Healthy Heart: ఇవి తింటే గుండె సేఫ్... పక్షవాతం వచ్చే అవకాశం తగ్గిపోతుంది
ఆధునిక కాలంలో ఆరోగ్యాన్ని కాపాడుకునేందుకు ఎక్కువగా మందుల మీదే ఆధారపడుతున్నాం. నిజానికి ఆహారంతో ఇది సాధ్యమవుతుంది.
గుండె జబ్బులు, రక్తపోటు, మధుమేహం ఇవన్నీ ఒకప్పుడు వయసు పెరిగాక వస్తాయనే నమ్మకం ఉండేది. ఇప్పుడు వయసుతో సంబంధం లేకుండా దాడి చేస్తున్నాయి ఈ మహమ్మారులు. ముఖ్యంగా గుండెజబ్బులు నలభై ఏళ్ల లోపు వారిలో కూడా కలగడం కలవరపాటుకు గురిచేస్తోంది. గుండెజబ్బుల ముప్పు ఉందేమోనన్న అనుమానం వస్తే వైద్యులు వెంటనే వారికి ఆస్ప్రిన్ మాత్రలు సూచిస్తుంటారు. ఇవి రక్తం గడ్డలు కట్టకుండా, పలుచగా చేసి గుండె పోటు రాకుండా కాపాడతాయి. ఆస్పిరిన్ గుండె రక్తనాళాల్లో, ధమనుల్లోని చర్మపొరల్లోంచి నైట్రిక్ ఆక్సైడ్ ఉత్పత్తిని ప్రేరేపిస్తుంది. నైట్రిక్ ఆక్సైడ్ రక్తపోటును తగ్గిస్తుంది, అవయవాలకు రక్త ప్రసరణను పెంచుతుంది. రక్తనాళాలను కుచించుకుపోకుండా చేసి, ధమనుల్లో ఒత్తిడిని తగ్గిస్తుంది. దీనివల్ల గుండె పోటు వచ్చే అవకాశం తగ్గుతుంది. గుండె సమస్యలు రాకుండా చేసుకుంటే ఆస్ప్రిన్ వంటి మందులతో అవసరం ఉండదు. దీనికి మీరు చేయాల్సిందల్లా నైట్రిక్ ఆక్సైడ్స్ అధికంగా లభించే ఆహారాన్ని తినడం. ఆస్ప్రిన్ ద్వారా అందే నైట్రిక్ ఆక్సైడ్లను కొన్ని ఆహారపదార్థాల ద్వారా మనం పొందచ్చు. అయితే ఆహారంలో నైట్రేట్ల రూపంలో ఇవి ఉంటాయి. శరీరంలోకి చేరాక నైట్రిక్ ఆక్సైడ్లుగా మారతాయి.ఈ ఆహారం వల్ల భవిష్యత్తులో పక్షవాతం వచ్చే అవకాశాలు తగ్గిపోతాయి.
తినాల్సినవి ఇవే...
పాలకూర కొనేందుకు పెద్ద ఖర్చేం కాదు. వీటిని కనీసం రెండు రోజులకోసారైనా తినేందుకు ప్రయత్నించండి. వీటిలో పుష్కలంగా నైట్రైట్లు లభిస్తాయి. వంద గ్రాముల పాలకూరలో 387 మిల్లీగ్రాముల వరకు నైట్రేట్ ఉంటుంది. క్యారెట్లలో కూడా నైట్రేట్లు లభిస్తాయి. రోజుకో క్యారెట్ తిన్నా చాలు. పిల్లల చేత కూడా తినిపిస్తే మరీ మంచిది. ఆవాల ఆకులను ఎక్కువ మంది తినరు. వాటిని పప్పులో వేసుకుని తింటే నైట్రేట్లు అందుతాయి. వంకాయలు, వెల్లుల్లి, బత్తాయి, నారింజ వీటిని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోండి. ఇవన్నీ కూడా నైట్రేట్లను శరీరానికి అందిస్తాయి. ముఖ్యంగా వెల్లుల్లి రోజు తినండి. ఇది శరీరంలో నైట్రిక్ ఆక్సైడ్ తయారీని ఉత్తేజపరుస్తుంది.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
Also read: స్నాక్స్ గా నాలుగు గింజలు నోట్లో వేసుకున్నా చాలు... ఎంతో మేలు
Also read: రొమ్ము క్యాన్సర్ వారసత్వంగా వస్తుందా? లక్షణాలేంటి? ఎలా చెక్ చేసుకోవాలి?
Also read: రాత్రి పడుకోబోయే ముందు ఈ టీ తాగితే... ఆ సమస్యలకు చెక్ పెట్టొచ్చు
Also read: ఆపిల్ కన్నా గుడ్డులోనే అవెక్కువట.. అందుకే తినమంటున్నారు