Tirupati Crime News: విద్యార్థినిపై ప్రొఫెసర్ లైంగిక దాడి, గర్భం దాల్చిన బాధితురాలు.. తిరుపతిలో దారుణం
తిరుపతిలోని సంస్కృత విశ్వవిద్యాలయంలో బీఈడీ విద్యార్థినిపై లైంగిక దాడి ఆరోపణలు రావడంతో ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లపై కేసు నమోదు చేసిన తిరుపతి పోలీసులు విచారణ చేపట్టారు.

తిరుపతి: యూనివర్సిటీ విద్యార్థినిపై అత్యాచారం చేసి గర్భవతిని చేయడం ఏపీలో కలకలం రేపుతోంది. తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో ఈ దారుణం జరిగింది. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన తిరుపతి ఈస్ట్ పోలీసులు విచారణ చేపట్టారు. తనకు జరిగిన అన్యాయం, తనపై జరుగుతున్న కీచకపర్వాన్ని వర్సిటీ వీసీకి ఫిర్యాదు చేసిన తరువాత బాధిత విద్యార్థిని ఒడిశాకు వెళ్లిపోయింది.
బీఈడీ విద్యార్థినిపై లైంగిక దాడికి పాల్పడ్డాడని అసిస్టెంట్ ప్రొఫెసర్ పై ఆరోపణలు రాగా, మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ వీడియోలు తీసి విద్యార్థినిని లైంగిక వేధింపులకు గురిచేస్తున్నాడని అభియోగాలు ఉన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..
తిరుపతిలోని జాతీయ సంస్కృత విశ్వవిద్యాలయంలో అసిస్టెంట్ ప్రొఫెసర్ గా చేస్తున్న డాక్టర్ లక్ష్మణకుమార్ కొంతకాలం నుంచి ఓ బీఈడీ ఆ విద్యార్థినిని లైంగికంగా వేధిస్తున్నాడు. విద్యార్థినిని బెదిరించి, లోబరుచుకుని ఆమెపై లైంగిక దాడి చేయడంతో బాధితురాలు గర్భం దాల్చింది. ఈ విషయాన్ని బయటకు చెప్పకూడదని ప్రొఫెసర్ ఆమెను బెదిరించినట్లు సమాచారం. మరో అసిస్టెంట్ ప్రొఫెసర్ శేఖర్‌రెడ్డి బాధిత విద్యార్థినికి సంబంధించిన వీడియోలు తీసి ఆమెను బ్లాక్ మెయిల్ చేస్తున్నాడు. తన కోరిక తీర్చాలని, తాను చెప్పినట్లు చేయాలని విద్యార్థినిని లైంగికంగా వేధిస్తున్నారు. అసలే గర్భం దాల్చడం, ఆపై వేధింపులు భరించలేక విద్యార్థిని కొన్ని రోజుల కిందటే వీసీ కృష్ణమూర్తికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేసినట్లు సమాచారం.
అసిస్టెంట్ ప్రొఫెసర్‌పై వర్సిటీ చర్యలు
లైంగిక దాడికి పాల్పడిన అసిస్టెంట్ ప్రొఫెసర్ లక్ష్మణకుమార్ ను డిసెంబర్ 1న సస్పెండ్ చేశారు. దాంతో ఆయన కాలేజీకి రావడం లేదని విద్యార్థులు చెబుతున్నారు. యూనివర్సిటీ ఇన్‌ఛార్జి వీసీ రజనీకాంత్ శుక్లా తిరుపతి పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్లు లక్ష్మణ్ కుమార్, శేఖర్ రెడ్డిలపై కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. పోలీసులు ఇద్దరు అసిస్టెంట్ ప్రొఫెసర్ల సెల్‌ఫోన్లను సీజ్ చేసి ఫోరెన్సిక్ ల్యాబ్‌కు పంపారు. కాగా, విద్యార్థినిపై లైంగిక దాడి ఆరోపణలపై అంతర్గత విచారణ జరిపేందుకు యూనివర్సిటీ అంతర్గత ఫిర్యాదుల కమిటీ (ICC)ని నియమించినట్లు తెలుస్తోంది.






















