Trisha: బాలయ్యతో సినిమా - రూ.కోటి డిమాండ్ చేస్తోన్న త్రిష?
హీరోయిన్ త్రిషకు టాలీవుడ్ లో అవకాశాలు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు మన దర్శకనిర్మాతలు.
నట సింహం నందమూరి బాలకృష్ణ (Nandamuri Balakrishna) ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ సినిమా చేస్తున్నారు. షూటింగ్ దశలో ఉన్న ఈ సినిమా త్వరలోనే ప్రేక్షకుల ముందుకు రానుంది. ఇదిలా ఉండగా.. రీసెంట్ గా బాలయ్య మరో సినిమా ఓకే చేశారు. అనిల్ రావిపూడి దర్శకత్వంలో షైన్ స్క్రీన్స్ పతాకంపై సినిమా రూపొందుతోంది. దీనికి హరీష్ పెద్ది, సాహూ గారపాటి నిర్మాతలు.
హీరోగా బాలకృష్ణకు 108వ సినిమా ఇది (NBK 108 Movie). ఈ సినిమాను భారీ బడ్జెట్ తో నిర్మించడానికి సిద్ధమవుతున్నారు. దాదాపు రూ.80 కోట్ల బడ్జెట్ తో ఈ సినిమాను నిర్మించబోతున్నారు. దర్శకుడు అనిల్ రావిపూడి కెరీర్ లో ఇంత బడ్జెట్ తో సినిమా తీయడం ఇదే మొదటిసారి. ఈ సినిమాలో హీరోయిన్ గా త్రిషను తీసుకోవాలనుకుంటున్నారు. కొన్నాళ్లపాటు టాలీవుడ్ ని ఏలిన త్రిష.. ఇక్కడ అవకాశాలు తగ్గడంతో కోలీవుడ్ కి వెళ్లిపోయింది.
అక్కడ లేడీ ఓరియెంటెడ్ సినిమాలు చేస్తూ బిజీ అయింది. అలానే కొన్ని క్లాసిక్ సినిమాలు కూడా చేసింది. రీసెంట్ గా 'పొన్నియిన్ సెల్వన్' సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఈ సినిమా ప్రమోషన్స్ సమయంలో త్రిష చాలా అందంగా కనిపించింది. భారీ క్యాస్టింగ్ ఉన్నా.. అందరి దృష్టి త్రిషపైనే పడింది. ఇప్పుడు ఈ బ్యూటీకి టాలీవుడ్ లో అవకాశాలు ఇవ్వడానికి రెడీ అవుతున్నారు మన దర్శకనిర్మాతలు.
ఈ క్రమంలో బాలయ్య-అనిల్ రావిపూడి సినిమాలో ఆమె హీరోయిన్ గా అనుకుంటున్నారు. ఈ సినిమా చేయడానికి ఆమె రూ.కోటి రూపాయలు డిమాండ్ చేస్తోందని వార్తలొస్తున్నాయి. కానీ ఇందులో ఎంతవరకు నిజముందో తెలియాల్సివుంది. అనిల్ రావిపూడి.. త్రిషను హీరోయిన్ గా కన్సిడర్ చేస్తున్న మాట నిజమే కానీ రెమ్యునరేషన్ విషయంలో మాత్రం క్లారిటీ లేదు. దాదాపు రూ.80 కోట్ల బడ్జెట్ తో సినిమా తీయడానికి రెడీ అయ్యారు కాబట్టి త్రిషకి కోటి ఇవ్వడానికి వెనుకడుగు వేసే ఛాన్స్ లేదు. మరేం జరుగుతుందో చూడాలి.
ఈ సినిమా కథ ప్రకారం.. బాలయ్యకి కూతురు కూడా ఉంటుందట. ఆ పాత్రలో హీరోయిన్ శ్రీలీల కనిపించబోతుంది. తెలుగమ్మాయి, మరో హీరోయిన్ అంజలి కూడా ఈ సినిమాలో ఉన్నారు. ఆమెది విలన్ రోల్ అని టాక్.
బాలయ్యతో ప్రయోగం:
ఈ సినిమా గురించి గతంలో దర్శకుడు అనిల్ రావిపూడి కొన్ని విషయాలను వెల్లడించారు. ఇప్పటివరకు బాలయ్యను ఎవరూ ఈ కోణంలో చూపించలేదని.. తన మనసులో బాలయ్యను ఓ కొత్త కోణంలో చూస్తున్నానని.. కొత్తగా ప్రయత్నం చేస్తున్నానని చెప్పుకొచ్చారు అనిల్ రావిపూడి. సినిమా విడుదలైన తరువాత బాలయ్యను ఇలా కూడా చూపించొచ్చా అనేలా ఉంటుందని తెలిపారు. అలానే బాలయ్య స్టైల్, మాస్ లుక్, డైలాగ్స్ అన్నీ ఉంటాయని.. వీటితో పాటు తను అనుకుంటున్న కోణం కూడా ఉంటుందని చెప్పారు. ఈ సినిమా కోసం అనిల్ రావిపూడి తన బ్రాండ్ ను పక్కన పెడుతున్నట్లు తెలుస్తోంది. సినిమాలో తన మార్క్ కామెడీ ఉండదని స్పష్టం చేశారు. పూర్తిగా తన ఇమేజ్ ను పక్కనపెట్టి, బాలయ్యతో ప్రయోగం చేస్తున్నానని తెలిపారు అనిల్ రావిపూడి.
Also read: ఇనయా - సూర్యల మధ్య ఏం జరుగుతోంది? ప్రశ్నించిన నాగార్జున, ఇనయాకు క్లాస్?