యవస్థపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నట్టు గుర్తించారు అధ్యయనకర్తలు.
అమెరికా పరిశోధనకర్తలు చేసిన ఈ అధ్యయన వివరాలను ‘జర్నల్ ఆప్ ఉమెన్స్ హెల్త్’ అనే మ్యాగజైన్ లో ప్రచురించారు. ఇందులో భాగంగా దాదాపు 200 మంది మహిళలపై పరిశోధన చేశారు. వీరంతా గతేడాది కరోనా వల్ల ఇబ్బంది పడిన వారే. వారిలో 54 శాతం మందిలో రుతుక్రమం సరిగా అవ్వకపోవడాన్ని, గర్భధారణ కష్టతరం అవ్వడాన్ని గుర్తించారు. అంతేకాదు వారి మానసిక ఆరోగ్యం తీవ్రప్రభావం పడినట్టు గుర్తించారు. ఈ పరిస్థితి వల్ల వారి సంతానోత్పత్తి వ్యవస్థ కూడా ప్రభావితం అయినట్టు తేల్చారు. ఇది అంతా తేలికగా తీసుకునే విషయం కాదని, ఇలా కరోనా కారణంగా కలిగిన ఒత్తిడితో ప్రభావితమైన మహిళలంతా వైద్యుల సలహాలను తీసుకోవాలని సూచించారు.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: రొమ్ము క్యాన్సర్ వారసత్వంగా వస్తుందా? లక్షణాలేంటి? ఎలా చెక్ చేసుకోవాలి?
Also read: గర్భిణుల్లో హఠాత్తుగా వచ్చే డయాబెటిస్... జాగ్రత్త పడక తప్పదు
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి