Vijay Devarakonda: దిల్ రాజు కాంపౌండ్ లో విజయ్ దేవరకొండ - కలిసొస్తుందా?
నిర్మాత దిల్ రాజు విజయ్ తో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 'అర్జున్ రెడ్డి' తరువాత విజయ్ కి అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాతల్లో దిల్ రాజు కూడా ఒకరు.
టాలీవుడ్ సెన్సేషనల్ హీరో విజయ్ దేవరకొండ ఇటీవల 'లైగర్' సినిమాతో ప్రేక్షకుల ముందుకొచ్చారు. భారీ అంచనాల మధ్య విడుదలైన ఈ సినిమా డిజాస్టర్ గా మిగిలింది. దాదాపు రూ.60 కోట్లకు పైగా నష్టాలొచ్చినట్లు సమాచారం. చాలా థియేటర్లలో ఈ సినిమాను తీసేసి కొత్త సినిమాలను ప్రదర్శిస్తున్నారు. దీంతో విజయ్ సైలెంట్ అయిపోయారు. మీడియాలో ఎక్కడా కనిపించడం లేదు. తన తదుపరి సినిమాలతో ఎలాగైనా హిట్టు కొట్టాలని చూస్తున్నారు.
ఇలాంటి సమయంలో నిర్మాత దిల్ రాజు విజయ్ తో ఓ సినిమా చేయాలని ప్లాన్ చేస్తున్నారు. 'అర్జున్ రెడ్డి' తరువాత విజయ్ కి అడ్వాన్స్ ఇచ్చిన నిర్మాతల్లో దిల్ రాజు కూడా ఒకరు. అప్పటినుంచి ఈ బ్యానర్ లో ఓ సినిమా బాకీ ఉండిపోయారు విజయ్ దేవరకొండ. ఇప్పుడు దిల్ రాజుతో కలిసి పని చేయడానికి గ్రీన్ సిగ్నల్ ఇచ్చేశారు. దీంతో విజయ్ కి మంచి కథను సెట్ చేసే పనిలో పడ్డారు దిల్ రాజు.
తన కాంపౌండ్ లో ఉన్న దర్శకులతో దిల్ రాజు మీటింగ్స్ పెడుతున్నారు. ఎవరి దగ్గర విజయ్ కి సరిపడా కథ ఉంటే.. వాళ్లతో సినిమా చేయడానికి సన్నాహాలు చేస్తున్నారు. ప్రస్తుతం విజయ్ చేతిలో రెండు సినిమాలు ఉన్నాయి. అవే 'ఖుషి', 'జనగణమన'. 'ఖుషి' సినిమా కొత్త షెడ్యూల్ అన్నపూర్ణ స్టూడియోలో మొదలైంది. విజయ్ పై కొన్ని కీలక సన్నివేశాలను తెరకెక్కిస్తున్నారు. వచ్చే వారంలో సమంత ఈ సినిమా సెట్లో అడుగుపెట్టబోతుంది.
కశ్మీర్ నేపథ్యంలో రూపొందుతోన్న ప్రేమకథా చిత్రమిది. ఈ సినిమాను మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యేర్నేని, రవిశంకర్ యలమంచిలి నిర్మిస్తున్నారు. డిసెంబర్ 23న తెలుగు, కన్నడ, తమిళ, మలయాళ భాషల్లో 'ఖుషి' సినిమాను విడుదల చేయనున్నారు. మలయాళ నటుడు జయరామ్, మరాఠీ నటుడు సచిన్ ఖేడేకర్, ఇంకా మురళీ శర్మ, లక్ష్మీ, అలీ, రోహిణి, 'వెన్నెల' కిశోర్, రాహుల్ రామకృష్ణ, శ్రీకాంత్ అయ్యంగార్, శరణ్య ప్రదీప్ తదితరులు ప్రధాన పాత్రల్లో నటిస్తున్న ఈ చిత్రానికి ఫైట్స్: పీటర్ హెయిన్, సంగీత దర్శకుడు : హిషామ్ అబ్దుల్ వాహాబ్, సీఈవో : చెర్రీ, ఛాయాగ్రహణం: జి. మురళి.
'ఖుషి' ఫస్ట్ లుక్:
'ఖుషి' సినిమాలో కశ్మీర్ యువతి పాత్రలో సమంత కనిపించనున్నారని గతంలో వినిపించింది. అయితే ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్ చూస్తే... కశ్మీర్ యువతిగా అనిపించడం లేదు. నుదుట, మెడలో బంగారు ఆభరణాలు, అడ్డంగా పెట్టుకున్న విభూతి, దాని కింద చిన్న కుంకుమ బొట్టు... సమంత లుక్ చూస్తే ఈజీగా ఆమె తమిళ అమ్మాయి ఆహార్యంలో కనిపించారని చెప్పవచ్చు. మరోవైపు విజయ్ దేవరకొండ డ్రస్సింగ్ స్టయిల్ కశ్మీర్ యువకుడిలా ఉంది.
Also Read : ఒకవేళ ఆ సినిమాలు పవన్ కళ్యాణ్ చేస్తే మహేశ్, రవితేజ, సూర్యకు స్టార్‌డమ్ వచ్చేదా?