Nagarjuna Birthday: 'వాసివాడి తస్సాదియ్యా' - మన్మథుడిలో మాస్ ఉంది, కింగ్ లాంటి క్లాస్ ఉంది!
కింగ్ నాగార్జున ఈరోజు పుట్టినరోజు వేడుకలు జరుపుకుంటున్నారు.
సినిమా ఇండస్ట్రీలో ఉన్న హీరోలు ఒక్కో జోనర్ లో బాగా ఎలివేట్ అవుతుంటారు. కొందరికి లవ్ స్టోరీస్ బాగా సూట్ అవుతాయి.. మరికొందరికి మాస్ మసాలా సినిమాలు కలిసొస్తుంటాయి. వాటిని బట్టే మన హీరోలకు ట్యాగ్స్ కూడా ఇస్తుంటారు ఆడియన్స్. అయితే అక్కినేని నాగార్జున(Akkineni Nagarjuna) విషయంలో మాత్రం ఆయన ఇలాంటి సినిమాలు మాత్రమే చేయగలరనే ఇన్హిబిషన్స్ లేవు. 'గీతాంజలి' లాంటి క్లాస్ ఫిల్మ్ తోనే కాకుండా 'హలో బ్రదర్' లాంటి ఊర మాస్ ఫిలింతో కూడా మెప్పించారాయన.
అంతేకాదు.. ఆయన లిస్ట్ లో ఎన్నో క్లాసిక్ ఫిలిమ్స్ కూడా ఉన్నాయి. 'అన్నమయ్య', 'శ్రీరామదాసు', 'షిరిడి సాయి' లాంటి సినిమాల్లో నాగార్జున పెర్ఫార్మన్స్ కి అభిమానులు ఫిదా అయిపోయారు. ఈ సినిమాలను రిపీట్ మోడ్ లో చూడడానికి థియేటర్ల ముందు క్యూ కట్టేవారు. కేవలం ఒక్క జోనర్ కి మాత్రమే పరిమితం కాకుండా అన్ని జోనర్లలో సినిమాలు చేయడానికి నాగార్జున ఎప్పుడూ ముందుండేవారు.
డివోషనల్, క్లాస్, మాస్, యాక్షన్, ఫాంటసీ, థ్రిల్లర్ ఇలా చెప్పుకుంటే పోతే నాగ్ టచ్ చేయని జోనర్ ఉండదు. కలెక్షన్స్, రికార్డ్స్ అని కాకుండా వైవిధ్యమైన సినిమాలు చేయడానికి ఆయన ఆసక్తి చూపిస్తుంటారు. ఒకానొక దశలో టాలీవుడ్ ఫోర్ పిల్లర్స్ లో ఆయనొకరిగా ఉండేవారు. అరవై ఏళ్లు దాటి మూడేళ్లు అవుతున్నా.. ముప్పై ఏళ్ల నవమన్మథుడిలా కనిపించడం నాగ్ స్పెషాలిటీ.
'విక్రమ్' సినిమాతో హీరోగా పరిచయమైన నాగార్జున 'మజ్ను', 'గీతాంజలి' వంటి సినిమాలతో లవర్ బాయ్ ఇమేజ్ సంపాదించుకున్నారు. ఆ తరువాత ఆర్జీవీ డైరెక్ట్ చేసిన 'శివ' సినిమాతో టాలీవుడ్ లో సెన్సేషన్ క్రియేట్ చేశారు. అప్పట్లో ఆ సినిమా ఒక ట్రెండు ను క్రియేట్ చేసింది. ఆ తరువాత నాగ్ కెరీర్ వరుస హిట్స్ తో దూసుకుపోయింది. ప్రయోగాలు చేయడానికి ఎప్పుడూ ముందుంటారు నాగార్జున. అలానే కొత్త దర్శకులను ప్రోత్సహిస్తుంటారు. ఇప్పటివరకు నలభైకి పైగా దర్శకులను టాలీవుడ్ కి పరిచయం చేశారాయన.
నాగార్జున వారసులు:
నాగార్జున ఇద్దరు కుమారులు అక్కినేని నాగచైతన్య, అఖిల్ హీరోలుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టారు. తండ్రి బాటలో నడుస్తూ స్టార్ హీరోలుగా గుర్తింపు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నారు. అయితే ఈ ఏజ్ లో కూడా వారితో పోటీ పడుతూ సినిమాలు చేస్తున్నారు నాగార్జున. త్వరలోనే ఆయన 'ది ఘోస్ట్'(The Ghost), 'బ్రహ్మాస్త్ర'(Brahmastra) సినిమాలతో ప్రేక్షకులను అలరించబోతున్నారు.
బుల్లితెరపై నాగ్ హడావిడి:
వెండితెరకు మాత్రమే పరిమితం కాకుండా.. బుల్లితెరపై కూడా సత్తా చాటారు నాగార్జున. 'మీలో ఎవరు కోటీశ్వరుడు' షోకి హోస్ట్ గా వ్యవహరించారాయన. ఆ తరువాత నాగ్ బాటలో చాలా మంది హీరోలు హోస్ట్ లుగా మారారు. ప్రస్తుతం నాగార్జున 'బిగ్ బాస్' షోని సక్సెస్ ఫుల్ గా నడిపిస్తున్నారు. టీవీ, ఓటీటీ రెండు వెర్షన్స్ కి కూడా నాగార్జున హోస్ట్ గా పని చేస్తున్నారు. త్వరలోనే బిగ్ బాస్ సీజన్ 6లో కనిపించనున్నారు నాగార్జున. ఫ్యూచర్ లో కూడా ఆయన మరిన్ని సీజన్స్ ని హోస్ట్ చేయాలని, ఎన్నో సినిమాల్లో నటించాలని కోరుకుంటూ.. కింగ్ నాగార్జునకు పుట్టినరోజు(ఆగస్టు 29) శుభాకాంక్షలు!
Also Read : ‘ఆంటీ’ ట్రోల్స్‌పై అనసూయ ఆగ్రహం, రౌడీ బాయ్ అభిమానులకు స్ట్రాంగ్ వార్నింగ్
Also Read : విజయ్ దేవరకొండ కాదు, అనకొండ - రౌడీ బాయ్ ప్రవర్తనపై ముంబై థియేటర్ ఓనర్ ఫైర్