Mysterious Village: కుంభకర్ణుడి విలేజ్.. రోజుల పాటూ నిద్రపోయే గ్రామస్థులు, కారణం తెలిస్తే ఆశ్చర్యపోతారు
కజికిస్థాన్ చిన్న గ్రామంలోని గ్రామస్థులు పడుకుంటే కొన్ని రోజుల పాటూ లేచేవారు కాదట. ఆ మిస్టీరియస్ గ్రామం గురించి తెలుసుకుందాం రండి.
కజికిస్థాన్ లోని చిన్న గ్రామం కలాచి. దాదాపు ఏడేళ్ల క్రితం ఆ గ్రామంలోని పరిస్థితులు చాలా వింతగా ఉండేవి. ఇంటి నుంచి కూరగాయల కోసం బయలుదేరిన పెద్దాయన దారిలోనే మైకం కమ్మినట్టు రోడ్డుపై నిద్రపోయేవాడు. ఆడుకునేందుకు బయటికి వచ్చిన చిన్న పిల్లలు కళ్లు తిరిగినట్టు అయి, నిద్ర ముంచుకు వచ్చినట్టు ఇంటి గుమ్మాలపైనే గాఢనిద్రలోకి జారుకునే వారు.
పిల్లా పెద్దా అనే తేడా లేదు... సమయం, సందర్భం అవసరం లేదు, ఎప్పుడు పడితే అప్పుడు, ఎక్కడ పడితే అక్కడ ఆ గ్రామంలోని వారంతా నిద్రపోయేవారు. ఇలా కొన్నేళ్ల పాటూ ఆ గ్రామంలో ప్రజలు ఇబ్బంది పడ్డారు. ఏం జరుగుతుందో తెలియక సతమతమయ్యారు. ఆ వింత ప్రపంచవ్యాప్తంగా వైరల్ అయింది. ఆ గ్రామంలోని ప్రజలు అలా నిద్రపోవడానికి కారణాలేంటో తెలుసుకోవడానికి వివిధ దేశాల పరిశోధకులు రంగంలోకి దిగారు. చివరికి కారణాన్ని కనిపెట్టారు కూడా.
నిద్రలేచాక గజినీలే...
ఈ గ్రామంలోని పరిస్థితి తొలి నుంచి ఇలా లేవు. మొదటి సారి 2012లో కొంతమంది గ్రామస్థులు చేస్తున్న పనులను వదిలేసి హఠాత్తుగా నిద్రలోకి జారుకున్నారు. వారికేమైందో అనుకుని ఆసుపత్రుల చుట్టూ తిప్పినా ఫలితం లేదు. ఒక ఆరురోజుల తరువాత వాళ్లే తిరిగి మేల్కొనేవారు. కానీ వారికి తాము ఎంత సేపు నిద్రపోయాం, నిద్రపోవడానికి ముందు ఏం జరిగింది లాంటి విషయాలు గుర్తుకొచ్చేవి కాదు. పడుకుని లేచాక మగవారిలో సెక్స్ కోరికలు కూడా విపరీతంగా కలిగేవి. రోజులు గడిచేకొద్దీ గ్రామంలో నివసించే అందరికీ ఇలాంటి అనుభవాలు కలగడం మొదలైంది. అలా ఈ ఊరు గురించి ప్రపంచవ్యాప్తంగా తెలిసింది. ఈ గ్రామానికి ‘స్లీపీ హోలో’ అనే పేరు కూడా పెట్టారు. ప్రజలు తమ ఊరిలోని నీరు, గాలి, ఆకాశాన్ని కూడా అనుమానించడం మొదలుపెట్టారు. వాటి వల్లే తమకి ఈ గతి పడుతోందని సందేహించేవారు. చాలా కుటుంబాలు ఊరు విడిచి వెళ్లిపోయాయి కూడా. బయట బతకలేక గ్రామంలోనే ఉండిపోయిన కుటుంబాలు మాత్రం అలా నిద్రపోతూ, లేస్తూ బతికేయడం మొదలుపెట్టారు.
కారణం ఏంటంటే...
పరిశోధకులు అత్యంత కష్టమ్మీద ఈ స్లీపింగ్ సిండ్రోమ్ ఓ కారణాన్ని కనిపెట్టగలిగారు. అయితే ఇదే కారణమని నిరూపించలేకపోయారు. ఆ గ్రామానికి దగ్గర్లో సోవియట్ల కాలం నాటి ఓ యురేనియం గని ఉంది. ఆ గని నుంచి వచ్చే విషపూరిత మైన వాయువులే ఇలా నిద్రముంచుకు వచ్చేలా చేస్తున్నాయని వారు తేల్చారు. అలాగే గ్రామంలోని గాలిలో కార్బన్ మోనాక్సైడ్ అధికంగా ఉన్నట్టు గుర్తించారు. ఈ రెండు కారణాలతోనే గ్రామస్థులు నిద్రపోతున్నట్టు అంచనా వేశారు. కజికిస్తాన్ ప్రభుత్వం కూడా 2015లో అధికారికంగా కార్బన్ మోనాక్సైడ్ వల్లే ఇలా జరుగుతోందని ప్రకటించింది.
ప్రస్తుతం ఆ గ్రామంలో 120 కుటుంబాలు నివసిస్తున్నాయి. అయితే వీరికిప్పుడు స్లీపింగ్ సిండ్రోమ్ సమస్య లేదు. అందరిలా సాధారణంగా నిద్రపోతున్నారు. దీన్ని బట్టి ఆ గాలిలో కార్బన్ మోనాక్సైడ్ తగ్గినట్టు భావిస్తున్నారంతా.
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి
Also read: మహానటి అందం వెనుక రహస్యాలివే... మీరూ ఫాలో అయిపోండి
Also read: ఉప్పు ఎక్కువ తింటున్నారా... అయితే మీ మెదడు ప్రమాదంలో పడినట్టే
Also read: జిజాంటిక్ జిలేబి... ఒక్కటే కిలో తూగుతుంది, చూస్తే నోరూరిపోవడం ఖాయం