రోజూ వేడినీళ్లు తాగడం వల్ల బరువు తగ్గుతారా? వైద్యనిపుణులు ఏం చెబుతున్నారు
వేడినీళ్లు - సాధారణ నీళ్లు... ఈ రెండింటిలో ఏది తాగడం మంచిది?
ఇప్పుడు ప్రపంచంలో ఎక్కువ శాతం మంది ఇబ్బంది పడుతున్న సమస్య అధిక బరువు. తిన్నా తినకపోయినా బరువు మాత్రం పెరిగిపోతున్నారు ఎంతోమంది. అందుకే బరువు తగ్గే పనులు చేసేందుకు, తేలికగా అరిగిపోయే ఆహారాన్ని తినేందుకు ఇష్టపడుతున్నారు. అందులో చాలా మంది ఫాలో అయ్యే చిట్కా ‘వేడి నీళ్లు తాగడం’. అయితే చాలా మందికి ఉన్న సందేహం వేడి నీళ్లు తాగితే నిజంగానే బరువు తగ్గుతారా? అని. వైద్య నిపుణులు ఏం చెబుతున్నారో చూడండి.
లాభమేనా?
మానవ మనుగడకు నీరే జీవనాధారం. నీరు సరిపడినన్ని తాగకపోతే శరీరం తన జీవక్రియలను సక్రమంగా నిర్వర్తించలేదు. మనిషి శరీరం దాదాపు 70 శాతం నీరే. కాబట్టే రోజుకు రెండు నుంచి మూడు లీటర్ల నీరు తాగాలి. వేడి నీటిని తీసుకుంటే బరువు తగ్గేందుకు సహకరిస్తుందా అనేది ఎక్కువ మందికి వచ్చే సందేహం. దీనికి కచ్చితంగా బరువు తగ్గుతారని చెబుతున్నారు వైద్యనిపుణులు. ప్రతి రోజూ ఉదయానే గ్లాసుడు వేడి నీళ్లు తాగితే అధిక బరువు తగ్గడం సులభంగా మారుతుంది. కేవలం బరువు తగ్గేందుకే కాదు వేడి నీళ్లు తాగడం వల్ల ఇంకా అనేక ఆరోగ్య ప్రయోజనాలున్నాయి.
వేడినీరైనా, సాధారణ ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీరు...ఏ నీరైనా మంచిదే. వేడి నీరు తాగడం వల్ల కొన్ని ఆరోగ్యప్రయోజనాలు కలిగితే, గది ఉష్ణోగ్రత వద్ద ఉన్న నీరు తాగడం వల్ల మరికొన్ని లాభాలు ఉంటాయి. ఉదయానే ఖాళీ పొట్టతో గోరువెచ్చని నీళ్లు తాగడం వల్ల చాలా మంచి ఫలితాలు కలుగుతాయి. గోరువెచ్చని నీరు పొట్టలోకి వెళ్లగానే శరీరం దాని ఉష్ణోగ్రతను స్వీకరిస్తుంది.జీవక్రియను ప్రారంభిస్తుంది. దీనివల్ల త్వరగా బరువు తగ్గుతారు. అంతేకాదు పొట్టలోని వ్యర్థాలను బయటికి పంపడంలో, జీర్ణక్రియను మెరుగు పరచడంలో కూడా వేడి నీళ్లు మీకు సహాయపడతాయి. శరీర కొవ్వును కరిగించడంలో కూడా వేడి నీళ్లు చాలా సహకరిస్తాయి. పోషకాహారం శోషణలో ఇది ఎంతో సహాయపడుతుంది. ఆరోగ్యంగా బరువు తగ్గేందుకు సహకరిస్తుంది.
నిద్రపోయే ముందు...
నిద్ర సరిగా పట్టని వారికి వేడి నీళ్లు ఔషధంలా పనిచేస్తాయి. నిద్రపోయే ముందు గ్లాసు వేడినీళ్లు తాగితే త్వరగా నిద్రపట్టే అవకాశం ఉంది.అలాగే ఊబకాయం, కొలెస్ట్రాల్ అధికంగా ఉన్న వారు కూడా వేడినీళ్లు రాత్రిపూట తాగితే కాస్త బరువు త్వరగా తగ్గే అవకాశం ఉంది. మానసిక ఒత్తిడిని తగ్గించడంలో కూడా వేడి నీళ్లు ముందుంటాయి. గ్యాస్, ఎసిడిటీ సమస్యలు కూడా త్వరగా తగ్గుతాయి.
Also read: బుజ్జి బేబీ బంప్‌తో అలియా, ఆమె వేసుకున్న ఈ పింక్ డ్రెస్ ఖరీదు ఎంతో తెలుసా?
Also read: షాకింగ్, వాయు కాలుష్యం వల్ల మధుమేహం వచ్చే అవకాశం, జాగ్రత్తలు తీసుకోక తప్పదు
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనలు, హెల్త్ జర్నల్స్ నుంచి సేకరించిన సమాచారాన్ని మీ అవగాహన కోసం ఇక్కడ యథావిధిగా అందించాం. ఈ సమాచారం వైద్యానికి లేదా చికిత్సకు ప్రత్యామ్నాయం కాదు. ఆరోగ్యానికి సంబంధించి.. ఎలాంటి సందేహాలున్నా మీరు తప్పకుండా డాక్టర్‌ను సంప్రదించాలి. ఈ ఆర్టికల్‌లో పేర్కొన్న అంశాలకు ‘ఏబీపీ దేశం’, ‘ఏబీపీ నెట్‌వర్క్’ ఎటువంటి బాధ్యత వహించవని గమనించగలరు.