Senior Actor Vijaya: తన పక్కన నటించాలంటే అలా ఉండాలన్నారు - ఎన్టీఆర్, ఏఎన్నార్‌లపై వై విజయ ఆసక్తికర వ్యాఖ్యలు
Senior Actor Vijaya: ప్రముఖ సీనియర్ నటి వై విజయ.. తన సినీ లైఫ్ గురించి ఆసక్తికర విషయాలు వెల్లడించారు.
Actor Y Vijaya About Her Films వై.విజయ.. తెలుగు సినీ పరిశ్రమలో ఓ వెలుగు వెలిగిన అలనాటి నటి. దాదాపు రెండు దశాబ్దాలు తన నటనతో ఇండస్ట్రీని ఓ ఊపు ఊపేసింది. కెరీర్ ప్రారంభంలోనే ఎన్టీఆర్, అక్కినేని నాగేశ్వర్‌రావు, శోభన్ బాబు వంటి అగ్రహీరోల పక్కన నటించింది. ‘ఎఫ్-2’ మూవీ సీరిస్‌లో తన నటనతో నవ్వులు పూయిస్తూ సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు విజయ. తాజాగా ఆమె ఓ ఇంటర్యూలో మాట్లాడుతూ.. పలు ఆసక్తికర విషయాలను పంచుకున్నారు.
అడగకుండానే డబ్బు:
కొన్నాళ్లూ సినిమాలకు దూరమైన వై.విజయ.. మళ్లీ తనకు అవకాశాలు క్యూ కట్టడంపై హర్షం వ్యక్తం చేశారు. సెకండ్ ఇన్నింగ్స్‌లో ఎక్కువ సినిమాలు చేసి.. బాగా డబ్బులు సంపాదించాను అని విజయ చెప్పారు. తాను అడగక ముందే నిర్మాతలు తమకు తామే డబ్బులు పంపేవారని, సినిమాలకు డేట్స్ కూడా వారే అడ్జస్ట్ చేసుకుంటామంటూ తనని ఒప్పించేవారని తెలిపారు.
నా భర్త ప్రోత్సహించేవారు, కానీ..
"నా జీవితంలో అప్ అండ్ డౌన్స్ నేను ఎక్కువ చూడలేదు. పది మంది పిల్లలం అయినా అందరూ చాలా హ్యాపీగా ఉండేవాళ్లం. మాకు ఏదీ తక్కువ చేసేవాళ్లు కాదు. పెళ్లి కాక ముందే నా భర్త నన్ను ప్రోత్సహించేవారు. ఎక్స్‌పోజింగ్ మాత్రం వద్దు అనేశారు. నా దృష్టిలో స్లీవ్ లెస్‌ఏ గ్లామర్ రోల్. బ్రహ్మానందం, నేను అన్నా చెల్లెలు అనుకునేవాళ్లం. సినిమాలు ఎన్ని చేశాం అని లెక్కలేసుకునే వాళ్లం. షూటింగ్ కోసం ఒక నెలలో పన్నెండు సార్లు ఫ్లైట్ ఎక్కి దిగేదాన్ని. ఆ టైంలో నిద్ర కూడా సరిగా ఉండేది కాదు’’ అని అన్నారు.
‘‘ఇక సెకండ్ ఇన్నింగ్స్‌లో ‘పులుసు’ క్యారెక్టర్ నాకు మంచి పేరు తెచ్చింది. ఆ ఒక్క క్యారెక్టర్ వల్ల చాలా సినిమాలు చేశా. ఆ క్యారెక్టర్ వల్ల ఒక్క సంవత్సరంలో ఇళ్లు కట్టించా. భూములు కొన్నా. రోజుకు మూడు షూటింగ్‌లు చేసేదాన్ని. నాకు మైగ్రేన్ ఉండేది. ఒక రోజు వాణీశ్రీతో నాకు పోటా పోటీ డైలాగ్స్ ఆ టైంలో మైగ్రేన్‌తో చాలా ఇబ్బంది పడ్డాను. ఏం కనిపించలేదు. చాలా ఇబ్బంది పడ్డను. ఎవరికీ చెప్పలేదు. కానీ షూటింగ్ పూర్తి చేశా. నాగేశ్వర రావుతో ఓ సారి షూటింగ్ టైంలో కారు రాకపోవడంతో షూటింగ్‌కు లేట్ అయ్యాను. దీంతో డైరెక్టర్ నా మీద సీరియస్ అయ్యారు. అప్పుడు నాగేశ్వర్‌రావు గారు నన్ను విషయం అడిగి తెలుసుకోమని డైరెక్టర్‌కి చెప్పారు. తర్వాత విషయం తెలిసింది. ఇక నాగేశ్వర్ రావు భార్యకి కూడా మైగ్రేన్ ఉందని, నాకు ఆ బాధ తెలుసు అని నాతో మాట్లాడారు" అని పేర్కొన్నారు.
డ్యాన్స్ నేర్చుకోవాలి అనే ఇంట్రస్ట్‌తో మద్రాస్ వచ్చిన వై.విజయ ఆ డ్యాన్స్ కారణంగానే సినిమాల్లో అవకాశం దక్కించుకున్నారు. 15 ఏళ్ల వయసులోనే శ్రీకృష్ణసత్య సినిమాలో అవకాశం సొంతం చేసుకున్నారు. తొలి సినిమా ‘తల్లిదండ్రులు’లో శోభన్ బాబు సరసన హీరోయిన్‌గా నటించారు. తర్వాత జాంబవతిగా ఎన్టీఆర్ సరసన నటించారు. ఇక ఎన్టీఆర్ తనని చూడగానే.. తన పక్కన నటించాలి అంటే కాస్త లావుగా ఉండాలని అన్నారని, ఆ రోజును తాను ఎప్పటికీ మర్చిపోలేను’’ అని విజయ అన్నారు.