Kidney stones: కిడ్నీలో రాళ్లు ఏర్పడే ప్రమాదం వీరికే ఎక్కువ... ఈ లక్షణాలు కనిపిస్తే తేలికగా తీసుకోవద్దు
కిడ్నీలో రాళ్లు ఏర్పడి, అవి సమస్యగా మారే వరకు మనకు తెలియవు.
కిడ్నీలో రాళ్లు ఏర్పడే సమస్య ఎక్కువమందిలో కనిపిస్తోంది. ఇవి ఖనిజాలు, యాసిడ్ లవణాలు ఒకదానికి ఒకటి అతుక్కుని గట్టి నిక్షేపాల్లా మారుతాయి. వాటినే మనం వాడుక భాషలో కిడ్నీలో రాళ్లు అని పిలుస్తాం. కొన్నిసార్లు ఇవి చాలా నొప్పిని కలిగిస్తాయి. రాళ్లు పరిమాణం పెద్దగా ఉంటే, ఆ నొప్పి ప్రసవసమయంలో వచ్చేంత నొప్పితో సమానంగా ఉంటుంది. కాబట్టి రాళ్ల సైజు పెరగక ముందే వాటికి చికిత్స తీసుకోవడం ఉత్తమం. ముఖ్యంగా కిడ్నీలో రాళ్లు ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకుంటే ఇంకా మంచిది.
మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడటానికి ఎన్నో కారణాలు ఉంటాయి. ప్రధానంగా...
1. అధిక ఆక్సలేట్ ఉన్న పాలకూర, ఊకలాంటి తృణధాన్యాలు ఉన్న ఆహారం తీసుకోవడం
2. సోడియం అధికంగా ఉండే ఉప్పని పదార్థాలు తినడం
3. జంతు ప్రోటీన్ అధికంగా తీసుకోవడం
4. గౌట్ సమస్యలు కలిగి ఉండడం
5. టైప్ 2 డయాబెటిస్
6. ఊబకాయం
7. బీఎమ్ఐ అధికంగా ఉండడం
8. గ్యాస్ట్రిక్ సమస్యలు
9. గ్యాస్ట్రిక్ బైపాస్ సర్జరీ జరిగిన వారిలో
10. కొన్ని రకాల మందుల వాడకం వల్ల (అధిక రక్తపోటుకు, హెచ్ఐవీకి వాడే మందులు)
11. డీ హైడ్రేషన్
పైన చెప్పిన సమస్యలు లేదా ఆహారం మీ జీవన శైలిలో ఉంటే జాగ్రత్తగా ఉండడం మంచిది.
లక్షణాలు ఇలా ఉంటాయి...
మూత్రపిండాల్లో రాళ్లు ఏర్పడినప్పుడు ప్రాథమిక దశలోనే కొన్ని లక్షణాలు కనిపిస్తాయి.
1. మూత్రం దుర్వాసన రావడం
2. మూత్రం పింక్, బ్రౌన్, ఎరుపు రంగుల్లో పడడం
3. జ్వరం, నొప్పులు
4. మూత్రవిసర్జన సమయంలో నొప్పి, మంట
5. వికారంగా అనిపించడం
6. వాంతులు
7. కడుపులో నొప్పి
8. మూత్రవిసర్జన పూర్తి స్థాయిలో జరగకుండా, కొంచెంకొంచెంగా జరుగుతుంది.
పైన చెప్పిన లక్షణాలు ఏమాత్రం కనిపించినా ఓసారి వైద్యుడిని సంప్రదించి కిడ్నీలో రాళ్లు ఉన్నాయో లేవో చెక్ చేసుకోవడం మంచిది. ఎందుకంటే రాళ్లు చిన్న పరిమాణంలో ఉన్నప్పుడు మందుల ద్వారా వాటిని కరిగించవచ్చు. పరిమానం పెరుగుతున్న కొద్దీ నొప్పితో పాటూ, చికిత్సకు అయ్యే ఖర్చు కూడా పెరుగుతుంది.
Also read: తమ్ముడిని తలపైకెక్కించుకుని... వామ్మో ఈ రికార్డును బద్దలు కొట్టడం ఎవరితరం కాదు
Also read: ఏం ఫుడ్ కాంబినేషన్ గురూ ఇది... విచిత్రం కాదు, వికారం కలుగుతోంది