cancer: ఈ ఆహారాలు క్యాన్సర్ కారకాలుగా మారచ్చు... జాగ్రత్త పడండి
భయంకరమైన వ్యాధుల్లో క్యాన్సర్ కూడా ఒకటి. ఇది ఎప్పుడు దాడి చేస్తుందో చెప్పడం కూడా కష్టమే. అందుకే ఆహారపరంగా జాగ్రత్తలు తప్పవంటున్నారు ఆరోగ్య నిపుణులు.
మనం తినే ఆహారమే.. మన ఆరోగ్యాన్ని నిర్ణయిస్తుంది. ఆరోగ్యకరమైన ఆహారం వల్లే శక్తివంతంగా, చురుకుగా ఉండగలం. కానీ మన పళ్లెంలో కొవ్వుతో నిండిన పదార్థాలు, అతిగా శుద్ధి చేసిన (రిఫైన్డ్) ఆహారాలు ఉంటే మాత్రం సమస్యలు తప్పవు. అనారోగ్యకరమైన ఆహారపు అలవాట్లే కాలేయం, మూత్రపిండాలు, గుండె సంబంధిత వ్యాధులకు దారితీస్తాయి. వీటిలో కొన్నింటినీ సకాలంలో గుర్తించి చికిత్స అందిస్తే ఫలితం ఉంటుంది, కానీ క్యాన్సర్ వంటి మహమ్మారులు మాత్రం ప్రాణాంతకంగా మారిపోతాయి. మనం తినే కొన్ని రకాల ఆహారాలు క్యాన్సర్ కారకాలుగా మారొచ్చని అధ్యయనాలు సూచిస్తున్నాయి.
1. ప్రాసెస్ చేసిన మాంసాహారం
చికెన్, మటన్, చేపలు, గుడ్లు... ఇవన్నీ ఆరోగ్యానికి మంచివే. అయితే వాటిని తాజాగా, బాగా ఉడికించుకుని తినాలి. కొన్నిసార్లు స్మోక్ చేసి లేదా ఉప్పు కలిపి ఆ మాంసాన్ని నిల్వ చేస్తారు. ఇలా నిల్వ చేసిన మాంసం వల్ల బరువు పెరగడం నుంచి క్యాన్సర్ వరకు అనేక ఆరోగ్య సమస్యలు కలుగవచ్చు. మాంసాన్ని ప్రాసెస్ చేయడం వల్ల క్యాన్సర్ కు కారణమయ్యే సమ్మేళనాలు ఉత్పత్తి అవుతాయి. దీని వల్ల పొట్ట క్యాన్సర్, పెద్ద పేగు క్యాన్సర్ వచ్చే అవకాశం ఉంది. కనుక ప్రాసెస్ చేసే మాంసాన్ని వాడే హాట్ డాగ్స్, సలామి, సాసేజ్లు తినేకన్నా ఇంట్లో తాజాగా వండుకుని తినడం మంచిది.
2. డీప్ ఫ్రై చేసే ఆహారాలు
నూనెలో డీప్ ఫ్రై చేసే ఆహారా పదార్థాల వల్ల కూడా క్యాన్సర్ కణాలు పెరిగే ప్రమాదం ఉంది. బంగాళాదుంపలు లేదా మాంసం వంటివి అధిక ఉష్ణోగ్రతల వద్ద నూనెలో వేయించినప్పుడు అక్రిలామైడ్ అనే సమ్మేళనం ఏర్పడుతుంది. ఇది క్యాన్సర్ కారక లక్షణాలను కలిగి ఉంటుంది. ఇది శరీరంలోని డీఎన్ఏని కూడా దెబ్బతీయగలదని అధ్యయనాలు సూచిస్తున్నాయి. ఇవి పొట్టలో మంటని పెంచి, ఆక్సీకరణ ఒత్తిడిని కలిగిస్తాయి. దీని వల్ల కూడా క్యాన్సర్ కణాలు ఉత్పన్నమవ్వచ్చు.
