Sirivennela Seetharama Sastry Death: 'సిరివెన్నెల' సీతారామ శాస్త్రి ఇక లేరు.. సాహిత్యానికి ముందు సాధారణ వ్యక్తిగా..
పాటలు రాసిన తొలి సినిమా పేరును ఇంటి పేరుగా మార్చుకున్న గేయ రచయిత 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి. ఆయన్ను గేయ రచయిత అనడం కంటే కవి అనడం సబబు. సినిమా పాటకు పేరు తీసుకొచ్చిన కవి ఆయన.
పాటలు రాసిన తొలి సినిమా పేరును ఇంటి పేరుగా మార్చుకున్న గేయ రచయిత 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి. ఆయన్ను గేయ రచయిత అనడం కంటే కవి అనడం సబబు. సినిమా పాటకు పేరు తీసుకొచ్చిన కవి ఆయన. ఎన్నో వేల పాటలను తెలుగు ప్రేక్షకులకు అందించిన ఆయన ఇకలేరు.
'సిరివెన్నెల' సీతారామశాస్త్రి ఈ లోకాన్ని విడిచి పైలోకాలకు వెళ్లిపోయారు. ఈ రోజు (నవంబర్ 30, 2021) కిమ్స్ ఆస్పత్రిలో కన్నుమూశారు. ఆయన ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉండటంతో ఈ నెల 22న ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. మధ్యలో ఆయన పరిస్థితి అత్యంత విషమంగా ఉందని వార్తలు వచ్చాయి. అయితే... కుటుంబ సభ్యులు వాటిని ఖండించారు. తీవ్ర అనారోగ్య పరిస్థితుల్లో లేరని చెప్పారు. మళ్లీ సోమవారం 'సిరివెన్నెల' పరిస్థితి అత్యంత విషమంగా ఉన్నట్టు వార్తలు వచ్చాయి. ఒక్క రోజు గడిచిందో... లేదో... ఆయన లేరనే వార్త వినాల్సి వచ్చింది.
'సిరివెన్నెల' సీతారామశాస్త్రి అసలు పేరు చేంబోలు సీతారామశాస్త్రి. చేంబోలు ఆయన ఇంటి పేరు. ఆయన జన్మించినది మధ్యప్రదేశ్ రాష్ట్రంలోని శివనిలో జన్మించారు. చేంబోలు వేంకట యోగి, సుబ్బలక్ష్మి దంపతులకు ఆయన తొలి సంతానం. అక్కడ నుంచి స్వస్థలమైన విశాఖపట్టణం జిల్లాలోని అనకాపల్లికి వేంకట యోగి వచ్చారు. 'సిరివెన్నెల' బాల్యం అంతా అక్కడే గడిచింది. హైస్కూల్ వరకూ అనకాపల్లిలో చదువుకున్నారు. తర్వాత 1971లో కాకినాడలోని ఆదర్శ్ జూనియర్ కాలేజీలో ఇంటర్ చదివారు. 1973లో పీఆర్ కాలేజీలో బీకామ్ చేరారు. అదే ఏడాది ఆంధ్ర వైద్య కళాశాలలో ఎంబీబీఎస్ జాయిన్ అయ్యారు. ఒక్క ఏడాది చదివారో... లేదో.. ఆయనకు 1974 సెప్టెంబర్ నెలలో టెలికాం శాఖలో అసిస్టెంటుగా ఉద్యోగం లభించింది. రాజమండ్రిలో 1974లో... తాడేపల్లి గూడెంలో 1975లో పని చేశారు. ఆ తర్వాత కాకినాడకు ట్రాన్సఫర్ అయ్యింది. 1983 వరకూ అక్కడే పని చేశారు. ఆ కాలంలోనే ఆంధ్రా యూనివర్సిటీ నుంచి బీఏ పట్టా పొందారు. తర్వాత ఎంఏ జాయిన్ అయ్యారు. కానీ, ఓ ఏడాది తర్వాత చదువు ముగించారు.
కాకినాడలో పని చేస్తున్న సమయంలో సాహితీలోకంతో పరిచయమైంది. 'భరణి' అనే పేరుతో ఆంధ్రప్రభ, ఆంధ్రజ్యోతి, విజయ తదితర పత్రికలకు కథలు, కవితలు పంపించారు. సుమారు ఓ పదిహేను కథల వరకూ రాశారు. ఆ తర్వాత ఆయనలో ప్రతిభను గుర్తించిన కళాతపస్వి కె. విశ్వనాథ్... 'సిరివెన్నెల' సినిమాలో పాటలు రాసే అవకాశం ఇచ్చారు. ఆ తర్వాత అదే ఆయన ఇంటి పేరు అయ్యింది. అక్కడ నుంచి తెలుగు సినిమాలో 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి ప్రయాణం ఓ చరిత్ర అయ్యింది. ఎన్నో సినిమాల్లో పాటలకు ప్రాణం పోసిన ఆ కలం నేడు శాశ్వతంగా విశ్రాంతి తీసుకుంది.
Also Read: మనిషి జీవిత సారాన్ని పాటల్లో చెప్పిన రుషి... మహర్షి... సీతారామశాస్త్రి!
Also Read: సిరివెన్నెల రాసిన ఈ రెండు పాటలే చివరివి... ఆర్ఆర్ఆర్‌లో ఆ పాట కూడా...
Also Read: సిరివెన్నెల పాట.. ప్రశ్నించే తూటా..
Also Read: వేల పాటలు రాసిన సిరివెన్నెలకు నచ్చిన పాట ఏది? నెటిజన్ల ముచ్చట్లలో ఏం చెప్పారు?
ఇంట్రస్టింగ్ వీడియోలు, విశ్లేషణల కోసం ABP Desam YouTube Channel సబ్‌స్క్రైబ్ చేయండి