Pawan Kalyan Birthday : రీమేక్‌లందు పవన్ రీమేక్స్ వేరయా - పవర్ స్టార్‌ది సపరేట్ మేనియా
రీమేక్ సినిమా చేసేటప్పుడు మాతృకలో ఉన్నది ఉన్నట్లుగా తీస్తారు కొందరు! తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేస్తారు కొందరు! పవర్ స్టార్ పవన్ కళ్యాణ్‌తో రీమేక్ చేస్తే కథ, పాత్ర స్వరూపమే మారిపోతుంది.
పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ (Pawan Kalyan) కథానాయకుడిగా నటించిన సినిమాలు ఎన్నో తెలుసా? విడుదలైన చిత్రాలు అయితే 27! అందులో రీమేక్ సినిమాలు ఎన్నో తెలుసా? సుమారు 10! ప్రస్తుతం ఆయన నటిస్తున్న సినిమాల్లో... సాయి తేజ్ హీరోగా సముద్రఖని దర్శకత్వంలో చేయనున్న సినిమా తమిళ హిట్ 'వినోదయ సీతం'కు రీమేక్. పవన్ కళ్యాణ్ కెరీర్‌లో రీమేక్ కథలు ప్రముఖ పాత్ర పోషించాయి.
పవన్ రీమేక్ చేస్తే ఆ మార్పులు కంపల్సరీ
సాధారణంగా రీమేక్ చేసేటప్పుడు హీరోలు, దర్శక - రచయితలు, నిర్మాతలు రెండు సూత్రాలు పాటిస్తారు. ఒకటి... మాతృక (ఒరిజినల్ సినిమా) లో ఉన్నది ఉన్నట్లుగా తీయడం! మాతృకతో పోలిస్తే నటీనటులు వేరు అయినప్పటికీ... సీన్స్ కాపీ, పేస్ట్ చేస్తుంటారు. రెండోది... తెలుగు నేటివిటీకి తగ్గట్టు మార్పులు చేసి తెరకెక్కించడం! రీమేక్స్‌లో మూడో ఫార్ములా కూడా ఉంది. అది పవర్ స్టార్ మేనియా. ఎవరైనా సరే... 'రీమేక్‌లందు పవన్ రీమేక్స్ వేరయా' అనాల్సిందే.
పవన్ కళ్యాణ్ రీమేక్ సినిమా చేశారంటే... అది బ్లాక్ బస్టర్ హిట్టే. 'అన్నవరం' లాంటి ఒకట్రెండు సినిమాలు మినహా పవర్ స్టార్ చేసిన రీమేక్స్ అన్నీ విజయాలు సాధించాయి. పవన్‌తో రీమేక్ అనేసరికి దర్శక, రచయితలు కూడా ఉన్నది ఉన్నట్లు కాకుండా మార్పులు చేర్పులు చేస్తుంటారు. ముఖ్యంగా హీరో క్యారెక్టరైజేషన్ మారిపోతుంది.
దేఖో దేఖో గబ్బర్ సింగ్...
'గబ్బర్ సింగ్' (Pawan Kalyan Gabbar Singh)... పవన్ కళ్యాణ్ కెరీర్‌లో వెరీ వెరీ స్పెషల్ ఫిల్మ్. 'ఖుషి' తర్వాత ఆ స్థాయి విజయం కోసం ఎదురు చూస్తున్న పవర్ స్టార్ ఫ్యాన్స్ ఆకలి తీర్చిన సినిమా. హిందీలో సల్మాన్ ఖాన్ నటించిన 'దబాంగ్'కు రీమేక్ అది. ఆ సినిమా, 'గబ్బర్ సింగ్' చూస్తే... చాలా మార్పులు ఉంటాయి. ఒరిజినల్‌లో హీరో తమ్ముడికి లవ్ ట్రాక్ ఉంటుంది. 'గబ్బర్ సింగ్'లో ఆ ట్రాక్ తీసేశారు. అది పక్కన పెడితే... హీరో క్యారెక్టర్, క్యారెక్టరైజేషన్ పరంగా చాలా మార్పులు కనిపిస్తాయి. పవన్ కళ్యాణ్‌కు దర్శకుడు హరీష్ శంకర్ భక్తుడు కావడంతో అభిమానులు ఏం ఆశిస్తున్నారన్నది ఆయనకు బాగా తెలుసు. వాళ్ళను దృష్టిలో పెట్టుకుని మార్పులు, చేర్పులు చేశారు. నిజం చెప్పాలంటే... 'దబాంగ్'లో సోల్ మాత్రమే తీసుకుని కథను పూర్తిగా మార్చేశారు. హరీష్ శంకర్ కొత్త డైలాగులు రాశారు. కట్ చేస్తే... సినిమా ఇండస్ట్రీ హిట్.
వకీల్ సాబ్... పవర్ మార్క్ రీమేక్‌కు పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్!
