News
News
abp shortsABP షార్ట్స్వీడియోలు ఆటలు
X
ఎన్నికల ఫలితాలు 2023

Sirivennela: 'సిరివెన్నెల' సాహిత్యాన్ని విశ్లేషించడమా!? వినడమా!? ఏం చేద్దాం??

'సిరివెన్నెల' సీతారామశాస్త్రి పలుకు వెళ్లిపోయింది. కానీ, ఆయన పాట మనతోనే ఉంది. తెలుగు భాష ఉన్నంత కాలం సాహిత్య‌పు సిరి'వెన్నెల' కురిపిస్తూ ఉంటుంది. అసలు, ఆయన పాట విశ్లేషించే స్థాయి ఎవరికి ఉంది?

FOLLOW US: 
Share:

'కవిత్వం కానిది నేను రాయలేను'
- ఓసారి సిరివెన్నెల చెప్పిన మాట!
ఆయన రాసింది కవిత్వమా? కాదా?
విశ్లేషించగల స్థాయి ఎంతమందికి ఉంది!?
అసలు, విశ్లేషిస్తున్నది ఎంతమంది? వింటున్నది ఎంతమంది?
ఇటువంటి సందేహాలు ఎప్పుడూ 'సిరివెన్నెల' సీతారామశాస్త్రికి రాలేదు.
ప్రేక్షకుల స్థాయిని ఆయనెప్పుడూ తక్కువ చేయలేదు. పాట కోరిన భావంలో రాశారు. అదీ ఆయన గొప్పదనం.
'సిరివెన్నెల' రాసిన భావాన్ని అర్థం చేసుకోవడానికి ప్రేక్షకులు ప్రయత్నించారు. ప్రేక్షకులు ప్రయత్నించేలా చేశారు. అదే ఆయన ప్రత్యేకత.  

'సిరివెన్నెల' ఎటువంటి పాటలు రాశారు?
ఒక్క ముక్కలో సమాధానం చెప్పడం కష్టం. 
అది అసాధ్యం కూడానూ!

'సిరివెన్నెల'లో...
ప్రేమికుడు ఉన్నారు...
భాషా ప్రేమికుడూ ఉన్నారు.
శ్రామికుడు ఉన్నారు...
మంచి సినిమాకు పాటుపడే శ్రామికుడూ ఉన్నారు.
ప్రజల్ని చైతన్యం చేసే విప్లవకారుడు ఉన్నారు...
విషాదంలో ఉన్నప్పుడు తోడుండే స్నేహితుడు ఉన్నారు.
మనలో నిరాశ, నిస్పృహలను పారద్రోలే స్ఫూర్తి ప్రధాత ఉన్నారు.
అన్నిటికంటే ముఖ్యంగా గొప్ప ఆశావాది ఉన్నారు.

'సిరివెన్నెల'లో లేనిదెవ్వరు?
అందరూ ఉన్నారు.
'సిరివెన్నెల' రాసిన పాటల్లో లేనిదేమిటి?
అన్నీ ఉన్నాయి. నవరసాలు ఉన్నాయి.
మనకు కావాల్సిన పాటను, మనసు కోరిన సమయంలో వింటుంటామంతే!

