మమ్ముటి ఇంట్లో విషాదం - తల్లి ఫాతిమా కన్నుమూత!
ప్రముఖ నటుడు మమ్మూటి ఇంట్లో విషాదం చోటుచేసుకుంది. ఆయన తల్లి ఫాతిమా అనారోగ్యంతో శుక్రవారం కన్ను మూశారు.
పవిత్ర రంజాన్ పండుగకు ఒక్క రోజు ముందు మలయాళ స్టార్ హీరో మమ్ముట్టి ఇంట్లో తీవ్ర విషాదం నెలకొంది. ఆయన తల్లి ఫాతిమా ఇస్మాయిల్ తుది శ్వాస విడిచారు. గత కొంతకాలంగా అనారోగ్య సమస్యలతో బాధ పడుతున్న 93 ఏండ్ల ఫాతిమా, కొచ్చిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుది శ్వాస విడిచారు.
మమ్ముట్టి స్వగ్రామంలో ఫాతిమా అంత్యక్రియలు
మమ్ముట్టి మాతృమూర్తి ఫాతిమా అంత్యక్రియలు ఇవాళ సాయంత్రం జరగనున్నాయి. ఆయన స్వగ్రామం కొట్టాయం సమీపంలోని చెంపులో ఈ అంతిమ సంస్కారాలు నిర్వహించనున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మమ్ముట్టి తల్లి మృతి వార్త తెలియడంతో మలయాళీ సిని ప్రముఖులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. ఆమె ఆత్మకు శాంతి చేకూరాలని ఆకాంక్షించారు. పలువురు సినీ అభిమానులు సైతం మమ్ముట్టి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.
శశిథరూర్ ట్వీట్ తో అందరికీ తెలిసింది!
అటు కాంగ్రెస్ ఎంపీ శశి థరూర్ సైతం ముమ్ముట్టి తల్లి మృతి గురించి సోషల్ మీడియా వేదికగా స్పందించారు. వాస్తవానికి ఆయన ట్వీట్ తర్వాతే చాలా మందికి మమ్ముట్టి తల్లి చనిపోయిందనే విషయం తెలిసింది. ఈ సందర్భంగా ఆయన ఫాతిమా మృతి పట్ల సంతాపం వ్యక్తం చేశారు. “ఈ రోజు ఉదయం ముమ్ముట్టితో మాట్లాడాను. ఆయన తల్లి గారు చనిపోయారు. ఆమె మృతికి నా సంతాపాన్ని వ్యక్తం చేశాను. నేను పెద్దవాడిగా ఎదుగుతున్న కొద్దీ నా కన్నతల్లికి మరింత చేరువయ్యాను. అమ్మతో ఉన్న ఆ అపురూపమైన బంధం గురించి నాకు బాగా తెలుసు. తల్లిని కోల్పోయిన బాధ నుంచి ఆయన కోలుకోవాలని కోరుకుంటున్నా” అంటూ ట్వీట్ చేశారు.
Spoke to @mammukka this morning to express my sincere condolences on the passing of his mother. As I have grown older I have become much closer to my own mother, & I am aware of the preciousness of this irreplaceable bond. May he find the peace of mind to cope w/his loss. pic.twitter.com/s7ThIIb8lz
— Shashi Tharoor (@ShashiTharoor) April 21, 2023
తెలుగులో సూపర్ హిట్ సినిమాల్లో నటించిన మమ్ముట్టి
ఇక ఫాతిమాకు ఆరుగురు పిల్లలు. ముగ్గురు కొడుకులు. ముగ్గురు బిడ్డలు. వారిలో మమ్ముట్టి పెద్దవాడు. రెండో కుమారుడు ఇబ్రహీం కుట్టి కూడా నటుడిగా రాణిస్తున్నాడు. ఆమె మనవడు దుల్కర్ సల్మాన్ కూడా స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. ముమ్ముట్టి మలయాళ ప్రేక్షకులతో పాటు తెలుగు సినీ అభిమానులకు బాగా తెలిసిన నటుడు. దాదాపు ఐదు దశాబ్దాలుగా మమ్ముట్టి మలయాళ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతున్నారు. తెలుగులోనూ పలు సూపర్ హిట్ సినిమాల్లో నటించారు. ‘స్వాతి కిరణం’, ‘సూర్య పుత్రులు’, ‘దళపతి’ లాంటి సినిమాలతో మంచి గుర్తింపు తెచ్చుకున్నారు. త్వరలో విడుదల కాబోతున్న ‘ఏజెంట్’ సినిమాలోనూ కీలకపాత్రలో నటించారు. మమ్ముట్టి కొడుకు దుల్కర్ సల్మాన్ కూడా తెలుగు సినీ లవర్స్ కు బాగా తెలుసు. ‘మహానటి’ చిత్రంలో ఆయన నటనకు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. గత ఏడాది ‘సీతారామం’ సినిమాతో దేశ వ్యాప్తంగా అద్భుత గుర్తింపు తెచ్చుకున్నారు. తండ్రీ కొడుకులు ఇద్దరూ వరుస సినిమాలతో బాగా బిజీగా ఉన్నారు.
Read Also: ‘లియో’ను పాన్ ఇండియా మూవీగా రిలీజ్ చేయడం విజయ్‌కు ఇష్టం లేదా? చివరికి ఎలా అంగీకరించారు?