Kadapa Corporation Meeting: కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో రసాభాస, కూర్చీ వేయలేదని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫైర్
TDP MLA Madhavi Reddy News | కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశంలో మరోసారి అదే సీన్ రిపీట్ అయింది. ఇద్దరు టీడీపీ సభ్యుల కుర్చీలు మేయర్ ఆఫీసులో తొలగించడాన్ని ఎమ్మెల్యే మాధవీరెడ్డి ప్రశ్నించారు.
Kadapa Municipal Corporation Meeting | కడప: ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్ అయ్యే విషయాల్లో కడప మున్సిపల్ కార్పొరేషన్ ఒకటి. ఇటీవల ప్రొటోకాల్ పాటించడం లేదని టీడీపీ ఎమ్మెల్యే మాధవీరెడ్డి (Madhavi Reddy) ప్రశ్నించడంతో మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రసాభాసగా మారింది. సోమవారం సైతం మహిళా ఎమ్మెల్యే మాధవీరెడ్డికి మరోసారి చేదు అనుభవం ఎదురైంది. కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశానికి హాజరైన ఎమ్మెల్యే మాధవీరెడ్డికి వేదికపై కుర్చీ వేయలేదు. ఈ విషయంపై మేయర్‌ను ఆమె గట్టిగా నిలదీయడంతో కార్పొరేషన్ సమావేశం మరోసారి రసాభాసగా మారింది. తనకు కూర్చీ వేసేంతవరకు నిల్చునే ఉంటానంటూ ఎమ్మెల్యే మాధవీరెడ్డి కడప మేయర్ (Kadapa Mayor) పోడియం వద్ద నిరసన తెలిపారు. మహిళల్ని అవమానిస్తే మీ అధినేతకు సంతోషం కలుగుతుందా అని ప్రశ్నించారు.
ప్రొటోకాల్ తెలియదు, మహిళల్ని గౌరవించడం లేదు: మాధవీరెడ్డి మండిపాటు
కడప నగర పాలక సంస్థ సమావేశానికి టీడీపీ ఎమ్మెల్య మాధవీ రెడ్డి హాజరయ్యారు. కానీ ప్రొటోకాల్ ప్రకారం ఆమెకు కూర్చీ వేయకపోవడం ఆగ్రహం వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే, అందులోనూ మహిళను అయినా తనకు కావాలనే కుర్చీ వేయలేదని కడప మేయర్‌ను ఆమె నిలదీశారు. ఈ క్రమంలో కడప మేయర్, టీడీపీ ఎమ్మెల్యే మాధవీ రెడ్డికి మధ్య వాగ్వాదం జరిగింది. ఉద్దేశపూర్వకంగానే తనకు కూర్చీ ఏర్పాటు చేయలేదని, కడప మేయర్ విచక్షణ లేకుండా ప్రవర్తిస్తూ.. మహిళల్ని అవమానిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. తన కుర్చీని కూటమి సభ్యులు లాగేస్తారని మేయర్‌కు పట్టుకుంది. అందుకే తనకు కుర్చీ ఇవ్వకుండా కుర్చీలాడ ఆడుతున్నారని మండిపడ్డారు. ఇలా మహిళల్ని అవమానిస్తే మీ అధినేతకు సంతోషం కలుగుతుందా, ఇకనైనా తీరు మార్చుకోవాలని సూచించారు.
నవంబర్ నెలలో ఇదే సీన్.. కుర్చీ వివాదం
గత నెలలో సైతం కడపలో నగరపాలక సంస్థ సర్వసభ్య సమావేశం సందర్భంగా కుర్చీ వివాదం నెలకొంది. నవంబర్ 7న జరిగిన కార్పొరేషన్ సమావేశానికి ఎమ్మెల్యే మాధవీరెడ్డి హాజరు కాగా, కుర్చీ వేయలేదని ప్రశ్నించారు. మేయర్ ఛాంబర్‌లో ఇద్దరు టీడీపీ ఎమ్మెల్యేలకు కుర్చీలు తీసేశారని, ప్రొటోకాల్ పాటించాలని కూడా మేయర్‌కు తెలియదా అని నిలదీయడంతో వివాదం నెలకొంది. దాంతో సమావేశం వాయిదా పడింది. కడప నగరంలో కుర్చీ వివాదంపై ఫ్లెక్సీలు దర్శనమివ్వడంతో కడప నరపాలక సంస్థ ఆఫీసు వద్ద పోలీసులు 144 సెక్షన్ విధించారు.
సమావేశం మొత్తం నిల్చునే ఉంటాను..
ప్రతిసారి కుర్చీ వేయకుండా తనను అవమానించడంతో టీడీపీ ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఘాటుగా స్పందించారు. తాను కుర్చీల కోసం ఇక్కడికి రాలేదని, నిల్చునే ఓపిక తనకు ఉందన్నారు. సమావేశం పూర్తయ్యేవరకు ఇలాగే ఉంటానంటూ మేయర్ పోడియం పక్కన నిల్చుని నిరసన తెలిపారు. మహిళల్ని గౌరవించే పద్ధతి నేర్చుకోవాలని, ఇంకా దిగజారడం మంచిది కాదు. ప్రజలు ఇచ్చిన కుర్చీని లాగే హక్కు మీకు ఎవరిచ్చారు అని మాధవీ రెడ్డి కడప మేయర్‌ను ప్రశ్నించారు.