సీతారామశాస్త్రి ఇంటిపేరు 'సిరివెన్నెల' కాకముందు... ఆయన చిత్ర పరిశ్రమలోకి ప్రవేశించక ముందు... తెలుగు సినిమా సాహిత్యం స్థాయి దిగజారుతోందనే విమర్శలు ఉన్నాయి. అప్పటికి చిత్రసీమలో దిగ్గజ గేయ రచయితలు లేరని కాదు, ఉన్నారు. కానీ, వారూ కమర్షియల్ సినిమాలకు అనుగుణంగా పాటలు రాయడం మొదలు పెట్టారు. అవకాశం వచ్చినప్పుడు తమ ప్రతిభ చూపించేవారు. అటువంటి తరుణంలో పరిశ్రమలోకి వచ్చిన సీతారామశాస్త్రి 'ట్రెండ్‌కు అనుగుణంగా పాట‌లు రాస్తే చాలు. సినిమాలకు ఈ పాటలే చాలు, శ్రోతలకు ఈ పదాలే చాలు' అని అనుకోలేదు. పాట కోరిన భావంలో పదాలు రాశారు. భావానికి తగిన సాహిత్యం అందించారు.
Also Read: 'సిరివెన్నెల' సీతారామ శాస్త్రి ఇక లేరు.. సాహిత్యానికి ముందు సాధారణ వ్యక్తిగా..
దర్శకులు త్రివిక్రమ్ శ్రీనివాస్ చెప్పినట్టు... పాటను అర్థం చేసుకోవాలనే కోరిక ప్రేక్షకుల్లో పుట్టేలా 'సిరివెన్నెల' పాటలు రాశారు సీతారామశాస్త్రి. పాటలో పదాలు, ఆ పదాల యొక్క భావం అర్థం చేసుకోవాలని అనుకున్న త్రివిక్రమ్ లాంటి వాళ్లు డిక్షనరీలు కొన్నారు. లైబ్రరీలకు వెళ్లారు. అర్థమైన వాళ్లు అభినందించారు. అర్థం కాకున్నా... ఆ సాహిత్య ధ్వనిలో మాధుర్యాన్ని వింటూ ఆస్వాదించిన ప్రేక్షకులూ ఉన్నారు. అయితే... 'సిరివెన్నెల' పాటలను మాత్రం విస్మరించలేదు. వినడం మానలేదు.  ఎందుకంటే... 'సిరివెన్నెల'లో నిజాయతీ ఉంది. బహుశా... అదే ప్ర‌జ‌ల‌కు అంత‌ర్లీనంగా చేరువై ఉంటుంది. న‌చ్చింది. ఆయన పాటకు పట్టం కట్టింది. తొలి సినిమా పేరును ఇంటిపేరు చేసింది.

'సిరివెన్నెల' తర్వాత అటువంటి పాటలే రాస్తానని సీతారామశాస్త్రి కూర్చోలేదు. ఆ సినిమా ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఏడాదే విడుదలైన 'లేడీస్ టైలర్' సినిమాలో 'గోపీ లోల...', 'పొరపాటిది... తడబాటిది', 'ఎక్కడ ఎక్కడ' పాటలూ రాశారు. ఆ పాటల్లో ఎక్కడా ప్రేక్షకులకు అర్థం కాని పదాలు లేవు. అలాగని, అశ్లీలమూ లేదు. ఒకవేళ సీతారామశాస్త్రి రాయాలని అనుకుంటే... హీరో అమ్మాయి దేహంపై పుట్టుమచ్చ వెతికే క్రమంలో అశ్లీల సాహిత్యాన్నీ రాయవచ్చు. కానీ, ఆయన రాయలేదు. 'సిరివెన్నెల' సాహిత్యంలో శృంగారం ఉంది. కానీ, అమ్మాయిలను నఖశిఖ పర్యంతం వర్ణించే ధోరణి ఎప్పుడూ లేదు. ఉదాహరణకు... ఈ మధ్య వచ్చిన 'అల... వైకుంఠపురములో' సినిమాలో 'సామజ వర గమనా...' పాటను తీసుకోండి. హీరోయిన్ కాళ్లవైపే హీరో చూస్తున్న సందర్భంలో వచ్చే పాట. ఆ సాహిత్యంలోనూ స్త్రీ మీద గౌరవమే కనిపించింది. భాషను ప్రేమించారు కాబట్టే, మ‌హిళ‌కు గౌర‌వం ఇచ్చారు కాబ‌ట్టే అంత గొప్ప సాహిత్యం వచ్చింది.
Also Read: సిరివెన్నెలను చేరి పులకరించిన పురస్కారాలు...
'సిరివెన్నెల' మొదలుకుని... కె. విశ్వనాథ్ దర్శకత్వంలో వచ్చిన సంగీత, సాహిత్య ప్రధానమైన సినిమాల్లో పాటలు రాస్తూనే, మరోవైపు కమర్షియల్ సినిమాల్లో గీతాలకు సాహిత్యమూ అందించారు సీతారామశాస్త్రి. కెరీర్ ప్రారంభించిన దగ్గర్నుంచి ఐదేళ్ల పాటు ఏడాదికి పది సినిమాలకు తగ్గకుండా ఆయన పని చేశారు. ఒకటో... రెండో... ఆయన రాసిన పాటలున్న సినిమాలు కనీసం ఏడాదికి పది విడుదలయ్యేవి. ఆ తర్వాత ఎప్పుడైనా క్వాంటిటీ తగ్గినా... క్వాలిటీ తగ్గలేదు.

