Songs Sirivennela : మనిషి జీవిత సారాన్ని పాటల్లో చెప్పిన రుషి... మహర్షి... సీతారామశాస్త్రి!
మనిషి జీవిత సారాన్ని పాటల్లో చెప్పిన రుషి... 'సిరివెన్నెల' సీతారామశాస్త్రి. ఆయన పాటల రచయిత మాత్రమే కాదు, గొప్ప కవి. ప్రజల్ని చైతన్యం చేసే, ప్రభావితం చేసే మహర్షి.
![Songs Sirivennela : మనిషి జీవిత సారాన్ని పాటల్లో చెప్పిన రుషి... మహర్షి... సీతారామశాస్త్రి! Rushi ... Maharshi ... Sitaramashastri who narrated the essence of human life in songs! Songs Sirivennela : మనిషి జీవిత సారాన్ని పాటల్లో చెప్పిన రుషి... మహర్షి... సీతారామశాస్త్రి!](https://feeds.abplive.com/onecms/images/uploaded-images/2021/11/30/ae26fd76ffb592d09fffa95fca337676_original.jpg?impolicy=abp_cdn&imwidth=1200&height=675)
'సిరివెన్నెల' సీతారామశాస్త్రి సినిమా పాటల రచయితగా మాత్రమే చెప్పుకుంటే మనల్ని మనం వంచన చేసుకోవడమే. ఆయన పాటల రచయిత మాత్రమే కాదు.. తన రచనల ద్వారా గొప్ప కవిగా , మేధావిగా, ఫిలాసఫర్‌గా, ఉత్తేజపరిచే ప్రసంగకుడిగా ఎన్నో విధాలుగా ప్రభావితం చేశారు. వీటన్నిటికీ మించి ఆయన గొప్ప మనిషి, మానవత్వానికి ప్రతినిధి. ఆయన దశాబ్దాలుగా మీడియాకు ఇంటర్యూలు ఇస్తూ ఉన్నారు. ఆయన సందర్భం వచ్చినప్పుడల్లా ఓ మాట చెబుతూంటారు. అదేమిటంటే.. తనలోనికవిని ఫిలాసఫర్, ఫిలాసఫర్ ని మనిషి డామినేట్ చేస్తూ ఉంటారని వ్యాఖ్యానించారు. 'సిరివెన్నెల' పాటలు అన్నిటిలోనూ పరుచుకున్నది మనిషి గుండె లోతులే.
హృదయానికి హత్తుకునే ప్రేమ గీతాల్ని అయినా, ఆధ్యాత్మిక పాటలైనా, ప్రజల్ని చైతన్య వంతుల్ని చేసే విప్లవ గీతాలైనా.. ఇలా ఏ పాటనైనా ప్రశ్నల రూపంలో కూడా రాసి మెప్పించవచ్చు అని నిరూపించి కొత్త ఒరవడిని సృష్టించిన ఘనత సిరివెన్నెలకే దక్కుతుంది. సిరివెన్నెలలా జనంలోకి చొచ్చుకుపోయిన సినిమా కవి మరొకరు కనిపించరు. పండిత పామరులని ఒకేలా అలరించడం సిరివెన్నెలకే సాధ్యపడింది. ఆయన పాట ఎందరికో జీవితాన్ని నేర్పింది, కొందరికి జీవితమే అయ్యింది. సిరివెన్నెల పాటతో ప్రేమలో పడి, ఆయన పాటతో నవ్వుకుని, ఆయన పాట ద్వారా బాధపడి, ఆయన పాటతో బాధ దించుకుని, ఆయన పాటతో ప్రేరణ పొంది, జీవితాన్ని దిద్దుకుని, ఆయననే నమ్ముకుని బ్రతుకులోని నవరసాలనీ తెలుసుకున్నవారు ఎందరో ఉన్నారు. సిరివెన్నెల లేకపోతే తాను లేనని రచయిత భాస్కరభట్ల లాంటి వారు నేరుగానే చెబుతున్నారు. అలాంటి వారు కోకొల్లలు.
సీతారామశాస్త్రికి అత్యంత ఇష్టమైన పాట 'నేను జగమంత కుటుంబం నాది'. ప్రభాస్ హీరోగా కృష్ణవంశీ దర్శకత్వంలో వచ్చిన ఈ పాట అర్థం ఓ రకంగా మానవ జీవితమే. తన జీవితమే ఆ పాట రూపంలో వచ్చిందని ఆయన తరచూ చెబుతూంటారు. ఎంతో మంది అభిమానుల్ని, కొన్ని కోట్ల మంది కుటుంబాల్లో ఒకడినయ్యానునని అంటూ ఉంటారు. అది ఆయన ఒక్కరి జీవితంలోనే కాదు... ప్రతి ఒక్కరి జీవిత సారాంశం ఆ పాట. 'అర్థ శతాబ్దపు అజ్ఞానాన్ని స్వతంత్ర మందామా?' అని సిగ్గులేని జనాన్ని నిగ్గదీసిన కలం ఆయనది. ఇది సమాజం నుంచి వేరుపడి, సమాజం కంటే ఉన్నతుణ్ణి అనుకున్న మనిషి సమాజానికి చేసే నీతిబోధ కాదు, సమాజంలోని భాగమైన మనిషి తనలోకి, తనలోని సమాజంలోకి తొంగి చూసుకోవడం అని ఆయన చెప్పారు.
టాప్ హెడ్ లైన్స్
ట్రెండింగ్ వార్తలు
![ABP Premium](https://cdn.abplive.com/imagebank/metaverse-mid.png)
![Nagesh GV](https://cdn.abplive.com/imagebank/editor.png)