Red Ladyfinger: ఈ బెండకాయ కిలో రూ.800... తింటే ఎంత ఆరోగ్యమో
మామూలు బెండకాయలు మార్కెట్లో కిలో అరవై రూపాయలకే దొరుకుకుతాయి. కానీ ఈ ఎర్ర బెండకాయలు ధర మాత్రం కిలో రూ.800.
కరోనా వచ్చాక ప్రజల ఆహారశైలిలో మార్పు వచ్చింది. ఆరోగ్యకరమైన ఆహారానికి ప్రాధాన్యతనిస్తున్నారు. అందులోనూ రోగనిరోధక శక్తిని పెంచే ఆర్గానిక్ కూరగాయలను వాడటానికే మొగ్గుచూపుతున్నారు. అందుకే మధ్యప్రదేశ్లోని భోపాల్ కు చెందిన మిశ్రిలాల్ రాజ్ పుత్ అధిక ఆరోగ్య ప్రయోజనాలను ఇచ్చే ఎర్ర బెండకాయల సాగును చేపట్టారు. అది కూడా ఎలాంటి రసాయనిక ఎరువులు వాడకుండా సేంద్రీయ పద్ధతిలో పండిస్తున్నారు. ఆ చుట్టుపక్కల అతని బెండకాయలకు భలే గిరాకీ ఏర్పడింది.
పచ్చ బెండకాయలతో పోలిస్తే ఎర్ర బెండకాయలో ఆరోగ్య ప్రయోజనాలు అధికంగా ఉంటాయి. కనుక వాటి ధర కూడా సాధారణ బెండకాయతో పోలిస్తే ఆరు నుంచి ఏడు రెట్లు అధికంగా పలుకుతుంది. అందుకే ఎర్ర బెండకాయల సాగుని చేపట్టినట్టు చెబుతున్నాడు రాజ్ పుత్. ముందుగా తాను ఎర్ర బెండకాయల్ని పండించాలని నిర్ణయించుకున్నాక వారణాసిలోని అగ్రికల్చరల్ రీసెర్చ్ ఇన్ స్టిట్యూట్ నుంచి కిలో విత్తనాలు కొని తెచ్చుకున్నట్టు చెప్పాడు. వాటిని ఈ ఏడాది జులై మొదటి వారంలో పొలంలో చల్లాడు. నలభై రోజులకు బెండకాయలు కాయడం మొదలైనట్టు చెప్పాడు. తాను ఎలాంటి రసాయనిక ఎరువులు, క్రిమిసంహారక మందులు చల్లకుండా సేంద్రీయ ఎరువులతోనే సాగు చేస్తున్నాడు రాజ్ పుత్. ఎకరాకు ఈ ఎర్ర బెండకాయలు కనిష్టంగా 40 క్వింటాళ్ల నుంచి గరిష్టంగా 80 క్వింటాళ్ల వరకు పంట చేతికొస్తుంది. వీటిని సూపర్ మార్కెట్లలో అర కిలో ప్యాకెట్లుగా కట్టి మూడు వందల నుంచి నాలుగువందల రూపాయల వరకు అమ్ముతున్నాడు రాజ్ పుత్. ఈ పంటనే భవిష్యత్తులో విస్తరించాలనుకుంటున్నట్టు చెబుతున్నాడు ఈ ఆధునిక రైతు.
వారికెంతో మేలు
ఆకుపచ్చ బెండకాయతో పోలిస్తే ఎరుపు బెండకాయలో పోషకాల విలువ ఎక్కువ. ముఖ్యంగా గుండె జబ్బులు, మధుమేహం, రక్త పోటు, కొవ్వు సమస్యలతో బాధపడేవారికి ఈ బెండకాయ ఎంతో మేలు చేస్తుంది. ఆ ఆరోగ్య సమస్యలు ఉన్నా వాళ్లు ఈ బెండ కాయ ఎంత తిన్నా మంచిదే. అందునా సేంద్రియ పద్దతిలో పండినది కావడంతో ఎక్కువ మంది వినియోగదారులు కొనేందుకు ఆసక్తి చూపిస్తున్నారు.
Also read: ఏ దేవుడికి ఏ పూలతో పూజ చేస్తే మంచిది?
Also read: పంచభక్ష్య పరమాన్నాలు అంటే ఇవే...
Also read: పిల్లల్లో రోగనిరోధక శక్తిని పెంచే వెజిటబుల్ పాన్ కేక్
Also read: కరీనా అందం, ఫిట్నెస్ వెనుక రహస్యం ఏంటంటే...
Also read:ఇన్‌స్టాగ్రామ్‌తో డబ్బులే డబ్బులు.. ఇదిగో ఇలా సంపాదించండి