గేయ రచయితగా పేరొచ్చింది, తన సాహిత్యానికి ప్రశంస వచ్చింది, తనకు డబ్బు వచ్చింది - అని సౌకర్యవంతమైన జీవితం కోసం సీతారామశాస్త్రి చూసుకోలేదు. తన సమాజం కోసం ఏదో చేయాలని పరితపించారు. తనకు తెల్సిన విద్య ద్వారానే సమాజ ఉన్నతికి ప్రయత్నించారు. 'నిగ్గదీసి అడుగు ఈ సిగ్గులేని సమాజాన్ని...' అని నేరుగా ప్రశ్నించారు. నిజానికి, ఆయన 'గాయం' కోసం ఆ పాట రాయలేదు. సమాజంలో పరిస్థితులు చూసి చలించి... ఓ పాట రాసి పెట్టుకున్నారు. అది దర్శకులు రామ్ గోపాల్ వర్మ కంట పడింది. ఆ పాట కోసం సినిమా తీశారు. సీతారామశాస్త్రిలో విప్లవకారుడు అక్కడితో ఆగిపోలేదు.
'అర్ధ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్య్ర మందామా?
ఆత్మ వినాశపు అరాచకాన్ని స్వరాజ్యమందామా?' 
అని 'సింధూరం'లో మరోసారి నిద్రలేచారు.
'ఇందిరమ్మ ఇంటిపేరు కాదురా గాంధీ' 
అంటూ 'మహాత్మ'లో మరోసారి కలం విదిల్చారు.
అవకాశం వచ్చిన ప్రతిసారీ మొట్టికాయలు వేసే ప్రయత్నం చేశారు.వాస్తవాలు తెలుసుకోమంటూ... ప్రజల్ని నడిపించే ప్రయత్నం చేశారు. 

'సిరివెన్నెల' సీతారామశాస్త్రి అంటే సంగీత ప్రధానమైన పాటలు, లేదంటే విప్లవ భావాలతో కూడిన గేయాలే కాదు. ఆయనలో భాషా ప్రేమికుడు ఉన్నట్టే... అమ్మాయిపై ఇష్టంతో అబ్బాయి, అబ్బాయిపై ఇష్టంతో అమ్మాయి పాడుకునే ప్రేమ పాటలు రాసే సాహిత్యకారుడూ ఉన్నారు. ఆయన 'ప్రేమించుకోవడం అంటే ఏంటో అర్థం కాదు' అంటూనే ఎన్నో ప్రేమ పాటలు రాశారు. ఆ పాటల్లో చక్కటి కథలు చెప్పడానికి ప్రయత్నించారు. 

ఉదాహరణకు... 'ఎవడు' సినిమాలో 'నీ జతగా నేనుండాలి' పాట తీసుకోండి.
'కల్లోకోస్తావనుకున్నా... తెల్లార్లూ చూస్తూ కూర్చున్నా... రాలేదే? జాడైనా లేదే?' అని అమ్మాయి ప్రశ్నిస్తే
'రెప్పల బయటే నేనున్నా... నువ్ మూస్తే వద్దామనుకున్నా' అని అబ్బాయి జవాబిస్తాడు.
ప్రేమలో పడి నిద్రాహారాలు మాని ప్రేయసి/ప్రియుడు కోసం ఆలోచించే వాళ్ల పరిస్థితికి అద్దం పట్టిందీ పాట.
ప్రేమలో పడిన యువతీయువకులకు ఎన్ని భావాలు ఉంటాయో... ప్రేమలో ఎన్ని రకాల సందర్భాలు ఎదురవుతాయో... అవన్నీ తన  పాటల్లో 'సిరివెన్నెల' ఆవిష్కరించారంటే ఎంత మాత్రమూ అతిశయోక్తి కాదు. 

