Naga Panchami Serial Today May 15th : 'నాగ పంచమి' సీరియల్: శివయ్య దగ్గరకు బయల్దేరిన పంచమి.. సూక్ష్మ గరుడ శక్తితో పంచమి బిడ్డ మీద కరాళి దాడి!
Naga Panchami Serial Today Episode : సీమంతం అయిపోగానే తన ఊరు డ్రాప్ చేయమని పంచమి మోక్ష మీద ఒత్తిడి తేవడంతో ఇవాళ్టి ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది.
Naga Panchami Today Episode : పంచమి, జ్వాల ఇద్దరు కూడా కడుపు పట్టుకొని ఇబ్బందిగా ఫీలవుతారు. ఇక పంచమి కళ్లు నీలి రంగులోకి, జ్వాల కళ్లు పసుపు రంగులోకి మారిపోతాయి. నాగదేవత, నాగేశ్వరి పూజలు చేస్తూ ఉంటారు. కరాళి గరుడ మంత్రం పఠిస్తూ ఉంటుంది.
ఇక పంచమి కడుపు నొప్పి అని ఏడుస్తుంది. ఇక జ్వాల కూడా కడుపునొప్పి అని ఏడుస్తుంది. మోక్ష, వరుణ్‌లు తమ భార్యల దగ్గరకు వెళ్తారు. హాస్పిటల్‌కి తీసుకెళ్తామంటే పంచమి బామ్మ కోరిక మీద సీమంతం జరగాలి అని అంటుంది. దీంతో ముత్తయిదువులు ఇద్దరినీ ఆశీర్వదిస్తారు.
చిత్ర, వైదేహి, మీనాక్షిలు ఇద్దరికి హారతి ఇస్తారు. ఇక నాగదేవత శివుడికి, నాగేశ్వరితో పాటు మిగతా నాగకన్యలు శివలింగానికి పూజ చేస్తారు. ఆ పూజ ఫలితంగా కరాళి మంత్ర శక్తి పోతుంది. పంచమి, జ్వాలలు కూడా నార్మల్ అయిపోతారు. ఇక ఎప్పటిలాగా నవ్వుతూ ఉంటారు. ఇద్దర్ని తమ భర్తలు హాస్పిటల్‌కి తీసుకెళ్తామంటే బాగానే ఉంది హాస్పిటల్‌కి వద్దు అంటారు. ఇక జ్వాల, పంచమిలు ముత్తయిదువులకు వాయినం ఇచ్చి సీమంతం పూర్తి చేస్తారు.
సీమంతం తర్వాత పంచమి బ్యాగ్ సర్దుకొని తనని ఊరికి దిగబెట్టమని మోక్షతో చెప్తుంది. మోక్ష ఇది అస్సలు ఊరి వెళ్లడానికి సమయం కాదని చెప్తాడు. అయినా పంచమి వినదు.
మోక్ష: పంచమి మీ ఊరిలో హాస్పిటల్స్ ఏం ఉండవు. అర్జెంటుగా హాస్పిటల్‌కి వెళ్లాలి అంటే కుదరదు.
పంచమి: నన్ను కాపాడుకోవడానికి ఆ శివయ్య చాలు.
మోక్ష: అది కాదు పంచమి సీమంతంలో నీకు ఏమైందో చూశావు కదా. పంచమి నీకు ఇంట్లో ఉండటం ఇష్టం లేకపోతే హాస్పిటల్‌లో చేర్చుతా. అంతే కానీ ఇంత మూర్ఖత్వం పనికి రాదు. నీ కడుపులో పెరుగుతున్న బిడ్డ నీ ఒక్కదానికే సొంతం కాదు. ఆ బిడ్డను కాపాడుకునే బాధ్యత నాకు ఉంది. నా బాధ అర్థం చేసుకో పంచమి. డెలివరీ అప్పుడు నీకు మెడికల్ అవసరం వస్తుంది. అందుకే నువ్వు ఇక్కడే ఉండాలి.
