Garlic: ఇంట్లో దోమలు ఎక్కువయ్యాయా... వెల్లుల్లితో తరిమికొట్టండి
వెల్లుల్లి కేవలం కూరల్లో రుచికో, రసంలో పోపుకో మాత్రమే వాడరు. దీంతో ఎన్నో ఆరోగ్యప్రయోజనాలు ఉన్నాయి.
తెలుగువారి వంటింట్లో వెల్లుల్లి అంతర్భాగం. చాలా మందికి కూరల్లో వెల్లుల్లి వేయకపోతే తిన్నట్టు కూడా అనిపించదు. వెల్లుల్లి అందించే ఆరోగ్యప్రయోజనాలు కూడా తక్కువేమీ కాదు. ఈజిప్టులో దొరికిన ఓ గ్రంథంలో వెల్లుల్లితో 22 రోగాలను నివారించవచ్చని ఉంది. ఆ గ్రంథం దాదాపు 15వ శతాబ్ధానికి చెందినదని అంచనా వేశారు చరిత్ర కారులు. అంటే వెల్లుల్లిని ఎప్పట్నించో ఔషధాల తయారీలో కూడా ఉపయోగిస్తున్నారు. అతి ప్రాచీనమైన ఆయుర్వేద గ్రంథాలలో కూడా వెల్లుల్లి ప్రస్తావన ఉంది. దీనిలో ఉండే అద్భుతమైన గుణాలు శరీరానికి అంతర్గతంగా ఆరోగ్యాన్నివ్వడమే కాదు, బయటి నుంచి కూడా వెల్లుల్లి చాలా మేలు చేస్తుంది. దీనికి సూక్షక్రిములను చంపే యాంటీమైక్రోబయల్ లక్షణాలు ఎక్కువ. యాంటీ ఇన్ ఫ్లమ్మేటరీ గుణాలు కూడా అధికం, ఆయుర్వేదం ప్రకారం అనేక రకాలుగా వెల్లుల్లిని వినియోగించుకోవచ్చు. అందులో కొన్ని చిట్కాలు ఇవిగో...
అసిడిటీకి...
అజీర్ణం లేదా అసిడిటీ వంటి సమస్యలు వేధించినప్పుడు వెల్లుల్లిని ప్రయత్నించండి. పరగడుపున వెల్లుల్లిరెబ్బను చితక్కొట్టి, అందులో అర టీస్పూను తేనె కలుపుకుని తినండి. బాగా నమిలి మింగండి. ఇలా తరచూ చేస్తే జీర్ణం కాకపోవడం అనే సమస్య ఎదురుకాదు.
మొటిమలకు...
కొందరిలో మొటిమలు వస్తే ఒకంతట పోవు. అలాంటివారు వెల్లుల్లి రెబ్బను సగానికి కట్ చేసి, దాంతో మొటిమలపై రుద్దాలి. ఇందులో ఉండే యాంటీ ఇన్ ఫ్లమ్మేటరీ గుణాలు మొటిమలను రాకుండా నిరోధిస్తాయి. నొప్పిని కూడా తగ్గిస్తాయి. ఇందులో ఉండే అల్లిసిన్ చర్మరంధ్రాలను మూసుకుపోయేలా చేసే బ్యాక్టిరియాను చంపుతుంది.
జలుబు, దగ్గు
వానాకాలం వచ్చిందంటే జలుబు, దగ్గు, గొంతుదురద, నొప్పి వంటి సమస్యలు మొదలవుతాయి. అలాంటప్పుడు వెల్లుల్లి రెబ్బలను మెత్తగా చేసి, గ్లాసుడు నీటిలో మరిగించండి. తరువాత వడకట్టి కాస్త తేనె చేర్చుకుని గోరువెచ్చగా తాగేయండి. ఈ ఇంటి చిట్కాతో దగ్గు జలుబులు త్వరగా పోతాయి.
చుండ్రుకు...
చుండ్రు చాలా విసిగించే సమస్య. విపరీతమైన దురదతో ఏకాగ్రతను దెబ్బతీస్తుంది. కొన్ని వెల్లుల్లి రెబ్బలను కోసి దానికి కొద్దిగా తేనె వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని నేరుగా తలకు అప్లయ్ చేసి మెత్తగా మసాజ్ చేసుకోవాలి. పావుగంటసేపు అలాగే ఉంచి, తరువాత షాంపూతో కడిగేయాలి. ఇలా చేస్తే చుండ్రు సమస్య నుంచి బయటపడొచ్చు.
దోమలకు చెక్..
వెల్లుల్లి వాసన దోమలకు నచ్చదు. కాబట్టి ఇంట్లో దోమలు అధికంగా ఉన్నప్పుడు వెల్లుల్లి స్ప్రే తో తరిమికొట్టచ్చు. ఓ ఎనిమిది వెల్లుల్లి రెబ్బల్ని తీసుకుని నీటిలో వేసి బాగా మరిగించాలి. ఓ పది నిమిషాలు మరిగాక, చల్లారనివ్వాలి. దాన్ని వడకట్టి బాటిల్ లో వేసుకుని ఇల్లంతా స్ప్రే చేయాలి. దోమలు ఆ వాసనకు బయటకు పోవడం ఖాయం.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీ డైట్‌కు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Also read: కుంభకర్ణుడి విలేజ్.. రోజుల పాటూ నిద్రపోయే గ్రామస్థులు, కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు
Also read: ఉప్పు ఎక్కువ తింటున్నారా... అయితే మీ మెదడు ప్రమాదంలో పడినట్టే
Also read: ఈ ఆహారాలు క్యాన్సర్ కారకాలుగా మారచ్చు... జాగ్రత్త పడండి