Oscars 2025 : ఆస్కార్ 2025 నామినేషన్లలో 'అనూజ'... ప్రియాంక చోప్రా నిర్మించిన ఈ షార్ట్ ఫిల్మ్ ఏ ఓటీటీలో ఉందో తెలుసా ?
Oscars 2025 : ప్రియాంక చోప్రా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించిన 'అనూజ' అనే షార్ట్ ఫిల్మ్ ఆస్కార్స్ 2025 లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీలో నామినేట్ అయ్యింది.

Oscars 2025 Nominations : అకాడమీ ఆఫ్ మోషన్ పిక్చర్ ఆర్ట్స్ అండ్ సైన్సెస్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న 2025 ఆస్కార్ నామినేషన్లను తాజాగా ప్రకటించింది. పలు కారణాల వల్ల 97వ అకాడమీ అవార్డుల నామినేషన్ల ప్రకటన చాలాసార్లు వాయిదా పడింది. ఎట్టకేలకు జనవరి 23న నటులు రాచెల్ సెన్నోట్, బోవెన్ యాంగ్ లైవ్-స్ట్రీమ్ ఈవెంట్ సందర్భంగా నామినేషన్ లో చోటు దక్కించుకున్న సినిమాలను ప్రకటించారు. ప్రఖ్యాత కోనన్ ఓబ్రెయిన్ డాల్బీ థియేటర్‌లో మార్చి 2న ఆస్కార్ అవార్డులను ప్రదానం చేయనున్నారు. నామినేషన్ల విషయానికొస్తే, 'ఎమిలియా పెరెజ్' 13 నామినేషన్లతో మొదటి స్థానంలో ఉండగా, విక్క్‌డ్, ది బ్రూటలిస్ట్ సినిమాలు ఒక్కొక్కటి 10 నామినేషన్లతో రెండవ స్థానంలో ఉన్నాయి. ఇదిలా ఉంటే ప్రియాంక చోప్రా, గునీత్ మోంగా నిర్మించిన షార్ట్ ఫిల్మ్ 'అనూజ' బెస్ట్ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్ కేటగిరీ నామినషన్ లో స్థానం సంపాదించింది.
'అనూజ' ఏ ఓటీటీలో ఉందంటే?
2024 హోలీషార్ట్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో లైవ్ యాక్షన్ షార్ట్ అవార్డును గెలుచుకున్న 'అనూజ' అనే ఈ షార్ట్ ఫిల్మ్ కు ప్రియాంక చోప్రా ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్‌గా వ్యవహరించారు. ఇక ఇప్పుడు ఇండియా తరపున 'అనూజ' ఆస్కార్స్ 2025లో లైవ్ యాక్షన్ షార్ట్ ఫిల్మ్‌లో నామినేట్ కావడం హర్షించదగ్గ విషయం. ఆడమ్ జె గ్రేవ్స్ దర్శకత్వం వహించిన ఈ షార్ట్ ఫిల్మ్ ను గ్రేవ్స్ ఫిలిమ్స్, షైన్ గ్లోబల్ ఇంక్, క్రుషన్ నాయక్ ఫిల్మ్స్ బ్యానర్లపై గునీత్ మోంగా కపూర్ ఈ నిర్మించారు. ఈ షార్ట్ ఫిల్మ్ ప్రస్తుతం నెట్ ఫ్లిక్స్ లో స్ట్రీమింగ్ అవుతోంది.
'అనూజ' స్టోరీ ఏంటంటే...
'అనూజ' అనే ఈ షార్ట్ ఫిలింని న్యూఢిల్లీలోని బట్టల మిల్లులో తన సోదరితో కలిసి పని చేసే తొమ్మిదేళ్ల అమ్మాయి అనూజ స్టోరీతో రూపొందించారు. బోర్డింగ్ స్కూల్లో చేరి, బాగా చదువుకోవాలని తపించే అనూజ చిన్న వయసులోనే కుటుంబ భారాన్ని మోయాల్సి వస్తుంది. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితిలో ఉన్న అనూజ తన భవిష్యత్తును మార్చుకోవడం కోసం బోర్డింగ్ స్కూల్లో చేరిందా? తన కలను నెరవేర్చుకోవడానికి ఆమె ఏం చేసింది? ఈ క్రమంలో ఆమెకు ఎదురైన సమస్యలేంటి? అనేది మూవీలో చూడాల్సిందే. సలామ్ బాలక్ ట్రస్ట్ (SBT) పార్టనర్షిప్ తో 'అనూజా'ను నిర్మించారు. మీరా నాయర్ కుటుంబం పని చేసే పిల్లలకు సపోర్ట్ గా స్థాపించిన సంస్థ ఇది.
ఇక మరో విశేషమేమిటంటే.. 2023లో 'ది ఎలిఫెంట్ విస్పరర్స్' అనే సినిమా ఆస్కార్ పురస్కారాల్లో బెస్ట్ డాక్యుమెంటరీగా అవార్డును గెలుచుకుంది. ఈ మూవీని కూడా నిర్మాత గునీత్ మోంగా కపూరే నిర్మించారు. ఇక ఈ లైవ్ యాక్షన్ షార్ట్ ఫిలిం క్యాటగిరిలో 'అనూజ' మాత్రమే కాదు ఏలియన్, ఐ యాం నాట్ ఏ రోబోట్, ది లాస్ట్ రేంజర్ నాట్ రిమైండ్ సైలెంట్ అనే సినిమాలు ఉన్నాయి.
బెస్ట్ మూవీ క్యాటగిరిలో ఉన్న సినిమాలు
ఇక ఈ ఏడాది ఆస్కార్ పురస్కారాల్లో బెస్ట్ ఫిల్మ్ క్యాటగిరిలో ఏకంగా 10 సినిమాలు నామినేషన్లు దక్కించుకున్నాయి. ఈ లిస్టులో ఎమిలియా పెరెజ్, అనోరా, డ్యూన్-2, ది బ్రూటలిస్ట్, ఏ కంప్లీట్ అన్‌నౌన్, కాంక్లేవ్, ఏ రియల్ పెయిన్, సింగ్ సింగ్, ది సబ్‌స్టాన్స్, విక్క్‌డ్ వంటి సినిమాలు ఉన్నాయి. అయితే ఇందులో 'ఎమిలియా పెరెజ్' మాత్రం ఏకంగా 13 నామినేషన్లు సాధించి ఆస్కార్ రేసులో అగ్రస్థానంలో ఉండడం విశేషం. ఇలా ఒక సినిమాకు ఏకంగా 13 నామినేషన్లు రావడం అన్నది ఇదే మొదటిసారి కాదు. గతంలో ఆల్ అబౌట్ ఈవ్, లా లా ల్యాండ్, టైటానిక్ లాంటి సినిమాలు ఏకంగా ఆస్కార్స్ లో 14 విభాగాల్లో నామినేషన్లు దక్కించుకొని సరికొత్త రికార్డును క్రియేట్ చేశాయి. ఇప్పుడు 'ఎమీలియా ఫెరోజ్' కూడా 13 నామినేషన్లతో అందరి దృష్టిని ఆకర్షించింది.





