పంచమి: నేను ఇక్కడే ఉంటే నన్ను నా బిడ్డను ఎవరూ కాపాడలేరు. అవును మోక్షాబాబు అడుగడుగునా సుబ్రహ్మణ్య స్వామి కాపాడగలరు. మీరు పంపించినా పంపించకపోయినా నేను వెళ్లిపోతా మోక్షాబాబు. నాకు నా బిడ్డ ముఖ్యం. నా మాంగల్యాన్ని నిలబెట్టింది. నన్ను భూలోకంలో ఉంచింది. అంతా ఆ సుబ్రహ్మణ్య స్వామి. ఇప్పుడు నా బిడ్డను కూడా ఆ స్వామికే అప్పగించాలి. లేదంటే నా బిడ్డను మనం కాపాడుకోలేం.
మోక్ష: పంచమి మన బిడ్డ ఎక్కడికి వెళ్లిపోతుంది. పంచమి నువ్వు ఎలాంటి భయాలు పెట్టుకోకు.
పంచమి: ఎంత మంది డాక్టర్లు ఉన్నా నా బిడ్డను కాపాడేది ఆ స్వామి ఒక్కరే. నేను బయల్దేరుతున్నాను మోక్షాబాబు.
మోక్ష, పంచమి బ్యాగ్ తీసుకొని కిందకి వస్తారు. ఇంట్లో అందరూ ఆశ్చర్యంగా చూస్తారు. కరాళి అదంతా తన మంత్ర శక్తితో చూస్తుంది. పంచమి తన ఊరు వెళ్తున్నా అని ఇంట్లో వాళ్లకి చెప్తుంది. నేను ఎంత చెప్పినా వినడం లేదని మోక్ష చెప్తాడు.
పంచమి: మీరంతా మీ వారసుడి కోసం ఎంత గానో ఎదురు చూస్తున్నారు. ఆ బిడ్డను నేను మీ చేతుల్లోకి క్షేమంగా ఇవ్వాలి అంటే నాకు, నా బిడ్డకు నేను నమ్ముకున్న నీడ అవసరం. నేనేమీ అలిగి వెళ్లిపోవడం లేదు. నా కాన్పు అప్పుడు నేను నమ్మిన దేవుడి దగ్గర ఉండాలి అనుకుంటున్నా.
శబరి: ఇంకేం చెప్పక్కర్లేదమ్మా. నువ్వు పుట్టిన ఆ శివయ్య కాలి దగ్గరే నువ్వు నీ బిడ్డని కూడా ఆ స్వామి సన్నిదిలోనే జన్మనివ్వాలి అనుకుంటున్నావు. నిన్నూ నీ బిడ్డను ఆ శివయ్యే కాపాడుకుంటారు. వెళ్లమ్మా.. ఇంకేం ఆలోచించకమ్మా మనవడా తీసుకెళ్లు. అందరూ పంచమికి జాగ్రత్తలు చెప్తారు.
కరాళి: సీమంతం జరిపించుకొని బిడ్డతో తిరిగొస్తాను అన్న నమ్మకంతో వెళ్తుంది. పంచమి తిరిగి వచ్చినా బిడ్డ మాత్రం తిరిగి రాకూడదు. బిడ్డ లోకం చూడకుముందే ఊపిరి ఆగిపోవాలి ఇదే నాకు చివరి అవకాశం. అంటూ గరుడరాజుని ధ్యానిస్తుంది. గురుడ రాజు ప్రత్యక్షం అవ్వడంతో చివరి అవకాశం ఇవ్వమని అంటుంది. గరుడరాజు సరే అంటాడు. సూక్ష్మ రూపంలో గరుడ శక్తిని తనకి ప్రసాదించమని అడుగుతుంది. ఈ రోజు నేనో పంచమినో తేల్చుకోవాలి అనుకుంటుంది.
దీంతో గరుడ శక్తి ప్రసాదిస్తాడు. అయితే దైవ శక్తి తప్ప మరే శక్తిని అయినా ఎదుర్కొగలవని అంటారు. పంచమి మోక్ష కారులో అడవి గుండా ప్రయాణిస్తారు. కరాళి కూడా వెళ్తుంది. పంచమికి కడుపులో నొప్పి మొదలవుతుంది. నొప్పితో విలవిల్లాడిపోతుంది. మోక్ష ధైర్యం చెప్తాడు. దగ్గరకు వచ్చేశామని అంటాడు. మధ్యలో కారుకు అడ్డంగా చెట్టు పడిపోతుంది. దీంతో ఇవాళ్టి ఎపిసోడ్ పూర్తవుతుంది.