Prabhas: చిన్నప్పుడే కమల్ హాసన్‌లా డ్రెస్సు వేసుకున్నా, లెజెండరీ నటులతో కలిసి పని చేయడం గర్వంగా ఉంది - ప్రభాస్
చిన్నప్పటి నుంచి కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ సినిమాలు చూస్తూ పెరిగానని ప్రభాస్ చెప్పారు. అలాంటి దిగ్గజ నటులతో కలిసి పని చేయడం గర్వంగా ఫీలవుతున్నట్లు వెల్లడించారు.
Prabhas About Kamal Hassan And Amitabh Bachchan: పాన్ ఇండియన్ స్టార్ ప్రభాస్ ప్రధాన పాత్రలో టాలెంటెడ్ డైరెక్టర్ నాగ్ అశ్విన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న సైన్స్ ఫిక్షన్ మూవీ ‘కల్కి 2898 AD’. విశ్వ నటుడు కమల్ హాసన్, బాలీవుడ్ దిగ్గజ నటుడు అమితాబ్ బచ్చన్ కీలక పాత్రలు పోషిస్తున్నారు. దీపికా పదుకొణె, దిశా పటానీ హీరోయిన్లుగా నటిస్తున్నారు. త్వరలో ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రానున్న నేపథ్యంలో చిత్రబృందం ప్రమోషన్ కార్యక్రమాలను ముమ్మరం చేసింది. ఇందులో భాగంగానే ‘బుజ్జి x భైరవ’ అనే ఈవెంట్ ను నిర్వహించింది.
లెజెండరీ నటులతో కలిసి సినిమా చేయడం గర్వంగా ఉంది - ప్రభాస్
‘బుజ్జి x భైరవ’ వేడుకలో చిత్రబృందంతో పాటు పెద్ద సంఖ్యలో అభిమానులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడిన ప్రభాస్ కీలక విషయాలు వెల్లడించారు. స్టార్ యాక్టర్లు కమల్ హాసన్, అమితాబ్ బచ్చన్ తో కలిసి పని చేయడం సంతోషంగా ఉందన్నారు. ఈ ఇద్దరు నటులను యావత్ సినిమా పరిశ్రమ ప్రేరణగా తీసుకుందని.. ఇప్పుడు వారితో కలిసి మూవీ చేసే అవకాశం తనకు రావడం గర్వంగా ఉందన్నారు.
“లెజెండరీ యాక్టర్లు అమితాబ్ బచ్చన్, కమల్ హాసన్ ను చూసి యావత్ ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీ స్ఫూర్తి పొందింది. అలాంటి స్టార్ యాక్టర్లతో కలిసి పని చేయడం సంతోషంగా, గర్వంగా ఉంది. సినిమా పరిశ్రమలో ఉన్న ప్రతి ఒక్కరు అమితాబ్ బచ్చన్ ను అభిమానిస్తూనే ఉంటారు. అందరం అతడిని స్ఫూర్తిగా తీసుకొని సినిమా రంగంలోకి వచ్చాం. అమితాబ్ లాంటి నటుడు భారత్ లో ఉన్నందుకు దేశం చాలా గర్వంగా ఫీలవ్వాలి. ‘సాగర సంగమం’ సినిమాలో కమల్ హాసన్ వేసుకున్న డ్రెస్సులు అప్పట్లో నాకు ఎంతో నచ్చాయి. అలాంటివి అమ్మను అడిగి తెప్పించుకుని వేసుకున్నాను. ఆయన నటనకు 100 దండాలు. దీపికా పదుకొణె ఓ సూపర్ స్టార్. దిశా పటానీ హాట్ స్టార్. ఈ సినిమాలో నాకు అవకాశం కల్పించిన నాగ్ అశ్విన్, అశ్వనీదత్ కు ధన్యవాదాలు. ప్రొడ్యూసర్ అశ్వనీ దత్ సర్‌కు డబ్బు భయం లేదు. ఈ వయసులోనూ సినిమాలపై ఆయనకు ప్రేమ తగ్గలేదు. సినిమా ఇండస్ట్రీలో 50 ఏళ్లుగా ప్రొడ్యూసర్‌గా ఉన్నది ఆయనొక్కరే. అశ్వనీ దత్ మాదిరిగానే ఆయన ఇద్దరు కుమార్తెలు కూడా కష్టపడతున్నారు. ఈ సినిమా కోసం పని చేసిన వారందరికీ థ్యాంక్స్” అని చెప్పుకొచ్చారు.
జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా విడుదల
‘కల్కి 2898 AD’ సినిమాను వైజయంతీ మూవీస్ బ్యానర్ పై అశ్వినీ దత్ నిర్మిస్తున్నారు. ఈ సినిమాకు సంతోష్ నారాయణన్ సంగీతం అందిస్తున్నారు. జూన్ 27న ప్రపంచ వ్యాప్తంగా పలు భాషల్లో ఈ సినిమాను విడుదల చేస్తున్నారు. ‘సలార్’ తర్వాత ప్రభాస్ హీరోగా వస్తున్న ఈ సినిమాపై భారీగా అంచనాలు నెలకొన్నాయి.