Abhishek Sharma Records: అభి‘షేక్’ ఆడించాడు.. టీ20లలో ఫాస్టెస్ట్ బ్యాటర్‌గా ఘనత.. కోహ్లీ, సూర్య రికార్డ్ బ్రేక్
IND vs AUS 5th T20I: అంతర్జాతీయ టీ20ల్లో 1000 పరుగులు పూర్తి చేయడంలో అభిషేక్ శర్మ తన మార్క్ చూపించాడు. ఈ క్రమంలో కోహ్లీ, సూర్యకుమార్లను అధిగమించి రికార్డు సృష్టించాడు.

బ్రిస్బేన్: ఆస్ట్రేలియాతో జరిగిన చివరి టీ20 మ్యాచ్‌లో భారత ఓపెనర్ అభిషేక్ శర్మ అరుదైన ఘనత సాధించాడు. టీ20 ఇంటర్నేషనల్ లో 1000 పరుగులు పూర్తి చేసి పెద్ద రికార్డును తన ఖాతాలో వేసుకున్నాడు. టీ20 ఇంటర్నేషనల్ లో అతి తక్కువ బంతుల్లో 1000 పరుగులు చేసిన బ్యాటర్‌గా అభిషేక్ శర్మ నిలిచాడు. ఇంతకు ముందు ఈ జాబితాలో మొదటి స్థానంలో సూర్యకుమార్ యాదవ్ ఉన్నాడు. అత్యల్ప ఇన్నింగ్స్ లలో 1000 రన్స్ చేసిన విషయంలో కింగ్ విరాట్ కోహ్లీ కంటే వెనుకంజలో ఉన్నాడు.
సూర్య రికార్డును బద్దలు కొట్టిన అభిషేక్ శర్మ
గత సంవత్సరం జూలైలో అరంగేట్రం చేసిన అభిషేక్ శర్మ ఒక ఏడాలోనే చాలా సాధించాడు. అభిషేక్ టీ20 బ్యాటింగ్ ర్యాంకింగ్స్ లో తొలి స్థానంలో ఉన్నాడు. ఆస్ట్రేలియాతో శనివారం జరిగిన ఐదవ టీ20లో అతను విధ్వంసకర రీతిలో ప్రారంభించి సూర్యకుమార్ యాదవ్ రికార్డును బద్దలు కొట్టాడు. అభిషేక్ తన టీ20ల్లో 1000 పరుగులు 528 బంతుల్లో పూర్తి చేశాడు. ఇంతకు ముందు రెండవ స్థానంలో ఉన్న సూర్యకుమార్ 573 బంతుల్లో వెయ్యి పరుగులు చేశాడు. జాబితాలో 3వ స్థానంలో న్యూజిలాండ్ కు చెందిన ఫిల్ సాల్ట్, 4వ స్థానంలో గ్లెన్ మాక్స్‌వెల్ ఉన్నారు. విరాట్ కోహ్లీ 655 బంతుల్లో తన తొలి 1000 టీ20 పరుగులు పూర్తి చేశాడు.
తక్కువ బంతుల్లో 1000 టీ20 రన్స్ చేసిన బ్యాటర్లు వీరే
- అభిషేక్ శర్మ (భారత్)- 528 బంతులు
- సూర్యకుమార్ యాదవ్ (భారత్)- 573 బంతులు
- ఫిల్ సాల్ట్ (న్యూజిలాండ్)- 599 బంతులు
- గ్లెన్ మాక్స్వెల్ (ఆస్ట్రేలియా)- 604 బంతులు
- ఆండ్రే రస్సెల్ (వెస్టిండీస్), ఫిన్ అలెన్ (న్యూజిలాండ్)- 609 బంతులు
ఈ విషయంలో విరాట్ కోహ్లీ కంటే వెనుకే
అభిషేక్ శర్మ అత్యల్ప ఇన్నింగ్స్ ల విషయానికి వస్తే 1000 టీ20ఐ పరుగుల విరాట్ కోహ్లీ రికార్డును బద్దలు కొట్టలేకపోయాడు. కోహ్లీ ఇప్పటికీ అత్యల్ప ఇన్నింగ్స్ లలో 1000 పరుగులు చేసిన భారత బ్యాటర్‌గా ఉన్నాడు. విరాట్ కోహ్లీ 27 ఇన్నింగ్స్ లలో ఈ ఫీట్ చేరుకున్నాడు. అభిషేక్ శర్మ 28 ఇన్నింగ్స్ లలో ఈ ఘనత సాధించాడు.
ఈ విషయంలో అభిషేక్ శర్మ వికెట్ కీపర్ బ్యాటర్ కెఎల్ రాహుల్ ను వెనక్కి నెట్టాడు. రాహుల్ టీ20ఐలో 1000 పరుగులు 29వ ఇన్నింగ్స్ లో చేశాడు. ఈ జాబితాలో 1వ స్థానంలో ఇంగ్లాండ్ కు చెందిన డేవిడ్ మలన్ ఉన్నాడు. మలన్ తన 24వ టీ20ఐ ఇన్నింగ్స్ లో 1000 పరుగులు పూర్తి చేశాడు. భారత్ తో ఆడుతూనే మలన్ ఈ ఘనత సాధించాడు.





















