Temple Style Sweet Pongal : భోగి, సంక్రాంతి స్పెషల్.. గుడి ప్రసాదం లాంటి బెల్లం పరమాన్నం, టెంపుల్ స్టైల్ రెసిపీ
Bellam Paramannam Recipe : భోగి, సంక్రాంతి సమయంలో చాలామంది కొత్తగా వచ్చిన ధాన్యంతో పరమాన్నం చేసుకుంటారు. అయితే దీనిని టెంపుల్ స్టైల్లో ఎలా చేసుకుంటారో చూసేద్దాం.

Bhogi & Sankranti Special Bellam Paramannam Recipe : భోగి, సంక్రాంతి సెలబ్రేట్ చేసుకునే సమయానికి కొత్త ధాన్యం వస్తుంది. ఆ ధాన్యంతో భోగిమంటల్లో పరమాన్నం చేసుకునే ఆచారం ఎప్పటి నుంచో ఉంది. అలా మంటల్లో కాకున్నా ఈ సమయంలో చాలామంది పరమాన్నం చేసుకుంటారు. అయితే టెంపుల్ స్టైల్లో పరమాన్నం రుచి కావాలనుకుంటే ఈ రెసిపీని ట్రై చేయాల్సింది. క్రీమీగా, చల్లారినా గట్టిపడకుండా, పాలు విరగకుండా రుచిగా పరమాన్నం చేసుకోవాలంటే ఈ రెసిపీ ఫాలో అయిపోండి. మరి దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి? తయారీ విధానం ఏంటో చూసేద్దాం.
కావలసిన పదార్థాలు
బియ్యం - 1/2 గ్లాసు
పెసరపప్పు - 1/2 గ్లాసు (బియ్యం, పప్పు సమానంగా తీసుకుంటే రుచి బాగుంటుంది)
పాలు - 4 గ్లాసులు (చిక్కటి పాలు లేదా ఫుల్ క్రీమ్ మిల్క్)
నీళ్లు - 4 గ్లాసులు (నానబెట్టడానికి 1 గ్లాసు, పాలలో కలపడానికి 3 గ్లాసులు)
బెల్లం తురుము - 2 గ్లాసులు
యాలకుల పొడి - తగినంత
పచ్చ కర్పూరం - చిటికెడు (గుడి ప్రసాదం లాంటి వాసన కోసం)
నెయ్యి - 3 టేబుల్ స్పూన్లు
జీడిపప్పు, కిస్మిస్ - సరిపడా
తయారీ విధానం
ముందుగా బియ్యం, పప్పును శుభ్రంగా కడగాలి. దానిలో ఒక గ్లాసు నీళ్లు పోసి.. కనీసం అరగంట నుంచి గంట సేపు అయినా నానబెట్టుకోవాలి. ఇలా చేస్తే అన్నం త్వరగా, మంచిగా ఉడుకుతుంది. దీని తర్వాత స్టౌవ్ వెలిగించి మందపాటి గిన్నె పెట్టాలి. దానిలో 4 గ్లాసుల చిక్కటి పాలు, 3 గ్లాసుల నీళ్లు పోసి మరిగించాలి. పాలు కాస్త మరిగి దగ్గరగా అవ్వాలి.
పాలు మరిగేవరకు అడుగు పట్టకుండా గరిటెతో తిప్పుకోవాలి. పాలు దగ్గరగా అవుతున్నప్పుడు నానబెట్టుకున్న బియ్యం, పప్పును నీళ్లతో సహా పాలల్లో వేసేయాలి. బాగా కలపాలి. ఇప్పుడు మంటను తగ్గించి లేదా మీడియంలో పెట్టి.. అడుగు పట్టకుండా మధ్యమధ్యలో కలుపుతూ అన్నం మెత్తగా అయ్యేవరకు ఉడికించుకోవాలి. అన్నం ఉడికే సమయంలో బెల్లం తురుముకోవాలి.
అన్నం క్రీమీగా ఉడికిన తర్వాత స్టవ్ ఆపివేసి.. 2 గ్లాసుల బెల్లం తురుము అన్నంలో వేయాలి. బెల్లం వేసాక గరిటెతో బాగా కలిపి.. మూత పెట్టి 5 నిమిషాలు వదిలేయాలి. ఇలా చేయడం వల్ల పాలు విరకుండా ఉంటాయి. లేదంటే స్టౌవ్ వెలిగించి బెల్లం వేస్తే కొన్నిసార్లు విరిగిపోతుంది. 5 నిమిషాల తర్వాత మూత తీసి బెల్లం బాగా కరిగేలా కలపాలి. పూర్తిగా కలిసిన తర్వాత మళ్లీ స్టౌవ్ వెలిగించి మంటను చిన్నగా ఉంచుకోవాలి.
ఇప్పుడు యాలకుల పొడి, చిటికెడు పచ్చకర్పూరం వేసుకోవాలి. ఇలా చేయడం వల్ల టెంపుల్ స్టైల్ రుచి వస్తుంది. ఇలా 5 నిమిషాలు ఉడికిస్తే పరమాన్నానికి మంచి సువాసన వస్తుంది. ఇప్పుడు చిన్న పాన్ తీసుకుని దానిలో నెయ్యి వేసి.. వేడిగా అయ్యాక జీడిపప్పు, కిస్మస్లు వేసి దోరగా వేయించుకోవాలి. ఈ డ్రై ఫ్రూట్స్ నెయ్యితో సహా పరమాన్నంలో వేసి కలిపి స్టౌవ్ ఆపేయాలి. అంతే ఎంతో రుచిగా టెంపుల్ స్టైల్లో, క్రీమిగా ఉండే పరమాన్నం రెడీ.






















