Millets: చిరుధాన్యాలు తింటే బీపీ, షుగర్ అదుపులో ఉంటాయా?
చిరుధాన్యాలు తినడం ద్వారా షుగర్, అధిక రక్తపోటు వంటి వాటిని అదుపులో పెట్టుకోవచ్చని ఎంతోమంది అభిప్రాయం.
చిరుధాన్యాలు అంటే కొర్రలు, అరికలు, ఊదలు, సామలు, ఆండు కొర్రలు, రాగులు వంటివి. ఒకప్పుడు వీటినే రోజూ తినేవారు. కానీ ఆధునిక జీవనశైలి కారణంగా ఈ పంటలు తగ్గిపోయాయి. వీటిని తినే వారి సంఖ్య కూడా తగ్గిపోయింది. నిజానికి మిల్లెట్స్ తినడం వల్ల ఆరోగ్యపరంగా ఎన్నో సానుకూల ప్రభావాలు కలుగుతాయి. ఇప్పుడిప్పుడే ఆరోగ్యం పై స్పృహ పెరగడంతో కొంతమంది చిరుధాన్యాలను ఆహారంలో భాగం చేసుకుంటున్నారు. ముఖ్యంగా గుండె జబ్బులు ఉన్నవారు, బీపీ, షుగర్ వంటి వాటితో బాధపడుతున్న వారు చిరుధాన్యాలను తినేందుకు ఇష్టపడుతున్నారు.
చిరుధాన్యాలు తినడం వల్ల చాలా రోగాలు రాకుండా అడ్డుకోవచ్చు. పాలిష్ పెట్టిన తెల్ల బియ్యాన్ని తింటే షుగర్ వ్యాధి త్వరగా వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే పొట్టు తీసిన గోధుమపిండితో చేసిన వంటకాలు, ఉప్మా రవ్వ, నూడిల్స్ వంటివి కూడా అధికంగా తింటున్నాం. వీటన్నిటి వల్ల ఏదో ఒక ఆరోగ్య సమస్య వస్తూనే ఉంటుంది. కానీ చిరుధాన్యాల వల్ల మాత్రం ఎలాంటి సమస్యలు రావు. ఊబకాయం, మధుమేహం, క్యాన్సర్ వంటి వాటిని అడ్డుకునే శక్తి చిరుధాన్యాలకే ఉంది. కాబట్టి వీటితో చేసే వంటకాలను అధికంగా తింటూ ఉండాలి. చిరుధాన్యాలతో అన్నం, సంగటి చేసుకోవచ్చు. అందుకే వీటిని కాకపోతే ఇవి కాస్త ముద్దగా వస్తాయి. అందుకే వీటిని తినడానికి ఎక్కువ మంది ఇష్టపడరు. వీటిని తినడం ప్రారంభిస్తే కొన్ని రోజులకే మీకు ఆరోగ్యంలో మార్పు కనిపిస్తుంది. మీరు ఉత్సాహంగా, చురుగ్గా ఉంటారు. బరువు కూడా అదుపులో ఉంటా ఉంటుంది. కాబట్టి నాలిక రుచి కోసం చూడకుండా చిరుధాన్యాలతో చేసిన వంటకాలను తినేందుకు ప్రయత్నించండి.
మధుమేహం, అధిక రక్తపోటుతో బాధపడుతున్న వారు అన్నాన్ని తినడం మానేసి కేవలం చిరుధాన్యాలనే తింటే ఆ రెండు అదుపులో ఉంటాయి. ఇక ఆ ఆరోగ్య సమస్యల బారిన పడని వారు ఇప్పటినుంచే చిరుధాన్యాలు తినడం వల్ల భవిష్యత్తులో వాటి బారిన పడకుండా ఉంటారు. వీటితో పరమాన్నం, కుడుములు, బూరెలు, బర్ఫీ, పాయసం, కేసరి ఇలా రకరకాలు చేసుకోవచ్చు. కేకులు, బిస్కెట్లు కూడా వండుకోవచ్చు. బిర్యానీలు కూడా చేసుకోవచ్చు. కాకపోతే తెల్లని అన్నంతో వండితే వచ్చేంత రుచిగా ఉండకపోవచ్చు. కానీ ఆరోగ్యానికి మాత్రం ఎంతో మేలు చేస్తాయి. కొర్రలతో వెజ్ బిర్యానీ చాలా టేస్టీగా ఉంటుంది. కొర్రల లడ్డూలు కూడా రుచిగా ఉంటాయి. రాగులతో దోశెలు, లడ్డూలు చేయచ్చు. ఇవన్నీ కూడా రుచిగా ఉండడమే కాదు, ఆరోగ్యాన్ని అందిస్తాయి.
Also read: రక్తంలో కొలెస్ట్రాల్‌ను తగ్గించుకోవాలా? అయితే ఈ పనులు చేయండి
Also read: కరివేపాకే కదా అని తీసిపారేయకండి, బరువుని ఇట్టే తగ్గించేస్తుంది
గమనిక: పలు అధ్యయనాలు, పరిశోధనల నుంచి సేకరించిన సమాచారాన్ని ఇక్కడ యథావిధిగా అందించాం. ఇది వైద్య నిపుణుల సూచనలకు ప్రత్యామ్నాయం కాదు. తప్పకుండా వైద్యుడు లేదా ఆహార నిపుణుల సలహా తీసుకున్న తర్వాతే ఈ ఆహారాన్ని మీ డైట్‌లో చేర్చుకోవాలి. ఈ సమాచారం కేవలం మీ అవగాహన కోసమే.