Obesity: ఒళ్లు పెరిగితే పళ్లు రాలతాయా? కొత్త అధ్యయనం ఏం చెబుతోంది...
ఊబకాయం వల్ల పళ్లు త్వరగా రాలిపోయే ప్రమాదం ఉందంటోంది కొత్త అధ్యయనం.
![Obesity: ఒళ్లు పెరిగితే పళ్లు రాలతాయా? కొత్త అధ్యయనం ఏం చెబుతోంది... Obesity and oral health: Is there a link? A recent study says yes Obesity: ఒళ్లు పెరిగితే పళ్లు రాలతాయా? కొత్త అధ్యయనం ఏం చెబుతోంది...](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/22/3c899312eb7f37ddfb19995bd78b778b_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
ఊబకాయానికీ, దంతాల ఆరోగ్యానికీ మధ్య సంబంధం ఉందా? ఒళ్లు పెరగడం వల్ల నోటిలోని దంతాలు కూడా త్వరగా రాలిపోయే ప్రమాదం ఉందా? అవుననే అంటోంది కొత్త అధ్యయనం. ఊబకాయం వల్ల శరీరంలో దీర్ఘకాలిక ఇన్ఫ్లమేషన్ ఏర్పడుతుంది. దీనివల్ల శరీరంలోని ఎముకల్లో విచ్చిన్నత పెరుగుతుంది. మన దంతాలను పట్టి ఉంచే ఎముకల్లో కూడా విచ్చిన్నత అధికమవుతుంది. దీనివల్ల దంతాలు త్వరగా ఊడిపోయే ప్రమాదం ఏర్పడుతుంది. అలాగే చిగుళ్ల సమస్యలు కూడా ఏర్పడతాయి. ఈ కొత్త అధ్యయనం వివరాలను ‘జర్నల్ ఆఫ్ డెంటల్ రీసెర్చ్’మ్యాగజైన్లో ప్రచురించారు. అధ్యయనాన్ని న్యూయార్క్ లోని యూనివర్సిటీ ఆఫ్ బఫేలో కు చెందిన పరిశోధకులు నిర్వహించారు.
ఈ ప్రయోగాన్ని ఎలుకలపై నిర్వహించారు. వాటిని రెండు గ్రూపులుగా విభజించారు. వాటికి 16 వారాల పాటూ ప్రత్యేకమైన ఆహారాన్ని తినిపించారు. ఒక గ్రూపు ఎలుకలకు తక్కువ ఫ్యాట్ ఉన్న ఆహారాన్ని పెట్టారు. రెండో గ్రూపు ఎలుకలకు అధికంగా ఫ్యాట్ ఉన్న ఆహారాన్ని తినిపించారు. కొవ్వున్న ఆహారాన్ని తిన్న ఎలుకలు పదహారు వారాల్లోనే బాగా బరువు పెరిగాయి. వాటిపై పరిశోధన చేశారు. ఫ్యాట్ తక్కువ ఉన్న ఆహారం తిన్న ఎలుకలు బరువు పెరగలేదు. అంతేకాదు వాటి శరీరంలో ఇన్ఫ్లమేషన్ ఛాయలు తక్కువ కనిపించాయి. వాటి ఎముకలు, దంతాలు అన్నీ చక్కగానే ఉన్నాయి. కానీ బరువు పెరిగిన ఎలుకల్లో మాత్రం చాలా తీవ్రమైన మార్పులు కనిపించాయి.
బరువు పెరిగిన ఎలుకల శరీరంలో ఇన్ఫ్లమేషన్ అధికంగా గుర్తించారు అధ్యయనకర్తలు. దాని తాలూకు ప్రభావం ఎముకలపై కనిపించింది. ఈ ఇన్ఫ్లమేషన్ వల్ల ఎముకల్లో రోగనిరోధక వ్యవస్థ పనితీరును తగ్గించే ‘మైలోయిడ్ డిరైవ్డ్ సప్రెసర్ కణాలు’అధికంగా పుట్టుకొస్తాయి. ఈ కణాలు ముఖ్యంగా ఎముకమజ్జల్లో అభివృద్ధి చెందుతాయి. వీటివల్ల ఎముక పెళుసుగా మారుతుంది. ముఖ్యంగా దంతాలను పట్టి ఉంచే ఎముకలపై ఈ కణాల ప్రభావం అధికంగా పడుతుంది. దీనివల్ల త్వరగానే దంతాలు ఊడిపోయే ప్రమాదం కలుగుతుంది. 30 ఏళ్లు నిండిన 47 శాతం మందిలో ఈ ప్రమాదం పొంచి ఉన్నట్టు పరిశోధకులు తేల్చారు. కాబట్టి ఊబకాయం వల్ల కేవలం రక్తపోటు, గుండె సంబంధ వ్యాధులు వంటివే కాదు, దంతాల సమస్యలు కూడా కలుగుతాయని కొత్త అధ్యయనం వల్ల తేలింది.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)