YS Jagan Latest News:పథకాలన్నీ పాయే! బాబు ష్యూరిటీ- మోసం గ్యారంటీ, చంద్రబాబుపై జగన్ విమర్శలు
YS Jagan Latest News:ఆంధ్రప్రదేశ్‌లో ఆర్థిక విధ్వంసం జరుగుతోందని వైఎస్ జగన్ ఆరోపించారు. ఏపీ అభివృద్ధికి విజన్‌తో తాము చేసిన పనులు నాశనం చేస్తున్నారని మండిపడ్డారు.

YS Jagan Latest News: ఆంధ్రప్రదేశ్‌లో కూటమి అధికారంలోకి వచ్చి 9 నెలలు అవుతున్నా హామీల అమలు చేయలేకపోతున్నారని వైసీపీ అధినేత జగన్ విమర్శించారు. బాబు ష్యూరిటీ- భవిష్యత్‌కు గ్యారంటీ అని ప్రచారం చేశారని ఇప్పుడు అది బాబు ష్యూరిటీ మోసం గ్యారంటీ అన్నట్టు మారిందని ఎద్దేవా చేశారు. ఇంటింటికీ వెళ్లి పథకాలు ఇస్తామని ఊదరగొట్టారని బాండ్లు కూడా ఇచ్చారని అన్నారు. అవన్నీ ఇప్పుడు ఏమయ్యాయని ప్రశ్నించారు.
అప్పుల విషయంలో కూటమి ప్రభుత్వం కొత్త రికార్డులు సృష్టించిందన్నారు జగన్. అమరావతి పేరుతో 52 వేల కోట్లు అప్పులు చేశారని అన్నారు. ఇప్పుడు తీసుకొచ్చినవే కాకుండా తీసుకురాబోతున్న అప్పులు కలుపుకుంటే లక్షా 45వేల కోట్ల పైమాటే అన్నారు. ఇంత అప్పులు తీసుకొచ్చి పేదలకు ఏమైనా బటన్ నొక్కారా అని ప్రశ్నించారు. గతంలో తాము అమలు చేసిన పథకాలు ఏమైనా కొనసాగుతున్నాయా అని నిలదీశారు. సూపర్ 6 లేదు సూపర్ 7 లేవని అన్నారు.
జగన్ పూర్తి ప్రెస్‌మీట్ కోసం ఇక్కడ చూడండి
ఇంకా జగన్ ఏమన్నారంటే" హామీలకు గ్యారంటీ అంటూ బాండ్లు కూడా పంచారు. అమలు చేయలేకపోతే చొక్కాపట్టుకోండని అన్నారు. నిలదీయమని చెప్పారు. ఇప్పుడు మీరు ఇచ్చిన బాండ్‌లు ఏమయ్యాయి. ఎవరి చొక్కా పట్టుకోవాలి. 9 నెలల కాలంలో చంద్రబాబు పాలనలో చూస్తున్నది ఇది.
మరోవైపు చూస్తే రాష్ట్రానికి చెందిన అప్పులు 9నెలల కాలంలోనే బడ్జెటరీ అప్పులే 80,825కోట్లు. ఇవి కాకుండా అమరావతి పేరు చెప్పి ఇప్పటికే తెచ్చిన అప్పులు, తేబోతున్న అప్పులు 52 వేల కోట్లలు. అన్నీ కలిపితే ఏకంగా లక్షా 45 వేల కోట్ల పైమాటే. ఇది నిజంగా రికార్డే.
ఇన్ని అప్పులు చేసినా పేదలకు ఏమైనా బటన్ నొక్కారా. సూపర్ 6 పథకాలు ఇచ్చారు. అందరూ ఆలోచన చేయాలి. గతంలో మా ప్రభుత్వం పెట్టిన పథకాలు ఏమైనా కొనసాగించారా. అమ్మఒడి పాయే, రైతభరోసా పాయే, వసతి దీవెన పాయే, విద్యాదీవెన అరకొర, చేయూత లేదు ఆసరా లేదు. సున్న వడ్డీ, ఆరోగ్య శ్రీ ఎగనామమే.ఇలా గతంలో ఉన్న పథకాలన్నీ కూడా పాయే, పిల్లలకు ట్యాబ్‌లు ఇచ్చే కార్యక్రమం పాయే. లక్షా 45 వేల కోట్ల రూపాయల అప్పులు ఎవరు జేబులోకి పోతున్నాయి.
9 నెలల కాలంలో కొత్త ఉద్యోగం ఇచ్చిన దాఖలాలు లేవు కానీ, వలంటీర్ ఉద్యోగాలు తీసేశారు. 18 వేల మంది బ్రేవరీస్ కార్పొరేషన్‌లో ఉద్యోగాలు పాయే, ఫైబర్, వైద్యారోగ్యశాఖ, ఫీల్డ్ అసిస్టెంట్‌లు ఇలా వేల సంఖ్యలో ఉద్యోగాలు తీసేశారు. సచివాలయాల్లో పని చేస్తున్న వారిని డిస్‌లొకేట్ చేసి ఇతర విభాగాల్లో సర్దుబాటు చేస్తున్నారు. వలంటీర్లను ఎలా మోసం చేశారో చూశాం. పదివేలు అన్నారు పూర్తిగా వారిని తొలగించారు.
