Kidney Health: పెయిన్ కిల్లర్స్ ఎక్కువ వాడుతున్నారా... కిడ్నీలు దెబ్బతినొచ్చు జాగ్రత్త
మన ఆహారపు అలవాట్ల మీదే కిడ్నీల ఆరోగ్యం ఆధారపడి ఉంటుంది. కొన్ని రకాల ఆహారాలు వాటిని దెబ్బతీస్తున్నాయి.
కిడ్నీలు బాగున్నంత కాలం ఫర్వాలేదు, ఒక్కసారి చెడిపోయాయా... వాటిని ట్రాన్స్ ప్లాంట్ చేసుకోవాలే తప్ప, బాగు చేయడం కుదరదు. లేదా వేలకు వేలు ఖర్చు పెడుతూ డయాలసిస్ సెంటర్ల చుట్టూ తిరగాలి. అంత బాధ అనుభవించకుండా ఉండాలంటే మనకున్న కొన్ని ఆహారపు అలవాట్లను వదులుకోవాలి. కిడ్నీల ఆరోగ్య బాగుండాలంటే కొన్ని రకాల ఆహారానికి దూరంగా ఉండాలి. అవి కిడ్నీల పనితీరును చాలా ప్రభావితం చేస్తాయి. తద్వారా కిడ్నీ సమస్యలు మొదలవుతాయి. కిడ్నీలకు హానిచేసే అలవాట్లను మానుకుని, వాటికి మేలు చేసే ఆహారాన్ని తినాలి.
ఈ అలవాట్లు మానుకోవాలి
1. ఉప్పు తగ్గితే నాలుకకు మాత్రమే చప్పగా అనిపిస్తుంది, కానీ మిగతా శరీరానికి మేలు కలుగుతుంది. ఉప్పు తగ్గించి తినడం వల్ల కిడ్నీలు కూడా ఆరోగ్యంగా ఉంటాయి. ఆహారంలో అధికంగా ఉప్పు తింటే కిడ్నీలకు హాని జరుగుతుంది. కాబట్టి ఎక్కువగా ఉప్పు తినే అలవాటుంటే తగ్గించుకోవాలి.
2. ప్రతి నొప్పికి పెయిన్ కిల్లర్స్ వాడే వాళ్లు చాలా మంది ఉన్నారు. వైద్యుడిని సంప్రదించకుండా ఇలా పెయిన్ కిల్లర్స్ అధికంగా వాడితే అది కిడ్నీలపై ప్రభావం చూపిస్తుంది. కిడ్నీల పనితీరు మందగిస్తుంది. తద్వారా ఎన్నో ఆరోగ్య సమస్యలు మొదలవుతాయి.
3. ఫాస్ట్ ఫుడ్, బేకరీ ఐటెమ్స్ తినడం తగ్గించాలి. వీటిలో చక్కెర శాతం చాలా అధికంగా ఉంటుంది. వారానికి రెండు మూడుసార్లు తినే అలవాటుంటే మానుకోండి.
4. అతిగా శుధ్దిచేసిన ఆహారానికి కూడా దూరంగా ఉండాలి. వీటిలో సోడియం, ఫాస్పరస్ అధికంగా ఉంటాయి. వీటి వల్ల కిడ్నీలు అవసరానికి మించి అధికంగా పనిచేయాల్సి వస్తుంది.
5. ధూమపానం, మద్యపానం చేసేవారు ఆ పనులను మానుకోవాలి. లేదా కనీసం తగ్గించుకోవాలి. ఈ రెండు అలవాట్లు ఉన్న వారికి మూత్రంలో అధికంగా ప్రోటీన్ బయటికి పోతుంది. ఇది మూత్రపిండాలకు హాని చేస్తుంది.
6.చక్కెర ఉన్న ఆహారాలను కూడా చాలా తగ్గించాలి. పంచదారతో చేసిన తీపి పదార్థాలను వారానికి రెండు సార్లు కన్నా ఎక్కువ తినకూడదు. తేనె, బెల్లంతో చేసిన ఆహారాలు తిన్నా ఫర్వాలేదు కానీ, పంచదారతో చేసినవి తినడం వల్ల కేవలం కిడ్నీలే కాదు, మిగతా అవయవాలకు కూడా చేటే.
ఇలా చేయాలి
1. కిడ్నీల ఆరోగ్యం బావుండాలంటే రోజూ మూడు లీటర్ల నీళ్లు తాగాలి. తగినంత నీరు తాగకపోతే మూత్రపిండాలపై తీవ్ర భారం పడుతుంది.
2. తాజా కూరగాయలు, ఆకుకూరలతో వండిన ఆహారం మీ మెనూలో ఉండేట్టు చూసుకోవాలి.
3. నిద్ర కూడా మూత్రపిండాల ఆరోగ్యానికి చాలా అవసరం. తగినంత నిద్రలేకపోయినా కిడ్నీల ఆరోగ్యం దెబ్బతింటుంది.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీకు ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.