Jubilee Hills By Election: జూబ్లీహిల్స్ ప్రజలకు అలర్ట్.. ఆంక్షలపై హైదరాబాద్ సీపీ సజ్జనార్ కీలక ఆదేశాలు
Hyderabad CP Sajjanar | జూబ్లీహిల్స్ ఉప ఎన్నికల వేళ నియోజకవర్గంలో నిర్దేశిత సమయంలో వైన్స్, రెస్టారెంట్లు బంద్ కానున్నాయి. పోలీసుల ఆంక్షలు పాటించాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఆదేశించారు.

Jubilee Hills By Election: హైదరాబాద్: జూబ్లీహిల్స్ ఉపఎన్నిక ప్రచారం ఆదివారం ముగియనుంది. ఈ ఉప ఎన్నిక దృష్ట్యా హైదరాబాద్ పోలీసులు అన్ని ముందు జాగ్రత్త చర్యలు తీసుకుంటున్నారు. ఉప ఎన్నిక జరగనున్న జూబ్లీహిల్స్ నియోజకవర్గం పరిధిలో (ఆదివారం) నవంబర్ 9వ తేదీ సాయంత్రం 6 గంటల నుంచి పోలింగ్ జరగనున్న నవంబర్ 11వ తేదీ సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనార్ హెచ్చరించారు. అదే విధంగా తిరిగి ఓట్ల లెక్కింపు జరిగే నవంబర్ 14వ తేదీ ఉదయం 6 గంటల నుంచి నవంబర్ 15 సాయంత్రం 6 గంటల వరకు ఆంక్షలు అమల్లో ఉంటాయని స్పష్టం చేశారు.
మద్యం షాపులు, రెస్టారెంట్స్ మూసివేత.. ఆంక్షలు
ఎన్నికల సమయంతో పాటు ఓట్ల లెక్కింపు సమయంలో దాదాపు 5 రోజులపాటు జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో మద్యం దుకాణాలన్నీ మూసివేయనున్నారు. వాటితో పాటు హోటల్స్, రెస్టారంట్‌లు, క్లబ్బులు మూసివేయాలని హైదరాబాద్ సీపీ సజ్జనార్ ఆదేశించారు. శాంతిభద్రతలకు ఎలాంటి భంగం వాటిల్లకుండా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో 144 సెక్షన్ అమల్లో ఉంటుందన్నారు. అందులో భాగంగా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో పోలింగ్ కేంద్రాలకు 200 మీటర్ల పరిధిలో ఐదుగురు లేదా అంతకంటే ఎక్కువ మంది గుమిగూడటంపై నిషేధం విధించారు. ముఖ్యంగా ఓట్ల లెక్కించే నవంబర్ 14న రోడ్లపైగానీ, ఇండ్ల మధ్యగానీ క్రాకర్స్ పేల్చడం నిషేధించినట్లు సజ్జనార్ తెలిపారు. ఎవరైనా పోలీసుల ఆదేశాలను ఉల్లంఘిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.
విజయంపై అప్పుడే ఛాలెంజ్‌లు
జూబ్లీహిల్స్ ఉపఎన్నిక రెండేళ్ల కాంగ్రెస్ పాలనకు రెఫరెండంగా భావించాలని, ఓడిపోతే రేవంత్ రెడ్డి ఓటమి అంగీకరించాలని మాజీ మంత్రులు కేటీఆర్, హరీష్ రావు ఛాలెంజ్ చేశారు. అయితే సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు బీఆర్ఎస్ ఛాలెంజ్ ను స్వీకరించలేదు. బీఆర్ఎస్ విజయం జూబ్లీహిల్స్ ఉపఎన్నికతోనే మొదలవుతుందని, నవంబర్ 14న రాష్ట్ర ప్రజలకు విషయం అర్థమవుతుందని గులాబీ శ్రేణులు చెబుతున్నాయి. అందరు మంత్రులు, సీఎం కూడా జూబ్లీహిల్స్ నియోజకవర్గంలో ప్రచారం వారిలో ఓటమి భయాన్ని సూచిస్తుందని బీఆర్ఎస్ నేతలు అన్నారు. అయితే గ్యారంటీలు నెరవేర్చిన కాంగ్రెస్ పార్టీకి జూబ్లీహిల్స్ ప్రజలు కట్టం గట్టి, ప్రజా పాలనకు ఆమోదం తెలుపుతారని సీఎం రేవంత్ రెడ్డి దీమా వ్యక్తం చేశారు.
బీఆర్ఎస్ తరఫున దివంగత ఎమ్మెల్యే మాగంగి గోపినాథ్ భార్య సునీత, కాంగ్రెస్ నుంచి సునీల్ యాదవ్, బీజేపీ నుంచి లంకల దీపక్ రెడ్డి బరిలో నిలిచారు. అయితే గతంలో పోటీ చేసిన అనుభవం సునీల్ యాదవ్, దీపక్ రెడ్డిలకు ఉంది. సునీత తొలిసారి ఎన్నికల బరిలోకి దిగారు.






















