Guinness World Record: తమ్ముడిని తలపైకెక్కించుకుని... వామ్మో ఈ రికార్డును బద్దలు కొట్టడం ఎవరితరం కాదు
వరల్డ్ రికార్డులు ప్రతి ఏడాది ఎన్నో నమోదవుతుంటాయి. వాటిల్లో అరుదైనవి మాత్రం కొన్నే.
ప్రపంచ రికార్డంటే ఎలా ఉండాలి? దాన్ని బద్దలు కొట్టమని ప్రపంచానికే సవాలు విసిరినట్టు ఉండాలి. కానీ చాలా రికార్డులు ఫన్నీగా ఉంటాయి. టోపీలో ఎక్కువ కోడిగుడ్లు దాచిన వ్యక్తి, నోటితో ఎక్కువ స్ట్రాలు పట్టుకున్న వ్యక్తి... ఇలాంటి రికార్డులు చూడటానికి, వినడానికి కూడా అంత ఆసక్తిగా ఉండవు. కానీ ఇద్దరు అన్నదమ్ములు మాత్రం కళ్లు చెదిరేలా, దిమ్మతిరిగేలా రికార్డు సృష్టించారు.
జియాంగ్ క్యో కో, జియాంగ్ క్యో నైప్... ఇద్దరు అన్నదమ్ములు. వీరిద్దరిది వియత్నాం. నివసించేది మాత్రం స్పెయిన్ దేశంలో. డిసెంబర్ 22న ఒక అద్భుతమైన ఫీట్ చేసి ప్రపంచాన్ని ఆకర్షించారు. అలాగే గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి కూడా ఎక్కారు. స్పెయిన్లోని ఒక చర్చికి ముందు 90 మెట్లు ఉన్నాయి. అన్న తమ్ముడిని తన తలపై ఎక్కించుకున్నాడు, అది కూడా తల కిందులుగా. అలా తమ్ముడిని మోసుకుంటూ 52 సెకన్లలో 90 మెట్లు ఎక్కేశాడు. చూసేవారు నిజంగా ఆశ్చర్యపోయారు. ఎందుకంటే అలా తలపై, తలకిందులుగా ఓ మనిషిని నిల్చోబెట్టుకోవడమే ఒక అద్భుతమంటే, ఇక వేగంగా నడుచుకుని 90 మెట్లు ఎక్కేయడం మరోవింత.
ఇంతకుముందు ఈ రికార్డు చైనా దేశస్థులు ఈ రికార్డును సృష్టించారు. నిమిషంలో 26 మెట్లను ఇలా ఎక్కగలిగారు. ఇప్పుడు జియాంగ్ అన్నదమ్ములు ఆ రికార్డును బద్దలు కొట్టడమే కాదు, అరుదైన రికార్డును సృష్టించారు.
Also read: ఏం ఫుడ్ కాంబినేషన్ గురూ ఇది... విచిత్రం కాదు, వికారం కలుగుతోంది