Makar Sankranti 2026 : ప్రతి 72 సంవత్సరాలకు మకర సంక్రాంతి తేదీ ఎందుకు మారుతుందో తెలుసా? రహస్యమిదే
Makar Sankranti Date : సంక్రాంతి 2026ని జనవరి 14వ తేదీన జరుపుకుంటున్నాము. అయితే మీకు తెలుసా? సంక్రాంతి తేదీ ప్రతి 72 ఏళ్లకు ఒకసారి మారుతుందట. దానివెనుక కారణం ఏంటంటే..

Makar Sankranti Date Changing Facts : సూర్య గ్రహం మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారు. సాధారణంగా ప్రతి సంవత్సరం మకర సంక్రాంతి జనవరి 14 లేదా 15 తేదీలలో వస్తుంది. ఈ సంవత్సరం మకర సంక్రాంతి పండుగ బుధవారం, జనవరి 14, 2026వ తేదీన వచ్చింది. ఈ పండుగలో స్నానం, దానం, సూర్య పూజకు ప్రత్యేక స్థానం ఉంది. అయితే గత కొన్ని సంవత్సరాలుగా మనం మకర సంక్రాంతి పండుగను జనవరి 14 లేదా 15 తేదీలలో జరుపుకుంటున్నాము.
మకర సంక్రాంతి పండుగ ఎప్పుడు జరుపుకోవాలి అనేది పూర్తిగా సూర్యుని గమనంపై ఆధారపడి ఉంటుంది. అందుకే మకర సంక్రాంతి తేదీలలో మార్పులు ఉంటాయి. కానీ రాబోయే కాలంలో మకర సంక్రాంతి జనవరి 14 లేదా 15 కాదు.. జనవరి 16న జరుపుకుంటాము. దీనికి కారణం ఏమిటో తెలుసుకుందాం.
మారుతోన్న సంక్రాంతి తేదీ
మకర సంక్రాంతి పండుగ 1902 నుంచి ఇప్పటివరకు జనవరి 14 లేదా 15 తేదీలలో జరుపుకుంటున్నారు. కానీ 18వ శతాబ్దంలో మకర సంక్రాంతి జనవరి 12 లేదా 13 తేదీలలో జరుపుకునేవారు. రాజు హర్షవర్ధనుడి కాలంలో మకర సంక్రాంతి పండుగ డిసెంబర్ 24న వచ్చింది. మొఘల్ చక్రవర్తి అక్బర్ పాలనలో మకర సంక్రాంతి జనవరి 10వ తేదీన జరుపుకున్నారు. శివాజీ కాలంలో ఈ పండుగ జనవరి 11వ తేదీన వచ్చింది. ప్రస్తుతం 2077 వరకు మనం మకర సంక్రాంతి పండుగను జనవరి 14 లేదా 15 తేదీలలో జరుపుకుంటాము.
మకర సంక్రాంతి తేదీలో మార్పులకు కారణం ఏమిటంటే..
ఈ విషయంపై జ్యోతిష్యుడు అనీష్ వ్యాస్ మాట్లాడుతూ.. సూర్య భగవానుడు ధనుస్సు రాశిని విడిచిపెట్టి మకర రాశిలోకి ప్రవేశించినప్పుడు మకర సంక్రాంతి పండుగ జరుపుకుంటారని చెప్పారు. ప్రతి సంవత్సరం సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయం దాదాపు 20 నిమిషాలు ఆలస్యంగా జరుగుతుంది. ఈ విధంగా.. ప్రతి 3 సంవత్సరాలకు సూర్యుడు దాదాపు 1 గంట ఆలస్యంగా మకర రాశిలోకి ప్రవేశిస్తాడు. ఈ విధంగా 72 సంవత్సరాలలో సూర్యుడు మకర రాశిలోకి ప్రవేశించే సమయం ఒక రోజు ఆలస్యం అవుతుంది. అందుకే ప్రతి 72 సంవత్సరాలకు మకర సంక్రాంతి తేదీ ఒక రోజు ముందుకు వెళుతుంది.
వెయ్యి సంవత్సరాల క్రితం జనవరి 1న సంక్రాంతి?
జ్యోతిష్య గణనల ప్రకారం.. సూర్యుని వేగం ప్రతి సంవత్సరం దాదాపు 20 సెకన్లు పెరుగుతోంది. ఈ విధంగా మనం అంచనా వేస్తే.. వెయ్యి సంవత్సరాల క్రితం మకర సంక్రాంతి జనవరి 1వ తేదీన జరుపుకున్నారని భావించవచ్చు. దీని ఆధారంగా అంచనా వేస్తే.. రాబోయే 5000 సంవత్సరాల తర్వాత మకర సంక్రాంతిని ఫిబ్రవరి చివరిలో జరుపుకుంటారని చెప్పవచ్చు. ప్రస్తుతం 2077 వరకు మనం మకర సంక్రాంతి పండుగను జనవరి 14 లేదా 15 తేదీలలో జరుపుకుంటాము.
గమనిక : ఇక్కడ అందించిన సమాచారం నమ్మకాలు, సమాచారం ఆధారంగా మాత్రమే ఇవ్వబడింది. ABP దేశం ఎటువంటి నమ్మకం లేదా సమాచారాన్ని ధృవీకరించదని ఇక్కడ చెప్పడం ముఖ్యం. ఏదైనా సమాచారం లేదా నమ్మకాన్ని ఆచరించే ముందు, సంబంధిత నిపుణుడిని సంప్రదించండి.






















