Pregnancy Sleep Tips : గర్భంతో ఉన్నారా? ఇలా నిద్ర పోతున్నారా? అయితే బిడ్డకు ప్రమాదం.. జాగ్రత్త
Pregnancy Sleep Tips in Telugu : ప్రెగ్నెన్సీ సమయంలో తల్లి, బిడ్డ క్షేమంగా, ఆరోగ్యంగా ఉండాలనుకుంటే నిద్ర సమయంలో కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలంటున్నారు నిపుణులు. అవేంటంటే..

Sleeping Position During Pregnancy : ప్రెగ్నెన్సీ సమయంలో ప్రతి చిన్న విషయం తల్లి శరీరాన్ని మాత్రమే కాకుండా.. గర్భంలోని బిడ్డపై కూడా నేరుగా ప్రభావం చూపే సమయం అంటున్నారు నిపుణులు. కాబట్టి తీసుకునే ఆహారం నుంచి నడక, విశ్రాంతి.. ఇలా అన్నీ చాలా ఆలోచించి చేయాలి. కానీ కొన్నిసార్లు తెలియక, నిర్లక్ష్యంగా చేసే ఓ మిస్టేక్ ఏంటంటే నిద్రించే విధానం. అవును గర్భధారణ సమయంలో కొందరు సరైన భంగిమలో నిద్రపోకపోవడం వల్ల బిడ్డ ఆరోగ్యానికి ప్రమాదకరమంటున్నారు నిపుణులు.
గైనకాలజిస్ట్ డాక్టర్ గౌరీ రాయ్ మాట్లాడుతూ.. "గర్భధారణ సమయంలో సరైన భంగిమలో నిద్రపోకపోవడం వల్ల బిడ్డకు ఆక్సిజన్, పోషకాల లోపం ఏర్పడవచ్చు. అందుకే సరైన సమాచారం, జాగ్రత్తలు తీసుకోవడం చాలా ముఖ్యం. గర్భధారణ సమయంలో నిద్ర అలవాట్లు ఎలా ఉండాలి? ఏ భంగిమలో పడుకోకూడదో ఇప్పుడు తెలుసుకుందాం".
వెల్లకిలా పడుకుంటే..
గర్భధారణ సమయంలో రెండవ, మూడవ త్రైమాసికంలో వెల్లకిలా పడుకోవడం మంచిది కాదని చెప్తున్నారు. ఇది పూర్తిగా నిషేధించారు. ఎందుకంటే ఈ భంగిమలో పడుకుంటే శరీరంలోని ప్రధాన సిరలు, రక్త నాళాలపై ఒత్తిడిని కలిగిస్తాయి. దీనివల్ల పొట్ట ప్రాంతానికి రక్త ప్రసరణ తగ్గుతుంది. ఇది బిడ్డపై ప్రభావం చూపుతుంది. దీనివల్ల ఆక్సిజన్ లోపం ఏర్పడుతుంది.
పొట్ట మీద పడుకోవచ్చా?
ప్రెగ్నెన్సీ ప్రారంభ నెలల్లో.. కొంతమంది మహిళలు పొట్ట మీద పడుకుంటారు. కానీ పొట్ట పెరిగేకొద్దీ ఈ భంగిమ చాలా అసౌకర్యంగా, ప్రమాదకరంగా ఉంటుంది. ఇది పొట్టపై నేరుగా ఒత్తిడిని కలిగిస్తుంది. కాబట్టి బిడ్డ పెరుగుదలకు ఆటంకం కలిగిస్తుంది.
మరి ఎలా పడుకుంటే మంచిది
గర్భధారణ సమయంలో ఎడమ వైపుకు తిరిగి పడుకోవడం అత్యంత సురక్షితమైన, ప్రయోజనకరమైన నిద్ర భంగిమగా చెప్తారు. ఇది గర్భాశయానికి తగినంత రక్తం, పోషకాలను అందించడంలో హెల్ప్ చేస్తుంది. మూత్రపిండాలు కూడా బాగా పనిచేస్తాయి. ఇది తల్లి, బిడ్డ ఇద్దరికీ ప్రయోజనకరంగా ఉంటుంది.
ఈ టిప్స్ ఫాలో అవ్వండి
ఎడమ వైపునకు తిరిగి కంటిన్యూగా పడుకోవడం కష్టంగా ఉంటే.. దిండ్ల సహాయం తీసుకోవచ్చు. కాళ్ల మధ్య, పొట్ట కింద దిండును ఉంచడం ద్వారా నిద్రను మరింత సౌకర్యవంతంగా చేయవచ్చు. మార్కెట్లో ప్రెగ్నెన్సీ సపోర్ట్ పిల్లోలు కూడా అందుబాటులో ఉన్నాయి. ఇవి సరైన భంగిమలో పడుకోవడానికి హెల్ప్ చేస్తాయి.
భంగిమ మార్చుకోవచ్చా?
గర్భిణీ స్త్రీలు రాత్రంతా ఒకే భంగిమలో నిద్రపోవాల్సిన అవసరం లేదు. నిద్రలో భంగిమ మారినా కంగారు పడాల్సిన అవసరం లేదు. అయితే ఎక్కువసేపు ఇతర భంగిమల్లో ఉండడం మంచిది కాదని చెప్తున్నారు. కానీ నిద్రపోయేటప్పుడు ఎడమ వైపుకు తిరిగి పడుకోవడానికి ప్రయత్నిస్తే మంచిదని చెప్తున్నారు గౌరీ రాయ్.






















