Pawan Kalyan Birthday : 'బాహుబలి 2'లో ఆ సీన్ వెనుక ఉన్నది పవన్ కళ్యాణే
'బాహుబలి 2'లో ప్రభాస్ హీరో. అయితే, ఓ సన్నివేశంలో రియల్ హీరో మాత్రం పవన్ కళ్యాణే. ఆయన క్రేజ్ చూసి ఒక సీన్ రాశారు. ఆ విధంగా 'బాహుబలి'కి పవన్ కళ్యాణ్ స్ఫూర్తిగా నిలిచారు.
భారతీయ చలన చిత్ర పరిశ్రమలో వసూళ్ళ పరంగా, విజయం పరంగా 'బాహుబలి 2' (Bahubali 2) చిత్రానికి అగ్ర స్థానం. అందులో ప్రభాస్ కథానాయకుడు. టైటిల్ రోల్‌లో కనిపించారు. స్క్రీన్ మీద రెబల్ స్టార్ ప్రభాస్ హీరో అయితే... ఒకే ఒక్క సన్నివేశంలో మాత్రం స్క్రీన్ వెనుక హీరో మాత్రం పవన్ కళ్యాణ్ (Pawan Kalyan). పబ్లిక్‌లో పవర్ స్టార్ క్రేజ్ చూసి రచయిత విజయేంద్ర ప్రసాద్ ఒక సన్నివేశం రాశారు.
'బాహుబలి 2'కి, పవన్ కళ్యాణ్‌కి సంబంధం ఏంటి?
'బాహుబలి 2' చూడని ప్రేక్షకుడు ఉండడంటే అతిశయోక్తి కాదు. ఆ సినిమాను చాలా మంది థియేటర్లలో చూశారు. థియేటర్లలో మిస్ అయిన వాళ్ళు ఓటీటీలో, టీవీలో చూశారు. అందులో ఇంటర్వెల్ సీన్ ఉంది కదా! ఆ సన్నివేశానికి పవన్ క్రేజ్ ఇన్స్పిరేషన్. అవును... ఇది అక్షరాలా నిజం.
ఒకసారి 'బాహుబలి 2' ఇంటర్వెల్ గుర్తు చేసుకోండి
మాహిష్మతి సామ్రాజ్యానికి శివగామి ముద్దుబిడ్డ అమరేంద్ర బాహుబలి మహారాజు అవుతాడని, పట్టాభిషేకం చేస్తారని ప్రజలు వేయి కళ్లతో ఎదురు చూస్తే... అతని బదులు శివగామి కన్నబిడ్డ భల్లాల దేవుడికి పట్టాభిషేకం జరుగుతుంది. ఆ తర్వాత భల్లాల దేవుడి సర్వ సైన్యాధ్యక్షుడిగా బాహుబలి ప్రమాణం చేస్తారు. అప్పుడు మాహిష్మతిలో ప్రజలు అందరూ 'బాహుబలి.... బాహుబలి... బాహుబలి' అంటూ నినాదాలు చేస్తారు. అతనిపై తమకు ఉన్న ప్రేమను ఆ విధంగా చాటుకుంటారు. ఆ నినాదాల వెనుక ఉన్నది పవన్ కళ్యాణ్ అని విజయేంద్ర ప్రసాద్ ఒక ఇంటర్వ్యూలో తెలిపారు.
పవన్ కళ్యాణ్ వల్లే ఆ ఇంటర్వెల్ సీన్ పుట్టింది
How Pawan Kalyan Inspired Bahubali 2 Interval Scene : మెగాస్టార్ చిరంజీవి కుటుంబానికి చెందిన హీరోలు నటించిన సినిమా వేడుకలు ఏవైనా సరే... పవన్ కళ్యాణ్ నామస్మరణ లేకుండా జరగవు. ఆ వేడుకల్లో వేదికపై మాట్లాడుతున్న హీరోలను పవన్ గురించి చెప్పమని అభిమానులు ఒత్తిడి చేయడం కామన్‌గా జరుగుతోంది. అభిమానుల తీరుతో ఒకట్రెండు సందర్భాల్లో హీరోలు ఇబ్బంది పడ్డారు కూడా! పబ్లిక్ ఫంక్షన్స్‌లో పవన్ కళ్యాణ్ క్రేజ్ చూసి 'బాహుబలి 2'లో ఇంటర్వెల్ సీన్ రాశానని విజయేంద్ర ప్రసాద్ చెప్పారు. పవన్ వల్లే ఆ సీన్ పుట్టిందని అన్నారు. పవర్ స్టార్ క్రేజ్‌కు ఆ సన్నివేశం ఒక నిదర్శనం ఏమో!
హిట్టూ ఫ్లాపులతో సంబంధం లేకుండా పవన్ కళ్యాణ్ క్రేజ్ కంటిన్యూ అవుతోంది. ఆయన సినిమా వస్తే థియేటర్ల దగ్గర పండగ వాతావరణం నెలకొంటుంది. బర్త్ డే సందర్భంగా 'తమ్ముడు', 'జల్సా' స్పెషల్ షోలు వేస్తే... హౌస్ ఫుల్స్ అయ్యాయి. రీ రిలీజ్ సినిమాల్లో రికార్డ్ కలెక్షన్స్ సాధించాయి.
Also Read : పవన్ కళ్యాణ్ క్రేజ్ ఏం తగ్గలేదు - రీ రిలీజ్‌లకు హౌస్‌ఫుల్ బోర్డ్స్
ప్రస్తుతం పవన్ కళ్యాణ్ 'హరి హర వీరమల్లు' సినిమా చేస్తున్నారు. ఈ చిత్రానికి క్రిష్ దర్శకుడు, ఏఎం రత్నం నిర్మాత. ఈ సినిమా కాకుండా మేనల్లుడు సాయి తేజ్‌తో కలిసి సముద్రఖని దర్శకత్వంలో ఒక సినిమా చేయనున్నారు. హరీష్ శంకర్ దర్శకత్వంలో మైత్రీ మూవీ మేకర్స్ పతాకంపై నవీన్ యెర్నేని, రవిశంకర్ నిర్మించే 'భవదీయుడు భగత్ సింగ్' కూడా చేయనున్నారు. మరికొన్ని సినిమాలు చర్చల దశలో ఉన్నాయి.