Hema Committee Report: మాలీవుడ్‌లో మృగాళ్ల పేర్లు బయట పెట్టాలి - హేమ కమిటీ రిపోర్టుపై మలయాళ డైరెక్టర్స్ డిమాండ్
Film Employees Federation of Kerala: హేమ కమిటీ రిపోర్టు మలయాళ సినిమా ఇండస్ట్రీలో ప్రకంపనలు సృష్టిస్తోంది. లేటెస్టుగా మాలీవుడ్ డైరెక్టర్స్ యూనియన్ స్పందించింది.
మలయాళ సినిమా ఇండస్ట్రీ గురించి నేషనల్ లెవల్‌లో డిస్కషన్ జరుగుతోంది ఇప్పుడు. హేమ కమిటీ రిపోర్టు పలు ప్రకంపనలకు దారి తీస్తోంది. ఫిల్మ్స్, ఫిల్మ్ ఇండస్ట్రీలో మహిళల మీద లైంగిక వేధింపులు, అసభ్య పదజాలంతో దూషించిన ఘటనల గురించి పుకార్లు తరచూ వినపడుతూ ఉంటాయి. అయితే, హేమ కమిటీ రిపోర్టుతో షాకింగ్ ఫ్యాక్టర్స్ బయటకు వచ్చాయి. ఇప్పుడు ఆ రిపోర్టులో మృగాళ్ల పేర్లు బయట పెట్టాలని మలయాళ డైరెక్టర్స్ డిమాండ్ చేస్తున్నారు. పూర్తి వివరాల్లోకి వెళితే...
వేధింపులకు పాల్పడిన వ్యక్తుల పేర్లు బయట పెట్టాలి!
మలయాళ సినిమా ఇండస్ట్రీలో చీకటి కోణాలను హేమ కమిటీ రిపోర్టు బయట పెట్టింది. లైంగిక వేధింపుల నుంచి మొదలు పెడితే క్యాస్టింగ్ కౌచ్, ఫిమేల్ - మేల్ ఎంప్లాయిస్ మధ్య రెమ్యూనరేషన్ డిఫరెన్స్, లాబీయింగ్ వంటి విషయాలు అన్నీ ఆగస్టు 19న బయటకు వచ్చాయి. ఈ రిపోర్టు నేపథ్యంలో 'అమ్మ' (అసోసియేషన్ ఆఫ్ మలయాళం మూవీ ఆర్టిస్ట్స్ అసోసియేషన్) అధ్యక్షుడిగా ప్రముఖ మలయాళ స్టార్ మోహన్ లాల్ రాజీనామా చేశారు. ఆయనతో పాటు 17 మంది బాడీ మెంబర్స్ సైతం తమ రాజీనామాలు సమర్పించారు.
మోహన్ లాల్ సహా 'అమ్మ' కమిటీ సభ్యులు రాజీనామా చేసిన తర్వాత 'ఫిల్మ్ ప్లాయిస్ ఫెడరేషన్ ఆఫ్ కేరళ' (FEFKA) డైరెక్టర్స్ యూనియన్ హేమ కమిటీ రిపోర్టు మీద స్పందించింది. మలయాళ సినిమా ఇండస్ట్రీలో విప్లవాత్మక మార్పులకు ఇది ప్రారంభం అని, మార్పు వస్తుందని ఆశిస్తున్నట్టు తెలిపింది.
లైంగిక వేధింపులకు పాల్పడిన మృగాళ్ల పేర్లు బయట పెట్టాలని డిమాండ్ చేసింది. దోషులకు కఠిన శిక్ష పడాలని ఆశించింది. కేసు కోర్టు పరిధిలో ఉంది కనుక అంత కంటే ఎక్కువ స్పందించలేమని పేర్కొంది.
ఆరేళ్ళ నుంచి సమస్యలను తొక్కి పెడుతున్నారా?
ఎంపీ, ప్రముఖ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ సైతం హేమ కమిటీ రిపోర్టు, సినీ ఇండస్ట్రీలో మహిళల మీద స్పందించింది. ''ఐటమ్ సాంగ్స్ ప్రమోట్ చేస్తారు. కానీ, ఇండస్ట్రీలో ఇతర మహిళలు చేసే మంచి సినిమాలను ప్రమోట్ చేయరు. ఈ విషయంలో నాకు చాలా నిరాశగా ఉంటుంది. మలయాళ సినిమాలో మహిళల మీద వేధింపుల విషయానికి వస్తే... ఆరేళ్ళ నుంచి వాస్తవాలను తొక్కి పెడుతున్నారు. సినిమాల్లో మహిళల మీద హింసను ప్రేరేపించే సన్నివేశాల్లో ఎటువంటి మార్పులు లేవు. కేరళ సినిమా రిపోర్టు గురించి నేను ఎప్పటి నుంచో చెబుతున్నాను'' అని కంగనా రనౌత్ అన్నారు.
ప్రముఖ తమిళ నటి, జాతీయ మహిళా కమిషన్ సభ్యురాలు ఖుష్భూ సైతం ఈ హేమ కమిటీ రిపోర్టు మీద స్పందించారు. ఒక్క మలయాళ సినిమా ఇండస్ట్రీలో మాత్రమే కాదని, ప్రతి ఇండస్ట్రీలో దాదాపుగా అటువంటి పరిస్థితులు ఉన్నాయని ఆవిడ పేర్కొన్నారు. వేధింపులకు గురైన మహిళలకు అండగా ఉండాల్సిన అవసరం ఉందని ఆమె చెప్పారు. ధైర్యంగా బయటకు వచ్చిన మహిళలను మెచ్చుకోవాలన్నారు. జయసూర్యతో పాటు కొందరు నటుల నుంచి తాను ఇబ్బందులు ఎదుర్కొన్నానని చెప్పిన తర్వాత నుంచి తనను బెదిరిస్తూ కొందరు మెస్సేజులు చేస్తున్నారని నటి మిను మునీర్ ఆవేదన వ్యక్తం చేశారు.