3. ప్రాసెస్ట్ ఫుడ్
అధికంగా శుధ్ది చేసిన పిండి, నూనె, పంచదార ఏవైనా కూడా క్యాన్సర్ కణాల అభివృద్ధిని ప్రోత్సహించే అవకాశం ఉంది. ఇలాంటి ప్రాసెస్డ్ ఆహారాన్ని అధికంగా తీసుకునేవారికి అండాశయం, రొమ్ము, గర్భాశయ క్యాన్సర్ వచ్చే ప్రమాదం ఎక్కువ. కనుక ప్రాసెస్ట్ ఫుడ్ ను వీలైనంత తక్కువగా తినేందుకు ప్రయత్నించండి. చక్కెరకు బదులు బెల్లం వాడడం మంచిది. ప్రాసెస్ట్ ఆయిల్ కు బదులు, ఆవ నూనె లేదా నూనె ఆడించుకోవడం వంటి పద్దతులకు మారడం మంచిది. నూనె మిల్లులు అందుబాటులోనే ఉంటున్నాయి.
4. ఆల్కహాల్
ఆల్కహాల్, కార్బోనేటెడ్ పానీయాలలో శుద్ధి చేసిన పంచదార, కేలరీల కంటెంట్ అధికంగా ఉంటుంది. వీటివల్ల శరీరంలో ఫ్రీ రాడికల్స్ సంఖ్య అధికంగా పెరుగుతుంది. అంతేకాదు ఆల్కహాల్ రోగనిరోధక వ్యవస్థపై ప్రభావం చూపిస్తుంది. ముందస్తుగా క్యాన్సర్ కణాలను గుర్తించడాన్నికష్టతరం చేస్తుంది. కనుక ఇలాంటి పానీయాలను వీలైనంత దూరంగా పెట్టడం మంచిది.
5. ప్యాకేజ్డ్ ఫుడ్
ఇప్పుడు మార్కెట్ మొత్తం ప్యాకేజ్ట్ ఫుడ్ మీద ఆధారపడింది. ‘రెడీ టు కుక్’ ధోరణి జనాల్లో పెరిగిపోయింది. అందుకే ఉప్మా దగ్గర నుంచి బిర్యాని వరకు అన్నీ రెడీ టు కుక్ పద్ధతిలో ప్యాకెట్లుగా లభిస్తున్నాయి. వాటిని ఇంటికి తెచ్చి కాసేపు ఉడికిస్తే సరి ఆహారం సిద్ధమైపోతుంది. పోహా, నూడిల్స్, ఇడ్లీ, పాస్తా ఇలా రకరకాల ఆహారాలను ప్యాకెట్లలో అమ్ముతున్నారు. ఇలాంటి ప్యాకేజ్డ్ ఫుడ్ కూడా క్యాన్సర్ వచ్చే ప్రమాదాన్ని పెంచుతుందని అధ్యయనాలు చెబుతున్నాయి. ఈ ప్యాకెజ్డ్ ఫుడ్ ‘బిస్ ఫెనాల్ ఎ’ అనే రసాయనంతో కవర్ చేసి ఉంటాయి. ఇది ఆహారంలో కరిగి హార్మోన్ల అసమతుల్యత, డీఎన్ఏలో మార్పు, క్యాన్సర్ కు కారణమవుతుంది.
ముఖ్య గమనిక: ఆరోగ్య నిపుణులు, పలు అధ్యయనాల్లో పేర్కొన్న అంశాలను ఇక్కడ యథావిధిగా అందించాం. మీ డైట్‌కు సంబంధించి ఎలాంటి సందేహాలు ఉన్నా వైద్యుడు లేదా ఆహార నిపుణులను సంప్రదించాలి. ఈ కథనం కేవలం మీ అవగాహన కోసమేనని గమనించగలరు.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Also read: బరువు తగ్గాలనుకుంటున్నారా... ఈ డ్రింకులకు దూరంగా ఉండండి
Also read: మహానటి అందం వెనుక రహస్యాలివే... మీరూ ఫాలో అయిపోండి
Also read: ఉప్పు ఎక్కువ తింటున్నారా... అయితే మీ మెదడు ప్రమాదంలో పడినట్టే