Nitish Records Alert: ఆసీస్ గడ్డపై నితీశ్ రికార్డుల జోరు.. తగ్గేదే లే అన్న సుందర్.. నాలుగో టెస్టులో మెరుగైన స్థితిలో టీమిండియా..
మెల్ బోర్న్ లో జరుగుతున్న నాలుగో టెస్టులో మెరుపు సెంచరీతో తెలుగు ప్లేయర్ నితీశ్ పలు రికార్డులను బద్దలు కొట్టాడు. దీంతో బాక్సింగ్ డే టెస్టులో భారత్ మెరుగైన స్థితిలో నిలిచింది.
Ind Vs Aus 4th Test Updates: ఆస్ట్రేలియాతో జరుగుతున్న నాలుగో టెస్టులో భారత ప్లేయర్లు నితీశ్ కుమార్ రెడ్డి, వాషింగ్టన్ సుందర్ పలు రికార్డులను బద్దలు కొట్టారు. 147 ఏళ్ల టెస్టు చరిత్రలో నెం.8, నెం.9లో బ్యాటింగ్ కు దిగిన నితీశ్, సుందర్.. 150 బంతులు చొప్పున ఎదుర్కొన్న బ్యాటర్లుగా నిలిచారు. అంటే ఇప్పటివరకు టెస్టు చరిత్రలో వరుసగా నెం.8, నెం.9 బ్యాటర్లు 150 బంతులను ఎదర్కోలేదు. తాజాగా ఈ రికార్డును నితీశ్-సుందర్ ద్వయం తమ ఖాతాలో వేసుకుంది. దీంతో శనివారం మూడోరోజు వర్షం, వెలుతురు లేమీ కారణంగా ఆట ముగిసేసరికి ఇండియా 116 ఓవర్లలో 9 వికెట్లకు 358 పరుగులు చేసింది. ఆట ముగిసేసరికి నితీశ్ సూపర్ సెంచరీ (176 బంతుల్లో 105 బ్యాటింగ్, 10 ఫోర్లు, 1 సిక్సర్), మహ్మద్ సిరాజ్ (2 బ్యాటింగ్) క్రీజులో ఉన్నారు. ప్రస్తుతం ప్రత్యర్థి కంటే ఇంకా 116 పరుగుల వెనుకంజలో ఉంది. బౌలర్లలో కమిన్స్ , బోలాండ్ లకు మూడేసి వికెట్లు దక్కాయి. నాథన్ లయన్ రెండు వికెట్లతో సత్తా చాటాడు.
8 sixes by Nitish Kumar Reddy in this series so far 🚀
— ESPNcricinfo (@ESPNcricinfo) December 28, 2024
The joint-most by a visiting batter in a Test series in Australia
via @StarSportsIndia | #AUSvIND pic.twitter.com/FpfbXXGOkQ
ఆదుకున్న నితీశ్-సుందర్ ద్వయం..
శనివారం మూడో రోజు ఓవర్ నైట్ స్కోరు 165/5తో ఆట కొనసాగించిన భారత్ కు కాసేపటికే రెండు ఝలక్ లు తాకాయి. వికెట్ కీపర్ బ్యాటర్ రిషభ్ పంత్ (28) అనవసర షాట్ కు ప్రయత్నించి ఔటవ్వగా, రవీంద్ర జడేజా (17)ను లయన్ వికెట్ల ముందు దొరకబుచ్చుకున్నాడు. దీంతో 221/5తో భారత్ ఫాలో ఆన్ గండం అంచున నిలిచింది. ఈ దశలో నితీశ్-సుందర్ ద్వయం అమోఘమైన ఆటతీరు ప్రదర్శించింది. తమకు కావల్సినంత సమయం తీసుకుని, ఓపికగా ఆడారు. ఆ తర్వాత ఒకవైపు నితీశ్ దూకుడుగా ఆడగా, సుందర్ మాత్రం ఆచితూచి ఆడాడు. ఇలా దాదాపు 47 ఓవర్లపాటు బ్యాటింగ్ చేశారు. కమిన్స్ పలుసార్లు బౌలర్లను మార్చి మార్చి ప్రయోగించినా ఫలితం లేకపోయింది. ఈ క్రమంలో తొలుత టెస్టుల్లో తొలి ఫిఫ్టీని 81 బంతుల్లో నితీశ్ పూర్తి చేసుకున్నాడు. ఆ తర్వాత సుందర్ కూడా నెమ్మదిగా ఆడి 146 బంతుల్లో అర్థ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. వీరిద్దరూ సమయోచితంగా ఆడటంతో తొలుత ఫాలో ఆన్ గండాన్ని తప్పించుకున్న భారత్.. ఆ తర్వాత పరుగుల లోటును క్రమంగా తగ్గించుకుంటూ వచ్చింది. చివర్లో సుందర్ ను అద్భుతమైన బంతితో లయన్ బోల్తా కొట్టించగా, జస్పీత్ బుమ్రా నిర్లక్ష్యపు షాట్ తో డకౌటయ్యాడు. ఈ దశలో నితీశ్ సెంచరీపై టెన్షన్ రేగగా, సిరాజ్ సహాకారంతో తన దైన శైలిలో నితీశ్ బౌండరీతో శతాకాన్ని పూర్తి చేసుకున్నాడు. అంతకుముందు పెవిలియన్ లో నితీశ్ తండ్రి ముత్యాల రెడ్డి, తన కొడుకు సెంచరీ కోసం పలుమార్లు దేవుడిని ప్రార్థించాడు. సెంచరీ తర్వాత భావోద్వేగానికి గురయ్యాడు. ఆ తర్వాత చుట్టు పక్కల ఉన్న అభిమానులు ఆయనను కలిసి ఆనందం వ్యక్తం చేశారు.
సిక్సర్లతో రికార్డు..
అద్భుతమైన సెంచరీతో దుమ్ము రేపిన నితీశ్.. ఆసీస్ గడ్డపై అనితర సాధ్యమైన రికార్డును నెలకొల్పాడు. కంగారూ గడ్డపై ఒక సిరీస్ లో అత్యధిక సిక్సర్లు బాదిన భారత ప్లేయర్ గా రికార్డును తన సొంతం చేసుకున్నాడు. ఈ సిరీస్ లో తను 8 సిక్సర్లను బాదాడు. దీంతో 8 సిక్సర్లు బాదిన బ్యాటర్లు అయిన మైకేల్ వాన్ (ఇంగ్లాండ్-2002 యాషెస్), క్రిస్ గేల్ (వెస్టిండీస్-2009) సరసన చేరాడు. ఇంకా తను బ్యాటింగ్ చేస్తుండటం, సూపర్ ఫామ్, మరో టెస్టు మిగిలి ఉండటంతో ఈ రికార్డు తన ఖాతాలో వేసుకోవడం ఖాయంగా కనిపిస్తోంది. అలాగే ఆసీస్ గడ్డపై టెస్టు సెంచరీ చేసిన మూడో పిన్న భారతీయుడిగా నితీశ్ రికార్డులకెక్కాడు. గతంలో సచిన్ (18 ఏళ్లు), రిషభ్ పంత్ (21 ఏళ్లు) ఈ ఘనత సాధించారు. మరోవైపు మెల్ బోర్న్ టెస్టులో భారత్ ఇంకా ఓటమి నుంచి బయట పడలేదు. నాలుగో రోజు వీలైనంత సేపు బ్యాటింగ్ చేసి, ప్రత్యర్థి ఆధిక్యాన్ని తక్కువ చేస్తేనే ఇండియాకు సానుకూలంగా ఉంటుంది.