ఉద్యోగస్తులలను కూడా మోసం చేశారు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ అన్నారు. ఇంత వరకు రూపాయి ఇచ్చింది లేదు. మెరుగైనా పీఆర్సీ అన్నారు. ఉన్న పీఆర్సీ చైర్మన్‌ను రాజీనామా చేయించారు. కొత్తది వేయలేదు. మొదటి నెల 1తేదీని జీతాలు ఇచ్చారు. మిగతా నెలల్లో ఇవ్వడం లేదు. డీఏలు పెండింగ్, ఇతర అలెవెన్స్‌లు పెండింగ్. ఉద్యోగుల డబ్బులు కూడా తానే వాడుకుంటున్నారు.
ఇవాళ రాష్ట్రంలో జరుగుతోంది ఇది. ఆర్థిక విధ్వంసం అంటే ఇది. ఏపీని సుస్థిర రాష్ట్రంగా మార్చేందుకు పోర్టులను అభివృద్ధి చేశాం. నాలుగు పోర్టులను కట్టడం జరిగింది. రామయ్యపట్నం 80 శాతం పూర్తి అయింది. మూలపేట, మచిలీపట్నం పోర్టు పనులు శరవేగంగా జరుగుతున్నాయి. పది పిషింగ్ హార్బర్లు పనులు జరుగుతున్నాయి. భవిష్యత్‌లో వీటి విలువ లక్షల కోట్లు. ఇలాంటివి స్కామ్‌లు చేస్తూ అమ్మకానికి పెట్టారు. ఆర్థిక టై అప్‌లు చేసి ఉంచాం. డబ్బులు డ్రా చేసుకొని పోర్టులు పూర్తి చేయచ్చు.
17 వైద్య కళాశాలలు ఏర్పాటు చేశాం. దీని వల్ల పేదల జీవాతాలు మెరుగుపడతాయి. ఆ మెడికల్ కాలేజీలను తమ వాళ్లకు అమ్మేయబోతోంది. కేంద్రం మెడికల్ సీట్లు ఇస్తామంటే వద్దని లేఖ రాసిన ప్రభుత్వం ఏపీ.
చంద్రబాబు దృష్టిలో సంపద దృష్టి అంటే తన వాళ్ల ఆస్తులు పెంచుకోవడమే.. ఇవాళ రాష్ట్రంలో జరగని స్కామ్ లేదు. ఇసుక స్కామ్, ఉచితమని చెప్పి గతం కంటే డబుల్ రేట్‌కు అమ్ముతున్నారు. ప్రభుత్వ రంగంలో నడిచే మద్యం షాపులను ప్రవేటికరణ చేశారు. ఇదే కారణంలో కేజ్రీవాల్‌ను జైల్లో పెట్టారు. తన వాళ్లకు షాపులన్నీ ఇప్పించుకున్నారు. అవి ఎలా జరిగాయో అందరికీ తెలుసు. మళ్లీ ఎమ్మెల్యేలు బెల్ట్ షాపులకు వేలం పిలుస్తున్నారు.
చంద్రబాబు, చిన్నబాబు ఆధ్వర్యంలో స్కామ్‌లు నడిపిస్తున్నారు.. ప్రతి నియోజకవర్గంలో పేకాట క్లబ్‌లు ఉన్నాయి. ప్రతి నియోజకవర్గంలో ఏదైనా వ్యాపారం నడవాలంటే ఎమ్మెల్యేకు ఎంతోకొంత ఇస్తే సాగేది. ఆయన పెద్దబాబుకు, చిన్నబాబుకు, దత్తపుత్రుడికి సమర్పించుకుంటున్నారు.
కాంట్రాక్టర్లకు పది శాతం మొబలైజేషన్ ఇస్తున్నారు. అందులో 8 శాతం తీసుకుంటున్నారు. మా హయాంలో జ్యుడీషియల్ ప్రివ్యూకు వెళ్లేవాళ్లం. రివర్స్ టెండర్ల ప్రక్రియ కూడా రద్దు చేశారు. ఇవన్నీ చేస్తున్నారు కాబట్టే సంపద సృష్టి జరగడం లేదు.
ఇన్ని చేస్తున్న చంద్రబాబును క్వశ్చన్ చేస్తారని రెడ్ బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారు. ఎవరైనా అడిగితే చాలా వాళ్లనను హింసిస్తున్నారు. చీటింగ్‌లో పీహెచ్‌డీ తీసుకున్నచంద్రబాబు నటన ఏ స్థాయిలో ఉంటుంది అంటే తాను ఇచ్చిన హామీలను తానే ఎగ్గొట్టి బాధగా ఉంటుందని అంటారు.
ఇవన్నీ ఎన్నికల ప్రచారంలో చెప్పాను. చెప్పినా ప్రజలు పొరపాటు పడ్డారు. ఇప్పుడు బాధపడుతున్నారు. మోసం చేసే పద్దతిలో మెల్లిగా ప్రజల్లోకి ఎక్కిస్తున్నారు." అని జగన్ అన్నారు.





















