(Source: ECI/ABP News/ABP Majha)
Pregnancy: గర్భిణుల్లో హఠాత్తుగా వచ్చే డయాబెటిస్... జాగ్రత్త పడక తప్పదు
డయాబెటిస్ అంటారు కానీ అదెన్ని రకాలో తెలుసుకున్నారా? అందులో ఓ రకం గర్భిణులపై దాడి చేస్తుందని తెలుసా?
ప్రపంచంలో మధుమేహ రోగుల సంఖ్య రోజురోజుకి పెరిగిపోతోంది. కేవలం ఈ సమస్య వృద్ధులనే వేధిస్తుంటనే అపోహ ప్రజల్లో ఉండేది. ఇప్పుడు యువతలో కూడా షుగర్ బాధితుల సంఖ్య పెరిగిపోతోంది. షుగర్ అంటారు కానీ... ఇందులో మూడు రకాలు ఉన్నాయని, అందులో ఒకటి అకస్మాత్తుగా గర్భిణిలపై దాడి చేసి, శిశువుపై ప్రభావం చూపిస్తుందని మాత్రం చాలా తక్కువ మందికే తెలుసు. గర్భిణిగా ఉన్నప్పుడు వచ్చే ‘జెస్టేషనల్ డయాబెటిస్’ పై అవగాహన చాలా అవసరం అంటున్నారు వైద్యులు.
డయాబెటిస్ మూడు రకాలు... టైప్ 1, టైప్ 2, జెస్టేషనల్ డయాబెటిస్. ఇందులో టైప్ 1 పిల్లల్లో కనిపిస్తుంది. అది వారసత్వంగా వస్తుంది. దీనికి ఇన్సులిన్ వాడక తప్పదు.
టైప్2 డయాబెటిస్... ఇది కూడా వంశపారంపర్యంగా వస్తుంది. కాకపోతే కాస్త వయసుపెరిగాక కనిపిస్తుంది. ఆహారపు అలవాట్లు, జీవన శైలి వల్ల ఇది వచ్చే అవకాశం ఎక్కువ.
ఇక మూడోది జెస్టేషనల్ డయాబెటిస్. కేవలం గర్భిణిలలో మాత్రమే వస్తుంది. దాదాపు 10 నుంచి 16 శాతం గర్భిణిలలో ఈ డయాబెటిస్ వస్తోంది. అందుకే 24 వారాలు లేదా అయిదు నెలల నిండాక కచ్చితంగా ఓరల్ గ్లూకోజ్ టోరెన్స్ టెస్ట్ చేయించుకోవాలి. చాలా మంది వైద్యులు ఈ టెస్ట్ ను సిఫారసు చేస్తున్నారు. ఈ పరీక్షలో జెస్టేషనల్ డయాబెటిస్ వచ్చిందా లేదా అన్న విషయం తెలిసిపోతుంది.
పరీక్ష ఎలా చేస్తారు?
రాత్రి భోజనం చేశాక తెల్లారే వరకు ఏమీ తినకూడదు. నీళ్లు తాగాల్సి వస్తే చాలా కొంచెం తాగాలి. ఉదయం లేచాక రక్త పరీక్ష చేయించుకోవాలి. ఆ తరువాత కడుపు నిండా ఆహారం తినడమో లేక గ్లాసుడు గ్లూకోజ్ వాటర్ తాగడమో చేయాలి. ఇలా తాగిన గంటన్నర తరువాత మళ్లీ రక్త పరీక్ష చేస్తారు. ఆ పరీక్షల్లో ఖాళీ కడుపుతో పరగడుపున చేసిన పరీక్షలో 90 కన్నా ఎక్కువ, ఆహారం తిన్నాక చేసిన రక్త పరీక్షలో 140 కన్నా ఎక్కువ ఫలితం వస్తే వారికి జెస్టేషనల్ డయాబెటిస్ వచ్చినట్టే.
చికిత్స ఎలా?
పరీక్షలో వచ్చే ఫలితాలను బట్టి వైద్యులు చికిత్స నిర్ణయిస్తారు. కొందరికి కేవలం ఆహారపు అలవాట్లను మార్చుకోమని చెబుతారు. తీపి పదార్థాలను తినవద్దని చెప్పడం, అన్నం తగ్గించమనడం సూచిస్తారు. తీవ్రంగా ఉంటే మాత్రం మందులు వాడమని చెబుతారు.
బిడ్డపై ప్రభావం
రక్తంలో గ్లూకోజు మోతాదులు మరీ ఎక్కువైతే బిడ్డ అవయవాల నిర్మాణంపై ప్రభావం చూపించవచ్చు. అంతేకాదు బిడ్డ బరువు కూడా పెరిగిపోతుంది. కాన్పయ్యే సమయానికి మూడున్నర కిలోలు లేదా అంత కన్నా ఎక్కువగా పెరగవచ్చు. ఒక్కోసారి నెలలు నిండకముందే సిజేరియన్ చేయాల్సిన పరిస్థితి రావచ్చు. కాబట్టి జెస్టేషనల్ డయాబెటిస్ ను తక్కువగా అంచనా వేయద్దు. తల్లికి, బిడ్డకీ భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు రాకుండా ఉండాలంటే గర్భిణులుగా ఉన్నప్పుడే డయాబెటిస్ టెస్ట్ చేయించుకోండి. ఎప్పటికప్పుడు వైద్యుల సలహాలు తీసుకోండి.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: స్నాక్స్ గా నాలుగు గింజలు నోట్లో వేసుకున్నా చాలు... ఎంతో మేలు
Also read: ఇవి తింటే గుండె సేఫ్... పక్షవాతం వచ్చే అవకాశం తగ్గిపోతుంది