Naresh: ‘మా’ భవనంపై మంచు విష్ణునే మాట్లాడతారు - క్లారిటీ ఇచ్చిన సీనియర్ నరేష్!
మా (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) భవనం నిర్మాణంపై సీనియర్ నటుడు నరేష్ స్పందించారు.
టాలీవుడ్ సీనియర్ నటుడు నరేష్ ‘మా’ (మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) భవనం నిర్మాణంపై స్పందించారు. ఫిల్మ్ ఛాంబర్ ఎన్నికల్లో పాల్గొనడానికి వచ్చిన నరేష్‌కు విలేకరుల నుంచి ‘మా’ భవనం ఎప్పుడు కడతారనే ప్రశ్న ఎదురైంది.
దానికి నరేష్ సమాధానం ఇస్తూ ‘అది ‘మా’ ప్రెసిడెంట్ (మంచు విష్ణు) చెప్పాలి. అది ఆల్రెడీ వర్కింగ్‌లో ఉంది. దీనికి సంబంధించిన రిజల్యూషన్ కూడా జనరల్ బాడీలో పాస్ అయింది. దాని గురించి నాకంటే కూడా మా ప్రెసిడెంట్ చెప్తే బాగుంటుంది.’ అని నవ్వుతూ సమాధానం ఇచ్చారు.
మరోవైపు తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్(Telugu Film Chamber Of Commerce)లో జరిగిన ఎన్నికల్లో ప్రముఖ నిర్మాత దిల్ రాజు ప్యానెల్ విజయం సాధించింది. ఆయన ప్యానెల్‌లో పోటీ చేసిన 12 మందిలో ఏడుగురు గెలిచారు. సి.కళ్యాణ్ ప్యానెల్ నుంచి ఐదుగురు విజయం సాధించారు.
దిల్ రాజు ప్యానెల్ నుంచి ఆయనతో పాటు దామోదర ప్రసాద్, మోహన్ వడ్లపాటి, పద్మిని, స్రవంతి రవికిశోర్, రవిశంకర్ యలమంచిలి, మోహన్‌గౌడ్ విజేతలుగా నిలిచారు. ఈ ఎన్నికల్లో మొత్తంగా 1339 ఓట్లు పడ్డాయి. వీటిలో ప్రొడ్యూసర్ సెక్టార్‌లో 891, డిస్ట్రీబ్యూషన్ సెక్టార్‌లో 380, స్టూడియో సెక్టార్‌లో 68 ఓట్లు పోల్ అయ్యాయి. ప్రొడ్యూసర్స్ సెక్టార్‌లో దిల్ రాజు ప్యానెల్‌కు 563 ఓట్లు రాగా, సి.కళ్యాణ్ ప్యానెల్ 497 ఓట్లు సాధించింది.
స్టూడియో సెక్టార్‌లో గెలిచిన నలుగురిలో ముగ్గురు దిల్ రాజుకు ప్యానెల్‌కు చెందినవారే కావడం విశేషం. డిస్ట్రిబ్యూటర్ సెక్టార్‌లో ఇరువురి ప్యానెల్ నుంచి చెరో ఆరుగురు విజయం సాధించారు. దీంతో పదవి ఎవరిని వరిస్తుందనే విషయంపై ఆసక్తి నెలకొంది. దిల్ రాజు, సి.కళ్యాణ్ సభ్యులు డిస్ట్రిబ్యూటర్స్ విభాగంలో గెలుపొందిన సభ్యులతో చర్చలు జరుపుతున్నారు. వారిలో ఒకరి మద్దతు దిల్ రాజుకు దొరికినా ఆయనే అన్ని విభాగాల్లో విజేతగా నిలవనున్నారు.
ఆదివారం ఉదయం ప్రారంభమైన తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ ఎన్నికల్లో దర్శకుడు రాఘవేంద్రరావు, ఆదిశేషగిరిరావు, శ్యాంప్రసాద్ రెడ్డి, సురేష్ బాబు, జీవిత, తమ్మారెడ్డి భరద్వాజ, పోసాని కృష్ణమురళి, సుప్రియ, గుణశేఖర్ తదితరులు పాల్గొని తమ ఓటు హక్కును వినియోగించుకున్నారు. డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ ఫలితాలు సమం కావడంతో.. ఫైనల్ రిజల్ట్ ఇంకా ప్రకటించలేదు.
పదవుల విషయంలో ఇరు ప్యానెల్స్ వారు పట్టుదలతో ఉండటంతో ఫలితాల రాక మరింత ఆలస్యమయ్యే అవకాశం ఉంది. దిల్ రాజ్ ప్యానెల్‌లో మొత్తం 24 మంది సభ్యులు గెలవగా.. సి.కళ్యాణ్ ప్యానెల్‌లో 20 మంది విజయం సాధించారు. 25 ఓట్లతో మెజారిటీ సాధించినవారికే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ పగ్గాలు దక్కుతాయి.
సీనియర్ నిర్మాతలు ఎవరూ ముందుకు రాకపోవడం వల్లనే తాను తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్ అధ్యక్ష పదవికి పోటీ చేస్తున్నట్లు నిర్మాత దిల్ రాజు ఎన్నికలకు ముందు ప్రకటించారు. ఫిల్మ్ ఛాంబర్ అధ్యక్షుడిగా ఎన్నికైతే కిరీటం పెట్టరని, పైగా ఇంకా సమస్యలు పెరుగుతాయని దిల్ రాజు ఈ సందర్భంగా అన్నారు. పరిశ్రమ అభివృద్ధి కోసం తాను ఎన్నికల్లో పోటీ చేయక తప్పడం లేదని తెలిపారు.