Trend changing serials: "అలాంటి ఫోన్ కాల్స్ నమ్మొద్దు" సీరియల్స్‌లో సోషల్ అవేర్‌నెస్ మెసేజ్! ఇప్పుడు ఇదే ట్రెండ్!
social awareness in serial ప్రస్తుత సమాజంలో జరుగుతున్న మోసాలను మెయిన్ కంటెంట్‌గా చూపిస్తూ సీరియల్స్ అవగాహన కల్పిస్తున్నాయి.

Social Awareness In Telugu Serial: సీరియల్స్.. రోజంతా ఇంటి పని, వంట పనులు చేస్తూ.. ఇంట్లో చిన్న పిల్లాడి నుండి ముసలి వాళ్ల వరకు అందరికి ఏం కావాలన్నా దగ్గరుండి చూసుకునే మహిళలకు కాస్త ఊరటనిచ్చే ఎంటర్‌టైన్‌మెంట్ సీరియల్స్.. ఇది వరకు సీరియల్స్ అంటేనే మహిళలు.. మహిళలు మాత్రమే పొద్దస్తమానం సీరియల్స్ చూస్తారని ఇంట్లో తిట్టుకునే మగవాళ్లెందరో. కానీ ఇప్పుడు సీరియల్స్ రూట్ మారుస్తున్నాయ్.. యూత్‌ని, మగవాళ్లని చిన్నా పెద్దా అందరినీ ఆకర్షిస్తున్నాయ్.. మంచి మంచి మెసేజ్‌లతో ప్రస్తుతం సమాజంలో జరుగుతున్న ఆన్‌లైన్ మోసాలు తదితర వాటిని కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నాయి. ఇంతలా అందరినీ అట్రాక్ట్ చేసేలా సీరియల్స్‌లో ఏం మారిందో తెలుసా..
అత్తాకోడళ్ల గొడవలే మెయిన్ పాయింట్..
ఇది వరకు ఏ ఛానెల్‌లో సీరియల్ పెట్టినా.. అత్త కోడలిని హింసించడం.. కొడుకు కొడల్ని విడదీయాలని ప్రయత్నించడం.. లేదంటే ఒక అబ్బాయి కోసం ఇద్దరు అమ్మాయిలు కొట్టుకు చావడం.. పెళ్లి అయిన అబ్బాయి కోసం ఓ వైపు భార్య మరోవైపు ప్రియురాలు తన్నుకోవడం రకరకాల కుట్రలు చేయడం, ఆస్తి తగాదాలు ఇదే మెయిన్ పాయింట్‌గా సీరియల్స్ వచ్చేవి. సూపర్ డూపర్ హిట్ అయిన ఎన్నో సీరియల్స్ ఇదే కోవకు చెందినవే. కొన్నేళ్ల పాటు రాజ్యమేలిన మొగలి రేకులు, కార్తీకదీపం, సత్యభామ, ఎన్నెన్నో జన్మల బంధం ఇలా చాలా సీరియల్స్ ఈ కోవకు చెందినవే.
స్టోరీ మారుతోంది..
ప్రస్తుతం సీరియల్స్ ఆ పాత ధోరణిని మార్చుతున్నాయనే చెప్పాలి. సమాజంలో జరుగుతున్న ప్రతీ విషయాన్ని ఏదో ఓ చోట ప్రతిబింబిస్తూనే ఉన్నాయి. ఇప్పుడున్నఈ జనరేషన్‌లో చిన్నా పెద్దా అందరూ పక్కవారు చెప్పే మాట నమ్ముతారో లేదో తెలీదు కానీ వాట్సాప్, ఇన్‌స్టాగ్రామ్, ఫేస్ బుక్ ఇలాంటి సోషల్ మీడియాలో వచ్చే న్యూస్‌లకు బాగా అట్రాక్ట్ అయిపోతున్నారు. వాటి ద్వారా అంతే స్థాయిలో మోసపోతూ ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. సోషల్ మీడియా రాజ్యమేలుతున్న ఈ తరంలో చాలా సీరియల్స్ సోషల్ మెసేజ్‌లు, సోషల్ అవేర్‌నెస్‌లు లీడ్‌గా కంటెంట్ చూపిస్తున్నారు.