'అజ్ఞాతవాసి'లో 'గాలి వాలుగా ఓ గులాబీ జారి...' కూడా ఆయన రాసినదే. 'ప్రేమకథ'లో అన్ని పాటలూ రాసింది ఆయనే. 'పెళ్లి సందడి'లో 'హృదయమనే కోవెల తలుపులు తెరిచే తాళం ప్రేమ' అన్నారు. 'మాస్టర్'లో 'అరే తమ్ముడూ తికమక తెగులే ప్రేమంటే! ఈ తెలియని దిగులే ప్రేమంటే' అని వర్ణించారు.  ఓ అమ్మాయి, అబ్బాయి మధ్య స్నేహం ప్రేమగా మారే క్రమాన్ని 'ఏం జరుగుతోంది? ఏం జరుగుతోంది?' అంటూ 'మహాత్మ'లో రాశారు. అబ్బాయి ప్రేమలో పడిన తర్వాత 'ఎక్కడ ఉన్నా పక్కన నువ్వే (అమ్మాయి) ఉన్నట్టుంటుంది' అంటూ 'నువ్వే కావాలి'లో చెప్పారు. దాని పేరు ప్రేమా? అని అమాయకంగా అడిగారు. 'కృష్ణం వందే జగద్గురుమ్'లో ప్రేమలో పడిన మనుసును పసి మనసుగా వర్ణించారు. 'అరెరే పసి మనసా...' పాటే అందుకు సాక్ష్యం. ప్రేమ పాటలతో పాటు 'శ్రీ ఆంజనేయం' సినిమాలో 'పూల ఘుమ ఘుమ' వంటి శృంగార గీతాలు కూడా ఆయన రాశారు. అదే సినిమాలో 'రామ రామ' వంటి భక్తి గీతం రాశారు.

ప్రేమ పాటలే కాదు... బ్రేకప్ పాటలూ సిరివెన్నెల రాశారు. ప్రేయసికి దూరమైన ప్రేమికుడి అంతరంగాన్నీ ఆవిష్కరించారు. 'బొమ్మరిల్లు'లో 'నమ్మక తప్పని నిజమైనా...', 'ఫిదా'లో 'ఏదో జరుగుతోంది...' అయినా ఆయన కలం నుంచి వచ్చినవే. 'పరుగు'లో ల‌వ‌ర్‌ దూరమైన బాధను 'హృదయం పోల్చుకోలేనిదీ గాయం' అన్నారు. 

ఇక, సీతారామశాస్త్రి రాసిన పెళ్లి పాట వినిపించని తెలుగు లోగిలి ఉండదేమో! 'మురారి'లో 'అలనాటి రామచంద్రుడు...' పాట ఆయన కలం నుంచి వచ్చినదే. ఇంకా కొన్ని పెళ్లి పాట‌లు రాశారు. అటువంటి పాటలు రాసిన సిరివెన్నెలే... 'సోలో బతుకే సో బెటర్' అన్నారు. ప్రేమ వద్దని చెప్పారు. ప్రేమ ఒక ముళ్లదారి అన్నారు. ఆయన కలం నుంచి వచ్చిన వైవిధ్యానికి ఎవరైనా సలామ్ అనాల్సిందే.
Also Read: సిరివెన్నెలకు గూగుల్ నివాళి.. Ok Google, Play Sirivennela Songs
'సిరివెన్నెల' ఈతరానికి తగ్గట్టు పాటలు రాయగలరా? అన్న ప్రశ్నకు 'కిక్', 'నా పేరు సూర్య నా ఇల్లు ఇండియా', 'సన్నాఫ్ సత్యమూర్తి'... చెప్పుకుంటూ వెళితే పలు సినిమాల్లో పాటలు సమాధానం చెప్పారు. తెలుగులో మాత్రమే కాదు, అక్కడక్కడా ఆంగ్ల పదాలతో ఈతరానికి తగ్గట్టూ పాటలు రాశారు. 'కిక్' సినిమాలో 'గోరె గో గో రే...', 'సన్నాఫ్ సత్యమూర్తి'లో 'కమ్ టు ద పార్టీ' పాటలు ఆయన రాసినవే. ఇంకా  చెప్పుకొంటూ వెళితే... 'జల్సా'లో 'మై హార్ట్ ఈజ్ బీటింగ్' పాట కూడా ఆయనే. ఆయన పాటలో ప్రేక్షకుడి హార్ట్ ఉంటుంది. బీట్ ఉంటుంది. ఏ తరానికి అయినా ఆయన పాటలు నచ్చుతాయని చెప్పాలి. 'డిస్కో రాజా'లో 'రమ్ పమ్ రమ్' వంటి పార్టీ సాంగ్స్ కూడా సిరివెన్నెల పాటల్లో ఉన్నాయి.

