(Source: ECI/ABP News/ABP Majha)
Tollywood, Death Hoaxes: హథవిధీ, ఈ నటులను బతికుండగానే చంపేశారు.. ఎంత దారుణం!
సీనియర్ నటి.. ఊర్వశీ శారదను మీడియా బతికుండగానే చంపేసింది. ఇదివరకు కూడా పలువురు టాలీవుడ్ స్టార్లు ఇలాంటి ఫేక్ న్యూస్‌తో సమస్యలు ఎదుర్కొన్నారు.
బతికి ఉండగానే చంపేయడం మన మీడియాకి కొత్తేమీ కాదు. మీడియా అత్యుత్సాహం వల్ల ఇప్పటికే కొందరు సెలబ్రిటీలు ముప్పుతిప్పలు పడ్డారు. తమ మరణ వార్తలను తామే చదువుకునే ఇబ్బందికర పరిస్థితులను ఎదుర్కొన్నారు. చివరికి.. వారే జనం ముందుకు వచ్చి ‘మేం బతికే ఉన్నాం’ అని చెప్పుకొనే దుస్థితి రావడం నిజంగా బాధాకరం. తాజాగా సీనియర్ నటి ఊర్వశి శారదకు ఇలాంటి పరిస్థితే ఎదురైంది.
శారద బతికి ఉండగానే మరణవార్తలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టాయి. కొన్ని మీడియా సంస్థలు సైతం బ్రేకింగ్ న్యూస్ ఇచ్చాయి. దీంతో శారదనే స్వయంగా స్పందించాల్సి వచ్చింది. నేను క్షేమంగానే ఉన్నానని, ఆ వందతులు నమ్మవద్దని కోరారు. ఈ తప్పుడు సమాచారం వల్ల తనకు ఫోన్లు మీద ఫోన్లు వస్తున్నాయని ఆమె వాపోయారు.
ఈ పరిస్థితి శారదకు మాత్రమే కాదు.. గతంలో వేణు మాధవ్ కూడా ఈ సమస్యను ఎదుర్కొన్నారు. ఆయన చాలాసార్లు మీడియా ముందుకు వచ్చి ‘‘నేను బతికే ఉన్నాను’’ అని మొరపెట్టుకున్నాడు. అలాగే ఎంఎస్ నారాయణ, కోట శ్రీనివాసరావులకు కూడా ఇలాంటి పరిస్థితే ఎదురైంది. కోట శ్రీనివాసరావు ఓ సందర్భంలో ప్రెస్ మీట్ పెట్టి మరీ దయచేసి నన్ను చంపకండయ్యా అని మీడియాను వేడుకున్నారు. ‘‘నేను ఇంకా బ్రతికే ఉన్నాను. మీ యూట్యూబ్ థంబ్‌నైల్స్ కోసం.. దయచేసి నేను బ్రతికి ఉండగానే చంపేయకండి” అని వేడుకొన్నారు. బాలీవుడ్‌లో దిలీప్ కుమార్ మరణ వార్తలపై కూడా ఎన్నో వదంతులు షికారు చేశాయి.
చనిపోయిన వ్యక్తుల పేర్లతో సెలబ్రిటీల పేర్లు కలవడం వల్ల ఇలాంటి పొరపాట్లు జరుగుతున్నాయి. ‘చిన్నదాన నీకోసం’ హీరోయిన్ మిస్త్రీ చక్రవర్తి విషయంలో ఇదే జరిగింది. బెంగాల్ నటి మిస్త్రీ బెనర్జీ చనిపోతే.. మిస్త్రీ చక్రవర్తి చనిపోయిందంటూ ప్రచారం జరిగింది. ఈ వార్తపై మిస్త్రీ స్పందిస్తూ.. ‘‘కొన్ని మీడియా సంస్థల కథనం ప్రకారం.. నేను ఈ రోజు చనిపోయాను. దేవుడి దయవల్ల నేను పూర్తి ఆరోగ్యంతో బాగానే ఉన్నాను. అది ఫేక్ న్యూస్’’ అని పేర్కొంది.
సెలబ్రిటీల మరణవార్తలపై మీడియా బాధ్యతయుతంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఆ వార్తలు నిజమో కాదో తెలుసుకున్న తర్వాతే ప్రజలకు అందిస్తే ఈ పొరపాట్లు జరగకుండా ఉంటాయి. అంతేకాదు.. అలాంటి వార్తలు ఆయా సెలబ్రిటీలను ఇబ్బందుల్లోకి నెట్టివేయడమే కాకుండా వారి కుటుంబ సభ్యులను, అభిమానులను సైతం కలవరపరుస్తాయి. వీరాభిమానులైతే గుండె ఆగి చనిపోయే ప్రమాదం కూడా ఉంది. ఇప్పటికైనా మీడియా శవాలపై నాణేలు వేరుకొనే దోరణిని మానుకుంటే బెటర్!
Also Read: నటి శారద మరణించారంటూ ఫేక్ న్యూస్.. స్పందించిన సీనియర్ నటి..
Also Read: ‘చచ్చిపోతుంటే వదిలేస్తామా?’ హేమాపై జీవిత ఫైర్.. మండిపడ్డ నరేష్!