సోషల్ అవేర్నెస్ మెయిన్ కంటెంట్..
టెక్నాలజీ వాడకం పెరిగిన కొద్దీ అంతే స్థాయిలో సైబర్ నేరాలు పెరుగుతున్నాయి. చాలా సీరియల్స్‌లో సోషల్ మెసేజ్‌లు, సైబర్ మోసాలను కట్టడి చేసేలా అవేర్‌నెస్‌లు పెంచేలా చదువు రాని వారికి సైతం అర్థమయ్యేలా స్టోరీలోనే విషయాన్ని చాలా చక్కగా చెప్తున్నారు. కామెడీ, లవ్, కుటుంబాల మధ్య బంధాలు వీటినే కాకుండా ఆన్‌లైన్‌లో మోసాలు నుంచి మూఢ నమ్మకాలు వరకు అన్నీ కళ్లకు కట్టినట్లు చూపిస్తున్నారు. వీటి ఫలితంగా స్కూల్ కాలేజ్ పిల్లలతో పాటు చాలా మంది సీరియల్స్‌ని ఫాలో అవుతున్నారు.
ఆ సీరియల్స్ ఫుల్ స్టోరీ ఇదే..
కొన్ని సీరియల్స్ ఇలాంటి అవేర్‌నెస్ కంటెంట్‌ని అప్పుడప్పుడు చూపిస్తే మరికొన్ని సీరియల్స్ మాత్రం సోషల్ అవేర్‌నెస్‌నే మెయిన్ పాయింట్‌గా రన్ అవుతున్నాయి. అప్పట్లో చిన్నారి పెళ్లి కూతురు సీరియల్ ద్వారా చిన్నతనంలో పెళ్లి చేయడం వల్ల ఆడపిల్లల పరిస్థితి ఎలా ఉంటుందో అని చూపించారు. కుంకుమ భాగ్య సీరియల్‌లో భర్త చనిపోయిన మహిళ మళ్లీ కొత్త జీవితం ప్రారంభించడం గురించి కళ్లకు కట్టేలా చూపించారు. ప్రస్తుతం జీ తెలుగులో వస్తున్న నిండు నూరేళ్ల సావాసం, చామంతి ఇలా చాలా సీరియల్స్‌లో ఇప్పటి పరిస్థితులకు తగ్గట్టు సోషల్ అవేర్‌నెస్ కంటెంట్ చాలా అందంగా అర్థమయ్యేలా చెబుతున్నారు. రిషిధార అంటూ ఓ రేంజ్‌లో ఫేమస్ అయిన గుప్పెడంత మనసు సీరియల్‌లో ట్రూ లవ్‌తో పాటు ఎడ్యుకేషన్, ఫ్యామిలీ ఎమోషన్స్‌ని చూపించారు. మా టీవీలో వచ్చే నువ్వుంటే నా జతగా సీరియల్‌లో తాళి గొప్పతనం భార్యభర్తల మధ్య ప్రేమ అన్యోన్యత గురించి చెప్పడమే కాకుండా కుటుంబం కొడుకుల బాధ్యత ఎలా ఉండాలి అని బాగా చూపిస్తున్నారు. ఆన్‌లైన్ పరిచయాల వల్ల మోసపోవడం.. దొంగ బాబాలను నమ్మి మోసపోవడం.. బెట్టింగ్‌లు వల్ల ప్రాణాలు పోగొట్టుకోవడం ఇలా చాలా విషయాల పట్ల అవగాహనను కల్పిస్తున్న సీరియల్స్ చాలానే ఉన్నాయి. మొత్తానికి సీరియల్స్ కూడా సామాజిక బాధ్యత తీసుకొని తమ కంటెంట్ ద్వారా కొంత మందికి అయినా అవగాహన కల్పించాలని గట్టిగానే ప్రయత్నిస్తున్నాయి. అలాంటి సీరియల్స్‌కి ఆధరణ కూడా అంతే స్థాయిలో దొరుకుతుంది.





