ప్రేమ పాటలు, విరహ గీతాలు, పెళ్లి నేపథ్యంలో వచ్చే పాటలు, సాహిత్య విలువలు ఉన్న సాంగ్స్, ప్రజల్ని చైతన్యం చేసేవి, ప్రశ్నించేవి... ఎన్నో పాటలు సిరివెన్నెల సీతారామశాస్త్రి రాశారు. అవన్నీ ఒకెత్తు... నిరాశ, నిస్పృహల్లో ఉన్నవారికి తోడుగా నిలిచే రాసిన పాటలు మరో ఎత్తు. ఎంతోమందికి ఆయన్ను స్నేహితుడ్ని చేసిన పాటలు అవే. 'ఎప్పుడూ ఒప్పుకోవద్దురా ఓటమి' అని ఆయన ధైర్యాన్ని నింపారు. ప్రేమలో సమస్యలు వచ్చాయా? జీవితంలో ఇబ్బందులు ఉన్నాయా? ఉద్యోగం రాక నిరాశలో ఉన్నారా? అప్పుడు సిరివెన్నెల పాటలు వింటే మనకు, మనసుకు ధైర్యం ఇచ్చే స్నేహితుడు పక్కన ఉన్నట్టు ఉంటుంది.
Also Read: మనిషి జీవిత సారాన్ని పాటల్లో చెప్పిన రుషి... మహర్షి... సీతారామశాస్త్రి!
'ఒక లైఫ్... ఒకటంటే ఒక లైఫ్. ఇది కాదు అనుకుంటూ వదిలేస్తే వేరే అవకాశం రాదే! ఇది ఇంతే అనుకుంటే వందేళ్లు నేడే జీవించే వీలుందే' - 'ఊపిరి'లో సిరివెన్నెల సీతారామశాస్త్రి చెప్పిన తత్త్వం ఇది. 
'జాను'లో 'లైఫ్ ఆఫ్ రామ్', 'గోపాల గోపాల' సినిమాలో 'నీదే నీదే...', 'గోల్కొండ హై స్కూల్'లో 'జాగో...', 'జల్సా'లో 'చలోరే చలోరే చల్...', 'ముకుంద'లో 'చేసేదేదో చేసేయ్‌' - పాటలు వేరు, పాటల నేపథ్యాలు వేరు. అయితే... ఒక్కటి మాత్రం నిజం. ప్రతి పాట ప్రేక్షకులకు ఏదో నేర్పుతుంది. 'ఒక్కడు'లో సీతారామశాస్త్రి ఓ పాట రాశారు. 'సాహసం శ్వాసగా సాగిపో...' అని! ఆయన పాటలు వింటే జీవితంలో ఎన్ని బాధలు ఉన్నా... అలా సాహసం శ్వాసగా ముందుకు సాగిపోవాలని అనిపిస్తుంది. 'గమ్యం'లో ఆయన చెప్పినట్టు... 'ఎంత వరకు? ఎందు కొరకు' అని జీవితాన్ని అడక్కూడదు. గమనమే మన గమ్యం అయితే... బాటలో బతుకు దొరుకుతుంది. ఒకటి, రెండు కాదు... 'సిరివెన్నెల' పాటలో ఆణిముత్యాలు ఎన్నో! జీవితంపై ఆశను రేకెత్తించే పాట‌లెన్నో! మనకు అవసరమైనప్పుడు మనకు తోడుగా ఉంటాయి. పాటలతో ఎంతో మంది జీవితాలను ప్రభావితం చేసిన మనిషి, ఎంతోమందిని మార్చిన‌టువంటి మనిషి, మార్పు కోసం ప్ర‌య‌త్నించిన‌టువంటి మ‌నిషి కంటే గొప్ప ఆశావాది ఎవరు ఉంటారు? త‌న‌ది జ‌గ‌మంత కుటుంబం అని సీతారామశాస్త్రి అనుకున్నారు. అర్ధ‌రాత్రి ఏకాకిగా కూర్చుని పాట‌లు రాస్తూ... త‌న కుటుంబంలో కొంద‌రికైనా బ‌తుకు మీద ఆశ క‌లిగించాల‌ని ప్ర‌యత్నించారు.