అమితాబ్ బచ్చన్ వయసేంటి? పవన్ కళ్యాణ్ వయసేంటి? అమితాబ్ చేసినట్లు పవన్ చేయగలరా? అసలు, 'పింక్' లాంటి సినిమాను పవన్ ఎందుకీ రీమేక్ చేస్తున్నారు? - 'వకీల్ సాబ్' (Vakeel Saab) విడుదల ముందు వరకూ ఎన్నో ప్రశ్నలు వచ్చాయి. ప్రేక్షకుల్లో సందేహాలు నెలకొన్నాయి. సినిమా విడుదలైన తర్వాత ఒక్కసారిగా సీన్ మారింది. 'పింక్' ఫిమేల్ ఓరియెంటెడ్ సినిమా అన్నట్లు ఉంటుంది. 'వకీల్ సాబ్' అలా కాదు... ఇందులో హీరోకి ఫ్లాష్ బ్యాక్ యాడ్ చేశారు. ఫైట్స్ పెట్టారు. కథను ఫుల్ కమర్షియల్ చేశారు. అమితాబ్ బచ్చన్ యాక్టింగ్ సెటిల్డ్‌గా ఉంటే... 'వకీల్ సాబ్'గా పవన్ నటన హైపర్‌గా ఉంటుంది. 'పింక్'ను ఈ విధంగా చేయడం ఏమిటి? అని కొందరి నుంచి విమర్శలు వచ్చాయి. అయితే... పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్‌కు ఆ హీరో క్యారెక్టరైజేష్ విపరీతంగా నచ్చింది. 'పింక్' చూడని ప్రేక్షకులకు పవన్ సినిమా నచ్చింది. బాక్సాఫీస్ దగ్గర వసూళ్ళు బాగా వచ్చాయి. పవన్ సినిమాలో కథ కంటే క్యారెక్టరైజేషన్ బలంగా ఉంటే ప్రేక్షకులు చూస్తారని ఇండస్ట్రీలో ఒక నమ్మకం ఏర్పడింది.
'భీమ్లా నాయక్'లోనూ ఫ్లాష్‌బ్యాక్ యాడ్ అయ్యింది!
మలయాళ హిట్ 'అయ్యపనుమ్ కోషియుమ్'ను తెలుగులో 'భీమ్లా నాయక్' (Bheemla Nayak) గా రీమేక్ చేశారు. మలయాళంలో ఇద్దరు హీరోల కథగా సాగితే... తెలుగులో రానా దగ్గుబాటి క్యారెక్టర్‌కు ఇంపార్టెన్స్ ఇచ్చినప్పటికీ, పవన్ కళ్యాణ్ క్యారెక్టర్ మీద ఎక్కువ ఫోకస్ చేశారు. 'వకీల్ సాబ్' తరహాలో 'భీమ్లా నాయక్' క్యారెక్టర్ కూడా హైపర్ యాక్టివ్‌గా ఉంటుంది. పవన్ రాజకీయ ప్రయాణాన్ని గుర్తు చేసేలా సినిమాలో పంచ్ డైలాగ్స్ ఉంటాయి. అభిమానులకు ఆ అంశాలు నచ్చాయి.
'వకీల్ సాబ్', 'భీమ్లా నాయక్', 'గబ్బర్ సింగ్' సినిమాలకు ముందు పవన్ కళ్యాణ్ రీమేక్స్ చేశారు. వాటిలో ప్రేమ, కుటుంబ అనుబంధాల నేపథ్యంలో సినిమాలు ఉన్నాయి. ఆ సినిమాలను గమనిస్తే... మాతృకతో పోలిస్తే పాటలు, సంభాషణలు , పోరాట దృశ్యాలు కొత్తగా ఉంటాయి. ఆ విషయాల్లో పవన్ ప్రత్యేకత చాటుకున్నారు.
Also Read : 'బాహుబలి 2'లో ఆ సీన్ వెనుక ఉన్నది పవన్ కళ్యాణే
'ఖుషి' రీమేక్ అని చెప్పలేం. పవన్ కళ్యాణ్ (Pawan Kalyan Kushi) కు కథ చెప్పి ఓకే చేయించుకున్న తర్వాత, ఆయన బిజీగా ఉండటంతో... తమిళంలో విజయ్ హీరోగా ఆ కథను తెరకెక్కించారు దర్శకుడు ఎస్.జె. సూర్య. ఆ సినిమా తర్వాతే తెలుగు 'ఖుషి' ప్రేక్షకుల ముందుకు వచ్చింది. రెండూ చూస్తే... తెలుగులో పాటలు సూపర్ హిట్. ఫైట్స్ అయితే చాలా కొత్తగా ఉంటాయ్. పాటలు, ఫైట్స్ విషయంలో పవన్ తనకు నచ్చిన విధంగా చేయించుకున్నారని దర్శకుడు తెలిపారు.
సంగీతం, సాహిత్యం, సంభాషణలు, పోరాట దృశ్యాలు వంటి విషయాల్లో పవన్ కళ్యాణ్‌కు ఉన్న అభిరుచి ప్రేక్షకుల్లో ఆయనకు ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చింది. ఆ ప్రత్యేకత పవన్ స్టార్ మేనియాగా మారింది.
Also Read : పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏం తగ్గలేదు - రీ రిలీజ్‌లకు హౌస్‌ఫుల్ బోర్డ్స్