పూల రెక్కలు, కొన్ని తేన చుక్కలు రంగరించి పాటల‌ను మ‌న‌ ముందుకు తీసుకొచ్చారో? ఏమో? ఆయన తిడుతూ పాడినా, రాసినా చెవులకు అమృతంగా తోచింది. ఇప్పుడు ఆయన పలుకు ఈ నేల నుంచి శాశ్వత విశ్రాంతి తీసుకుని ఉండవచ్చు. కానీ, ఆయన పాటలు ఎప్పటికీ విశ్రాంతి తీసుకోవు. మనతో ఉంటాయి. తెలుగు భాష‌ ఉన్నంత వరకూ, తెలుగు పాట జీవించి ఉన్నంత వ‌ర‌కూ ఉంటాయి. మ‌నం వింటూ ఉంటాం. 

'సిరివెన్నెల' సీతారామ‌శాస్త్రి సుమారు 800 చిత్రాల్లో మూడు వేల‌కు పైగా పాట‌లు రాశారు. ఇన్ని పాట‌లు రాసిన ఆయ‌న ఏం సంపాదించుకున్నారు? అంటే... క‌చ్చితంగా కోట్లాదిమంది అభిమాన‌మే. ఆయ‌న ఎప్పుడూ డ‌బ్బు కోసం పాట‌లు రాయ‌లేదు. 'రెడ్‌'లో ఆయ‌న రెండు పాట‌లు రాశారు. మ‌రో పాట రాయ‌మ‌ని వెళితే... క‌థంతా విన్న సిరివెన్నెల 'నేను రాసినా, మీరు చిత్రీక‌రించినా చివ‌ర‌కు సినిమాలోంచి తీసేస్తారు. ఈ క‌థ‌కు ఆ పాట క‌రెక్ట్ కాద'ని అన్నార‌ని నిర్మాత స్ర‌వంతి ర‌వికిశోర్ చెప్పారు. డ‌బ్బు కోసం చూసుకోలేద‌న్నారు. అదీ సిరివెన్నెల క్యారెక్ట‌ర్‌. క‌థంతా విని సినిమాకు అవ‌స‌ర‌మైన పాట‌లు, ఆ పాట‌ల్లో స్పేస్ తీసుకుని తాను చెప్పాల‌నుకున్న మంచిని 'సిరివెన్నెల' చెప్పారు. ద‌ర్శ‌కుడు, సంగీత ద‌ర్శ‌కుడు, క‌థానాయ‌కుడు చిన్నోడా? పెద్దోడా? కొత్తోడా? అని చూడ‌లేదు. నిర్మాత ఎక్కువ డ‌బ్బ‌లిస్తాడా? అని ఆలోచించ‌లేదు. క‌థ న‌చ్చితే పాట రాశారు. ప్రేక్ష‌కుల‌ మ‌న‌సు మీటారు.

- సత్య పులగం

Also Read: వేల పాటలు రాసిన సిరివెన్నెలకు నచ్చిన పాట ఏది? నెటిజన్ల ముచ్చట్లలో ఏం చెప్పారు?
Also Read: 'సిరివెన్నెల' కోసం అయ్యప్పమాల తీసి మరీ వచ్చిన చిరంజీవి... ఆస్పత్రిలో చేరడానికి ముందు ఫోనులో మాట్లాడగా!
Also Read: భీమ్లా నాయక్ పాట విడుదల చేయడం లేదు... ఆర్ఆర్ఆర్ ట్రైలర్ కూడా
Also Read: తొలి పాటకే ‘నంది’ అవార్డు.. ఆ సాహిత్యం కోసం ఆయన పడిన కష్టం ఇదే!
Also Read: సిరివెన్నెల దృష్టిలో 'క్లిష్టమైన పాట..'
ఇంట్రస్టింగ్‌ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్‌ చేయండి

Published at : 01 Dec 2021 01:18 AM (IST) Tags: Sirivennela Seetharama Sastry Sirivennela Sirivennela Sitharama Sastry సిరివెన్నెల

ఇవి కూడా చూడండి

Naga Panchami Today Episode మోక్ష కంటే ముందు తానే చనిపోవాలని నిర్ణయించుకున్న పంచమి!

Naga Panchami Today Episode మోక్ష కంటే ముందు తానే చనిపోవాలని నిర్ణయించుకున్న పంచమి!

Sandeep Reddy Vanga: వర్మ ‘యానిమల్’ రివ్యూపై స్పందించిన సందీప్ - కొన్ని విషయాలు పక్కన పెట్టాల్సిందే!

Sandeep Reddy Vanga: వర్మ ‘యానిమల్’ రివ్యూపై స్పందించిన సందీప్ - కొన్ని విషయాలు పక్కన పెట్టాల్సిందే!

Bigg Boss 7 Telugu: శోభాను కాలితో తన్నిన అమర్‌దీప్ - ఓట్లపై మోనిత ఓవర్ కాన్ఫిడెన్స్, ప్రియాంకతో వాదన

Bigg Boss 7 Telugu: శోభాను కాలితో తన్నిన అమర్‌దీప్ - ఓట్లపై మోనిత ఓవర్ కాన్ఫిడెన్స్, ప్రియాంకతో వాదన

Bigg Boss 17: ‘బిగ్ బాస్’లో ముద్దులు పెట్టుకున్న కంటెస్టెంట్స్, రాత్రయితే రచ్చే - తిట్టిపోస్తున్న జనం

Bigg Boss 17: ‘బిగ్ బాస్’లో ముద్దులు పెట్టుకున్న కంటెస్టెంట్స్, రాత్రయితే రచ్చే - తిట్టిపోస్తున్న జనం

Rajashekar : జీవిత, జీవితం రెండు ఒక్కటే అనేది డైలాగ్ మాత్రమే - బయట వేరేవిధంగా ఉంటుంది: రాజశేఖర్

Rajashekar : జీవిత, జీవితం రెండు ఒక్కటే అనేది డైలాగ్ మాత్రమే - బయట వేరేవిధంగా ఉంటుంది: రాజశేఖర్

టాప్ స్టోరీస్

Telangana CM Revanth Reddy: సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి తొలి ట్వీట్ చూశారా! వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు

Telangana CM Revanth Reddy: సీఎం అయ్యాక రేవంత్ రెడ్డి తొలి ట్వీట్ చూశారా! వారందరికీ ప్రత్యేక ధన్యవాదాలు

Revanth Reddy: తెలంగాణను ఏలుతున్న ఫ్యామిలీని ముంచేసిన సునామీ రేవంత్ రెడ్డి!

Revanth Reddy: తెలంగాణను ఏలుతున్న ఫ్యామిలీని ముంచేసిన సునామీ రేవంత్ రెడ్డి!

Revanth Reddy Political Career: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిది- వివాదాలు, కేసులతోనూ సంచలనమే!

Revanth Reddy Political Career: టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి రాజకీయ ప్రస్థానమిది- వివాదాలు, కేసులతోనూ సంచలనమే!

Chandrababu: 'తుపాను అప్రమత్తతలో ప్రభుత్వం విఫలం' - బాధితులకు సహాయం అందించాలని శ్రేణులకు చంద్రబాబు పిలుపు

Chandrababu: 'తుపాను అప్రమత్తతలో ప్రభుత్వం విఫలం' - బాధితులకు సహాయం అందించాలని శ్రేణులకు చంద్రబాబు పిలుపు
×